No Payments మూడు నెలలుగా చెల్లింపుల్లేవ్!
ABN , Publish Date - Aug 30 , 2026 | 12:24 AM
No Payments for Three Months! జిల్లాలోని పంచాయతీలను నిధుల సమస్య వెంటాడు తోంది. దీంతో గ్రామస్థాయిలో ఏ పనులూ జరగడం లేదు. ప్రధానంగా పారిశుధ్యం, తాగునీరు, వీధి దీపాల నిర్వహణ కష్టతరంగా మారింది. దీంతో పంచాయతీల పరిస్థితి దయనీయంగా మారింది.
బిల్లులు అప్‌లోడ్‌కాని వైనం
పల్లెల్లో పారిశుధ్యం, తాగునీరు, వీధి దీపాల నిర్వహణకు ఆటంకం
గరుగుబిల్లి, ఆగస్టు29(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని పంచాయతీలను నిధుల సమస్య వెంటాడు తోంది. దీంతో గ్రామస్థాయిలో ఏ పనులూ జరగడం లేదు. ప్రధానంగా పారిశుధ్యం, తాగునీరు, వీధి దీపాల నిర్వహణ కష్టతరంగా మారింది. దీంతో పంచాయతీల పరిస్థితి దయనీయంగా మారింది. వాస్తవంగా గతంలో పంచాయతీల్లో నిర్వహించిన వివిధ పనులకు సంబంధించిన బిల్లులను సీఎఫ్‌ఎం పోర్టల్‌లో నమోదు చేసేవారు. ఈ మేరకు సకాలంలో చెల్లింపులు జరిగేవి. ప్రస్తుతం సీఎఫ్‌ఎం పోర్టల్‌ను స్వర్ణ పంచాయతీగా మార్పు చేశారు. అయితే ఈ నూతన సైట్ పంచాయతీ బిల్లులు తీసుకోవడం లేదు. గత మూడు నెలలుగా చెల్లింపులు జరగడం లేదు. దీంతో అనేక పంచాయతీల్లో సమస్యలు తిష్ఠ వేశాయి. కొన్నిచోట్ల కార్యదర్శులు తప్పనిసరి పరిస్థితుల్లో చేతి సొమ్ముతో పారిశుధ్యం, వీధి దీపాల నిర్వహణతో పాటు రక్షిత నీటి పథకాల మరమ్మతులు వంటివి చేపడుతున్నారు.
ఇదీ పరిస్థితి..
- సర్పంచ్‌ల పదవీ కాలం పూర్తయిన తర్వాత పంచాయతీలకు ప్రత్యేకాధికారులను నియమించిన సంగతి తెలిసిందే. అయితే నూతన పోర్టల్ కారణంగా బిల్లులు జనరేట్ కావడం లేదు. దీంతో చెల్లింపులకు బ్రేక్ పడడంతో ప్రస్తుతం జిల్లాలోని 451 పంచాయతీల్లో ఏ పనులూ జరగడం లేదు. ఇదిలాఉండగా స్వర్ణ పంచాయతీ పోర్టల్‌లో పంచాయతీలకు సంబంధించిన బిల్లులను ప్రతి నెలా 16 నుంచి 20లోపు పొందుపర్చాల్సి ఉంది. మిగిలిన రోజుల్లో బిల్లులు అప్‌లోడ్ చేసినా ఫలితం ఉండదు. బిల్లులు పొందుపర్చేందుకు తక్కువ సమయం కేటాయింపు వంటి అంశాలు పంచాయతీ కార్యదర్శులకు తలనొప్పిగా మారింది. కాగా ఈ పోర్టల్ అంశం రాష్ట్ర పంచాయతీ కమిషనర్ పరిధిలో ఉండడంతో ఎవరూ నోరు మెదపడం లేదు.
- పంచాయతీల పరిధిలో విధులు నిర్వహిస్తున్న పలువురు సిబ్బంది చెల్లింపులకు సంబంధించి ఆటంకాలు లేవు. గ్రీన్ అంబాసిడర్లు, పంప్ ఆపరేటర్లతో పాటు పలువురికి సకాలంలో చెల్లింపులు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి నూతన పోర్టల్‌లో ఏ ఇబ్బందీ లేదు. తాగునీరు సరఫరా చేసే మోటార్లు మరమ్మతులు, మురుగు కాలువల్లో జల్లేందుకు అవసరమైన బ్లీచింగ్, దోమల నివారణ పిచికారీ మందులు, ఫాగింగ్, పూడికతీతలు, విద్యుత్ బిల్లులు వంటి ప్రధాన పనుల బిల్లులు మాత్రం అప్‌లోడ్ కావడం లేదు.
నివేదికలు పంపించాం..
పంచాయతీల్లో ప్రధాన సమస్యలపై ఉన్నతాధికారులకు నివేదికలు పంపించాం. బిల్లులు చెల్లింపుల కోసం గతంలో సీఎఫ్‌ఎం పోర్టల్‌లో నమోదు చేసేవాళ్లం. ప్రస్తుతం దానిని స్వర్ణ పంచాయతీ పోర్టల్‌గా మార్పు చేశారు. అయితే అది బిల్లులు తీసుకోవడం లేదు. ఈ విషయాన్ని రాష్ట్రస్థాయి పంచాయతీ కమిషనర్ దృష్టిలో పెట్టాం. స్వర్ణ పంచాయతీ వెబ్‌సైట్‌లో మార్పులు చేసేందుకు అవకాశం ఉంది.
- ఎస్.రవీంద్ర, జిల్లా పంచాయతీ అభివృద్ధి అధికారి, పార్వతీపురం మన్యం