Share News

Build as You Please! ఎవరూ అడగరులే.. నచ్చినట్లు కట్టేయ్‌!

ABN , Publish Date - Jun 27 , 2026 | 11:55 PM

No One Will Ask… Build as You Please! సాలూరు మున్సిపాల్టీలో నిబంధనలకు విరుద్ధంగా షాపుల నిర్మాణం చేపట్టినా.. స్థలాలు ఆక్రమించుకున్నా పట్టించుకునే వారేకరువయ్యారు.

 Build as You Please! ఎవరూ అడగరులే.. నచ్చినట్లు కట్టేయ్‌!
ప్రభుత్వ స్థలంలో ఏర్పాటు చేసిన షాపులు

  • రోజురోజుకూ పెరిగిపోతున్న ఆక్రమణలు

  • కేవలం నోటీసులతోనే సరిపెడుతున్న అధికారులు

  • పట్టించుకోని పట్టణ ప్రణాళికా విభాగం

సాలూరు, జూన్‌ 26 (ఆంధ్రజ్యోతి):

సాలూరులోని ఓ బంగారు షాపునకు ఎదురుగా ఎలాంటి అనుమతులు లేకుండా ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటు చేశారు. ట్రాఫిక్‌ ఎక్కువగా ఉన్నచోట నిబంధనలకు విరుద్ధంగా హైవేపై ఇలా ఏర్పాటు చేయడంపై స్థానికులు పెదవి విరుస్తున్నారు. దీనివల్ల ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందోనని ఆందోళన చెందుతున్నారు.

సాలూరు పట్టణంలోని ప్రధాన రోడ్డుపై ఉన్న ఓ వస్ర్తాల షాపు నేమ్‌ బోర్డు ఏకంగా కాలువ దాటి రోడ్డు పైకి వచ్చేలా ఏర్పాటు చేశారు. నాలుగు రోడ్లు కూడలిగా ఉండే చోట నిబంధ నలకు విరుద్ధంగా ఇలా బోర్డు ఏర్పాటు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

.. ఇలా ఆ రెండు షాపులే కాదు.. సాలూరు మున్సిపాల్టీలో అనేకచోట్ల ఇటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా షాపుల నిర్మాణం చేపట్టినా.. స్థలాలు ఆక్రమించుకున్నా పట్టించుకునే వారేకరువయ్యారు. ఆక్రమిత స్థలాల్లో కొందరు చిన్నపాటి దుకాణాలు ఏర్పాటు చేసుకుని.. వాటిని అద్దెలకు ఇచ్చినా మున్సిపల్‌ అధికారులు కన్నెత్తి చూడడం లేదు. ప్రధానంగా పట్టణ ప్రణాళికా విభాగం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తుండడంతో ఆక్రమణదారులు రెచ్చి పోతున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా నచ్చినట్లుగా నిర్మాణాలు చేపడుతున్నారు. కొందరు వన్‌ ప్లస్‌ వన్‌, జీప్లస్‌ 2కు అనుమతులు పొంది.. అంతకు మించి నిర్మాణాలు చేపడుతున్నారు. ఏ మాత్రం నిబంధనలు పాటించకుండా పెద్దపెద్ద భవన సముదాయాలు నిర్మిస్తున్నారు. వాటిల్లో పార్కింగ్‌కు స్థలం కేటాయించడం లేదు. మున్సిపాల్టీలో ఇంత దారుణ పరిస్థితి ఉన్నా.. సంబంధిత అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఎవరికి నచ్చినట్లు వారు నిర్మాణాలు చేపడుతున్నా.. ఎందుకంత జాలి చూసిస్తున్నారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. పేదలు తమ సొంత స్థలంలో ఇల్లు కట్టుకున్నా, షాపు పెట్టుకున్నా ఎన్నో నిబంధనలు చెప్పి లక్షలాది రూపాయలు వసూలు చేస్తారు. అదే బడా బాబులు ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడుతున్నా.. అధికారులు స్పందించకపోవడంపై స్థానికులు పెదవి విరుస్తున్నారు. నిర్మాణాలను మొదటి దశలోనే అడ్డుకుంటే ఎవరికీ ఏ ఇబ్బందులు ఉండవని ప్రజల అభిప్రాయ పడుతున్నారు. కాగా ఇప్పటివరకు 30 మందికి ఒకసారి, 28 మందికి రెండుసార్లు మాత్రమే అధికారులు నోటీసులు ఇచ్చారు. 23 కేసులు కోర్టులో నడుస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు మున్సిపల్‌ అధికారులకు అనుకులంగా వచ్చిన తీర్పులు చాలా తక్కువనే చెప్పొచ్చు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు , ప్రజాప్రతినిధులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని పుర వాసులు కోరుతున్నారు.

దీనిపై పట్టణ ప్రణాళిక విభాగం అధికారి ఝన్సీని వివరణ కోరగా.. ‘నేను ఇక్కడ టీపీవోగా బాధ్యతలు స్వీకరించి 15 నెలలు కావస్తోంది. ఇప్పటివరకు 50 ప్లాన్‌లకు అనుమతులు ఇచ్చాం. సాలూరు మున్సిపాల్టీలో నిబంధనలకు విరుద్ధంగా ఎవరు నిర్మాణం చేపట్టినా తక్షణం చర్యలు తీసుకుంటాం. బంగారం, వస్ర్తాల షాపుల యజమానులకు రెండు సార్లు నోటీసులు ఇచ్చాం. ’ అని తెలిపారు. విద్యుత్‌ శాఖ ఏఈ నాగేశ్వరరావు మాట్లాడుతూ.. మున్సిపల్‌ అధికారులు అనుమతి ఇస్తేనే బంగారం షాపు ముందు, హైవేపై ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటు చేశామన్నారు.

Updated Date - Jun 27 , 2026 | 11:55 PM