Share News

Public Issues ప్రజా సమస్యలపై నిర్లక్ష్యం వద్దు

ABN , Publish Date - Jun 08 , 2026 | 11:34 PM

No Neglect of Public Issues ప్రజా సమస్యలపై నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి హెచ్చరించారు. పీజీఆర్‌ఎస్‌కు వచ్చే వినతులన్నింటినీ పరిష్కరిం చాలని ఆదేశించారు. ఒకవేళ పరిష్కరించలేకపోతే అందుకు గల కారణాలను అర్జీదారులకు తెలియజేయాలని స్పష్టం చేశారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో ప్రజల నుంచి ఆమె వినతులు స్వీకరించారు.

 Public Issues  ప్రజా సమస్యలపై నిర్లక్ష్యం వద్దు
అర్జీదారుల సమస్యలు వింటున్న మంత్రి సంధ్యారాణి

  • పీజీఆర్‌ఎస్‌కు వచ్చే వినతులను పరిష్కరించాలి..

  • పాచిపెంట తహసీల్దార్‌, అటవీశాఖాధికారులపై ఆగ్రహం

పార్వతీపురం, జూన్‌8(ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యలపై నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి హెచ్చరించారు. పీజీఆర్‌ఎస్‌కు వచ్చే వినతులన్నింటినీ పరిష్కరిం చాలని ఆదేశించారు. ఒకవేళ పరిష్కరించలేకపోతే అందుకు గల కారణాలను అర్జీదారులకు తెలియజేయాలని స్పష్టం చేశారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో ప్రజల నుంచి ఆమె వినతులు స్వీకరించారు. వాటిని పరిశీలించి.. సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పీజీఆర్‌ఎస్‌కు రకరకాల మనస్తత్వాలు ఉన్నవారు వస్తుంటారని, అధికారులు విసుగు చెందకుండా ఓపికగా అర్జీలు పరిశీలించి చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లా దాటి సమస్యలు బయటకు వెళ్లకూడదన్నారు.

వినతులు ఇలా..

- మోసూరులో ప్రభుత్వ భవనాలను తొలగించి కొంతమంది అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నట్లు వచ్చిన ఫిర్యాదులపై ఎందుకు స్పందించడంలేదని పాచిపెంట తహసీల్దార్‌ను ప్రశ్నించారు. ఎన్నిసార్లు ఆ గ్రామ పెద్దలు ‘మీ చుట్టూ తిరగాలి’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ గ్రామంలో పేదల వద్ద పట్టాలు, మరొకరి వద్ద భూముఉంటే ఎందుకు పట్టించుకోవడం లేదన్నారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు సూచించారు.

- ఏనుగుల వల్ల పంటలతో పాటు ఆస్తి, ప్రాణనష్టం జరుగుతున్నా.. ప్రజలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నా.. ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరి స్తున్నారని అటవీశాఖాధికారులను మంత్రి ప్రశ్నించారు. తాను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు మూడు నెలల్లో గజరాజుల బెడద తప్పిస్తామని హామీ ఇచ్చిన అధికారులు ఇన్నాళ్లు ఏం చేశారని మండిపడ్డారు. ఏనుగుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ఆదేశించారు.

- తోటపల్లి ప్రాజెక్టు నిర్వాసితులు, వారి ఇళ్ల సమస్యపై సీపీఎం నాయకులు ఫిర్యాదు చేయగా.. దీనిపై జిల్లా అధికారులు దృష్టి సారించాలని మంత్రి సూచించారు. ఇక్కడ పరిష్కరించలేని పరిస్థితి ఉంటే ఇరిగేషన్‌శాఖ మంత్రితో మాట్లాడుతానని స్పష్టం చేశారు. పట్టాలు ఇచ్చినా ఇళ్ల స్థలాలు చూపించలేదని నిర్వాసితులు తెలపడంతో.. వెంటనే ఆ ప్రాంతానికి వెళ్లి సమస్యను పరిష్కరించాలని రెవెన్యూ , గృహనిర్మాణశాఖ అధికారులను ఆమె ఆదేశించారు.

- ఐటీడీఏ గిరిజన ఇంజనీరింగ్‌ విభాగంలో పనిచేసిన తన భర్త కొద్దికాలం కిందట మృతి చెందారని, తనకు ఇంకా ఉద్యోగం ఇవ్వలేదని ఓ మహిళ ఫిర్యాదు చేయడంతో వెంటనే ఆమెకు న్యాయం చేయాలని మంత్రి ఆదేశించారు.

- పార్వతీపురం వాసులకు కుళాయిల ద్వారా కలుషిత నీరు సరఫరా అవుతుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు డి.శ్రీనివాసరావు వినతి అందించగా.. పట్టణ ప్రజలకు సురక్షిత నీటిని అందించాలని మంత్రి సూచించారు. ఈ పీజీఆర్‌ఎస్‌లో కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి, పాలకొండ సబ్‌ కలెకర్‌ పవార్‌ స్నప్నిల్‌ జగన్నాథ్‌, ఎస్‌డీసీ ధర్మరాజు తదితరులు 75 వినతులు స్వీకరించారు.

మంత్రి ఎదుట ఇసుక పంచాయితీ..

- కొమరాడ మండలం కోరిశిలలో తమ డీపట్టా భూముల వద్ద ఇసుక తవ్వకాలకు అను మతులు రద్దు చేయాలని నాగేశ్వరరావు అనే వ్యక్తి మంత్రి సంధ్యారాణికి వినతిపత్రం అందించారు. అయితే రెవెన్యూ అధికారులు, తనకు ఎటువంటి ఫిర్యాదు చేయకుండానే.. వినతులు ఇచ్చినట్టు సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం చేశారని కలెక్టర్‌ అన్నారు. దీనిపై మంత్రి స్పందిస్తూ.. గతంలో ఎవరికైనా ఫిర్యాదు చేశావా? అని సదరు వ్యక్తిని ప్రశ్నించారు. ఆయన తడబడడంతో కలెక్టర్‌ను కలిశావా? అంటే కలవలేదన్నారు. స్పీడ్‌ పోస్టులో ఫిర్యాదు చేశానని చెప్పుకొచ్చారు. కనీసం ఎమ్మెల్యే దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లావా? అంటే అవునని నాగేశ్వరరావు చెప్పారు. దీంతో మంత్రి సంధ్యారాణి వెంటనే కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరికి ఫోన్‌ చేసి ఆరా తీశారు. అయితే ఈ అంశంపై తమకు ఎవరు ఫిర్యాదు చేయలేదని జగదీశ్వరి తెలిపారు. ఆ తర్వాత తహసీల్దార్‌కు కూడా అర్జీదారుడు ఫిర్యాదు చేయలేదని తేలడంతో ఇసుక తవ్వకాలపై విచారణ జరపాలని మంత్రి సంబంధిత అధికారులను ఆదేశించారు.

- తమకు కొమరాడ మండలం చాలా దూరమని, సీతానగరం మండలంలో ఇసుక తవ్వ కాలకు అనుమతులు మంజూరు చేయాలని ట్రాక్టర్‌ యజమానితో పాటు కొంతమంది మంత్రికి వినతిపత్రం అందించారు.

Updated Date - Jun 08 , 2026 | 11:34 PM