No Payments 5 నెలలుగా చెల్లింపుల్లేవ్!
ABN , Publish Date - Jul 01 , 2026 | 12:02 AM
No Payments for Five Months! కేంద్రం ఉపాధి హామీ పథకంలో మార్పులు చేస్తూ తీసుకొచ్చిన వీబీ జీ రామ్‌జీ (వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్, ఆజీవిక మిషన్) పథకాన్ని జిల్లాలో బుధవారం నుంచి అమలు చేయనున్నారు. అయితే జూన్ నెలాఖరు వరకు ఉపాధి హామీ పథకంలో పూర్తయిన నిర్మాణాలు, వివిధ దశల్లో ఉన్న పనులకు సంబంధించి బిల్లుల చెల్లింపు కాలేదు.
కొన్నిచోట్ల పూర్తి కాని నిర్మాణాలు
నేటి నుంచి వీబీ జీ రామ్‌జీ అమలు
ఆందోళనలో కాంట్రాక్టర్లు.. చెల్లింపులపై ఆందోళన
పాత విధానంలో మంజూరవుతాయంటున్న అధికారులు
గరుగుబిల్లి, జూన్30(ఆంధ్రజ్యోతి): కేంద్రం ఉపాధి హామీ పథకంలో మార్పులు చేస్తూ తీసుకొచ్చిన వీబీ జీ రామ్‌జీ (వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్, ఆజీవిక మిషన్) పథకాన్ని జిల్లాలో బుధవారం నుంచి అమలు చేయనున్నారు. అయితే జూన్ నెలాఖరు వరకు ఉపాధి హామీ పథకంలో పూర్తయిన నిర్మాణాలు, వివిధ దశల్లో ఉన్న పనులకు సంబంధించి బిల్లుల చెల్లింపు కాలేదు. గడువు ముగుస్తుండడం, నూతన పథకం అమలులోకి వస్తుండడంతో జిల్లాలో ఆదరాబాదరాగా సీసీ, బీటీ రహదారుల నిర్మాణాలు పూర్తి చేశారు. కొంతమంది కాంట్రాక్టరు లక్షలు అప్పు చేసి నిర్మాణాలకు చొరవ చూపారు. అయితే గత ఐదు నెలలుగా బిల్లులు మంజూరు కాకపోవడంతో వారంతా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ పరిస్థితి..
ఉపాధి హామీ పథకంలో జిల్లాలో 1996 సీసీ రహదారులకు గాను రూ. 13,496.25 లక్షలు మంజూరు చేశారు. పలు గ్రామాల్లో ఫిబ్రవరి 8 నుంచి సీసీ రహదారుల పనులు చేపట్టారు. ఆ నెలలో పనులు పూర్తికాకపోవడంతో మార్చి నెలాఖరు వరకు గడువు పొడిగించారు. ఆర్థిక సంవత్సరం ముగియనున్న దృష్ట్యా చురుగ్గా పనులు చేపట్టారు. మొత్తంగా 903 రహదారులు పూర్తికాగా, మరో 90 వరకు పలు దశల్లో ఉన్నాయి. ప్రారంభం కాని రహదారులు సుమారు 1,003 వరకు ఉన్నాయి. గత ఐదు నెలలుగా సీసీ రహదారుల నిర్మాణం చేపట్టినా నేటికీ రుపాయి కూడా జమ కాలేదు. పూర్తయిన 903 రహదారులకు అవసరమైన ఎంబుక్‌లతో పాటు పనులు వివరాలను అప్‌లోడ్ చేశారు. అయినా బిల్లులు మంజూరు కాలేదు. అయితే జూన్ నెలాఖరుకు పూర్తయి రికార్డింగ్ చేసిన మేరకే చెల్లించనున్నారు. కాగా ఈ పనులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 90:10 నిష్పత్తిలో నిధులు మంజూరు చేయనున్నాయి. ‘నేటి నుంచి వీబీ జీ రామ్‌జీ పథకం మేరకే అభివృద్ధి పనులు, బిల్లుల చెల్లింపులు జరుగుతుతాయి. జూన్ నెలాఖరు వరకు నిర్వహించిన పనులకు మాత్రం ఉపాధి హామీ పథకం నిబంధనల మేరకు చెల్లింపులు జరుగుతాయి. కాగా పనుల నిర్వహణపై ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావాల్సి ఉంది. ’ అని పంచాయతీరాజ్ విభాగం ఈఈ జి.ప్రదీప్‌కుమార్ తెలిపారు.
చెరువుల కందకాలకే ప్రాధాన్యం
వీబీ జీ రామ్‌జీ పథకంలో చెరువుల కందకాలకే ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ప్రధానంగా సాగు నీటి చెరువుల అభివృద్ధి, మొక్కలు పెంపకంతో పాటు ఫీడర్ చానల్‌ను ప్రారంభిం చనున్నారు. 45 పంచాయతీల పరిధిలో ఇప్పటికే విధి విధానాలపై గ్రామసభలు నిర్వహించారు. నిబంధనల మేరకు 125 రోజుల పాటు వేతనదారులకు పనిదినాలు కల్పించనున్నారు. ఈ పనులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో నిధులు మంజూరు చేయనున్నాయి.
పనులకు ప్రతిపాదనలు
వీబీ జీ రామ్‌జీ నూతన పథకం మేరకు ఈ నెల ఒకటో తేదీ నుంచి వేతనదారులకు పనులు కల్పించేందుకు ప్రతిపాదనలు పంపించాలని మండల స్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేశాం. జూన్ నెలాఖరు వరకు ‘ఉపాధి’ పథకంలో పూర్తయిన సీసీ, బీటీ రహదారులు, నిర్మాణ దశల్లో ఉన్న పనులకు పాత విధానంలోనే బిల్లుల చెల్లింపులు జరుగుతాయి. నూతన పథకంలో నేటి నుంచి ప్రారంభయ్యే పనులకు సంబంధించి వేతనదారులకు ఈ నెల 7 నుంచి చెల్లింపులు చేస్తాం.
- పి.త్రివిక్రమరావు, డ్వామా ఏపీడీ, పార్వతీపురం