Discharging Duties విధి నిర్వహణలో అలసత్వం వద్దు
ABN , Publish Date - Feb 21 , 2026 | 12:04 AM
No Negligence in Discharging Duties విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని జాయింట్ కలెక్టర్ యశ్వంత్‌కుమార్‌రెడ్డి హెచ్చరించారు. ఆసుపత్రికి వచ్చే రోగులతో వైద్యసిబ్బంది మర్యాదగా మెలగాలని, సత్వరమే చికిత్స అందించాలని ఆదేశించారు.
కొమరాడ, ఫిబ్రవరి20(ఆంధ్రజ్యోతి): విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని జాయింట్ కలెక్టర్ యశ్వంత్‌కుమార్‌రెడ్డి హెచ్చరించారు. ఆసుపత్రికి వచ్చే రోగులతో వైద్యసిబ్బంది మర్యాదగా మెలగాలని, సత్వరమే చికిత్స అందించాలని ఆదేశించారు. శుక్రవారం కూనేరు రామభద్రపురం పీహెచ్‌సీని ఆకస్మికంగా సందర్శించారు. ఆసుపత్రిలో వివిధ విభాగాలను పరిశీలించి.. రోగులకు అందుతున్న వైద్య సేవలు, సిబ్బంది హాజరుపై ఆరా తీశారు. మందుల నిల్వలను కూడా తనిఖీ చేశారు. గర్భిణులు, బాలింతలకు అందుతున్న పౌష్టికాహారం, వ్యాక్సినేషన్ ప్రక్రియ ఎలా జరుగుతుందని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి ప్రాం గణం, వార్డులు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, రోగులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు.
నాణ్యమైన సేవలందించాలి
వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించాలని జేసీ సూచించారు. కొమరాడలో గ్యాస్ ఏజెన్సీలు, పెట్రోల్ బంకులను క్షుణ్నంగా తనిఖీ చేశారు. నిత్యావసర వస్తువుల సరఫరాలో ఎటువంటి అవతకవకలకు పాల్పడినా సహించేది లేదన్నారు. నిరంతరం నిఘా ఉంచాలని సంబంధిత శాఖాధికారులను ఆదేశించారు. గ్యాస్ ఏజెన్సీ గోడౌన్‌లోని రిజిస్టర్లు పరిశీలించి సిలిండర్ల నిల్వలను తనిఖీ చేశారు. అనంతరం ఓ బంకులో పెట్రోల్ ,డీజిల్ నాణ్యతను, పరిశీ లించారు. బంకుల్లో తాగునీరు, మరుగుదొడ్లు సౌకర్యం ఉండాలన్నారు.
విద్యార్థులపై శ్రద్ధ చూపాలి..
గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులపై ఉపాధ్యాయులు శ్రద్ధ చూపాలని, వారి విద్యా ప్రమాణాలు మరింత మెరుగుపడేలా చర్యలు తీసుకోవాలని జేసీ ఆదేశించారు. పెదఖేర్జల, ఎండభద్ర గ్రామాల్లోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు. పెదఖేర్జల పాఠశాలలో విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. తరగతి గదులను సందర్శించి విద్యార్థుల అభ్యాసనా సామర్థ్యాలను పరీక్షించారు. అనంతరం ఎండభద్ర గిరిజన సంక్షేమ ఆశ్రమపాఠశాలలో తరగతి గదులు, స్టోర్ రూం, డార్మెటరీలను పరిశీలించి మార్గదర్శకాలు జారీ చేశారు. నిర్మాణంలో ఉన్న భవన నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. విద్యార్థులు అనారోగ్యానికి గురైతే తక్షణమే వైద్యం అందించాలన్నారు. అత్యవసరమైన మందులు అందుబాటులోఉంచుకోవాలని సూచించారు.