Share News

No more drinking water woes. తాగునీటి ఇక్కట్లు ఇక చెల్లు

ABN , Publish Date - Aug 04 , 2026 | 11:57 PM

No more drinking water woes. రాజాం మునిసిపాల్టీలో తాగునీటి కోసం ప్రజలు ఎదుర్కొంటున్న తిప్పలు త్వరలో తప్పను న్నాయి. రోజుల కొద్దీ నిరీక్షణ.. చాలీచాలని నీటి సరఫరాతో పడుతున్న ఇక్కట్లు తీరిపోనున్నాయి. ప్రభుత్వం అమృత్‌ 2.0 కింద రూ.9.81 కోట్ల నిధులు మంజూరు చేసింది.

No more drinking water woes. తాగునీటి ఇక్కట్లు  ఇక చెల్లు
వాసవినగర్‌లో తాగునీటి ట్యాంకు నిర్మాణానికి తవ్విన గొయ్యి

తాగునీటి ఇక్కట్లు

ఇక చెల్లు

రాజాంలో రూ.9.81 కోట్లతో వేర్వేరు చోట్ల రెండు ట్యాంకుల నిర్మాణం

పూర్తయితే మునిసిపాల్టీకి పుస్కలంగా నీరు

త్వరగా అందుబాటలోకి తేవాలని ప్రజల విన్నపం

రాజాం, ఆగస్టు 4(ఆంధ్రజ్యోతి):

రాజాం మునిసిపాల్టీలో తాగునీటి కోసం ప్రజలు ఎదుర్కొంటున్న తిప్పలు త్వరలో తప్పను న్నాయి. రోజుల కొద్దీ నిరీక్షణ.. చాలీచాలని నీటి సరఫరాతో పడుతున్న ఇక్కట్లు తీరిపోనున్నాయి. ప్రభుత్వం అమృత్‌ 2.0 కింద రూ.9.81 కోట్ల నిధులు మంజూరు చేసింది. వీటితో రెండు చోట్ల ట్యాంకర్ల నిర్మాణం జరుగుతోంది. పనులు పూర్తయితే మున్సిపల్‌ వాసులకు తాగునీటి బెడద ఇక ఉండదు. త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని పురవాసులు కోరుతున్నారు.

రాజాం పట్టణం శరవేగంగా విస్తరిస్తోంది. శివారు కాలనీలు పెరిగాయి. దీంతో తాగునీటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ సమస్య పరిష్కరించేందుకు ప్రభుత్వం అమృత్‌ 2.0 కింద నిధులు విడుదల చేసింది. భవిష్యత్‌లో పెరగనున్న ఇళ్లకూ తాగునీరు అందించేందుకు ప్రణాళిక రూపొందించింది. ఇప్పుడున్న ఐదు రిజర్వాయర్లు కాకుండా అదనంగా వాసవీనగర్‌, వస్త్రపురి కాలనీలో కొత్తవాటిని నిర్మిస్తున్నారు. ఇవి పూర్తయితే చెరో 5 లక్షల లీటర్ల నీరు.. అంటే 10 లక్షల లీటర్ల నీరు నిల్వ ఉంచే సామర్థ్యం పెరగనుంది.

రాజాం మునిసిపాల్టీలో 52,114 మంది జనాభా ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. రోజూ సరఫరా చేయాల్సిన నీరు 70.35 లక్షల లీటర్లు. కానీ 41.10 లక్షల లీటర్ల నీటిని మాత్రమే అందిస్తున్నారు. 29.25 లక్షల లీటర్ల తాగునీరు లోటు కనిపిస్తోంది. పట్టణంలో గంట కూడా నీటి సరఫరా జరగడం లేదు. కేవలం 30 నిమిషాలు అందించి గంటగా చూపిస్తున్నారు. మెంటిపేట, కొత్తవలస, గోపాలపురం, సారధి, డోలపేట, పోనుగుటివలస, డీఏవీ పాఠశాల, మారుతీనగర్‌, ఈశ్వరనారాయణ కాలనీ, బాబానగర్‌, శ్రీకాకుళం రోడ్డు ప్రాంతాల్లో సక్రమంగా తాగునీటి సరఫరా లేదన్న ఫిర్యాదులు ఉన్నాయి. తరచూ పైపులైన్లకు మరమ్మతులు చేయాల్సి వస్తోంది. బాగుచేసేందుకు ఏడాదికి రూ.30 లక్షల వరకూ ఖర్చవుతోంది. అయినా సరే ప్రజలకు పూర్తిస్థాయిలో తాగునీరు అందించలేకపోతున్నారు.

ఫ గతంలో ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్‌ మంత్రిగా ఉన్న సమయంలో రూ.39 కోట్లతో మునిసిపాల్టీకి తాగునీటి పథకాన్ని మంజూరు చేయించారు. 20 ఏళ్ల వరకూ సరిపోయేలా పథకాన్ని నిర్మిస్తున్నట్టు అప్పట్లో అధికారులు ప్రకటించారు. కానీ పెరిగిన పట్టణ అవసరాలకు అనుగుణంగా ఈ పథకం నీరు సరిపోవడంలేదు. ముఖ్యంగా ట్యాంకర్లలో నీటి నిల్వ సామర్థ్యం తగ్గుముఖం పడుతోంది. కాగా తాజాగా అమృత్‌ 2.0 పథకంలో భాగంగా అదనంగా రెండుచోట్ల ఉపరితల ట్యాంకులు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం డోలపేట, శ్రీకాకుళం రోడ్డు, బొబ్బిలి రోడ్డు, సారధి ఇందిరమ్మ కాలనీ, కొత్తవలసలో ట్యాంకులు ఉన్నాయి. అదనంగా వాసవీనగర్‌, వస్త్రపురికాలనీలో చేపట్టిన ట్యాంకులు పూర్తయితే తాగునీటి ఇబ్బందులు పూర్తిగా తీరుతాయి. వీలైనంత త్వరగా వీటి నిర్మాణం పూర్తిచేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

పటిష్ట చర్యలు..

రాజాం మునిసిపాల్టీలో తాగునీటి సమస్య తలెత్తకుండా పటిష్ట చర్యలు చేపడుతున్నాం. అమృత్‌ 2.0 పథకం కింద రూ.9.81 కోట్లు మంజూరయ్యాయి. చురుగ్గా పనులు జరుగుతున్నాయి. తాగునీటి సమస్య తలెత్తకుండా పటిష్ట చర్యలు చేపడుతున్నాం.

- ఏ.రామచంద్రరావు, కమిషనర్‌, రాజాం మునిసిపాల్టీ

Updated Date - Aug 04 , 2026 | 11:57 PM