No more ఇక తాడోపేడో
ABN , Publish Date - Mar 30 , 2026 | 12:03 AM
No more ప్రైవేటు సంస్థ మోసాలపై బాధితులు పోరాట బాట పట్టారు. ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలకు చెందిన సంస్థ వంచితులందరూ ఏకతాటిపైకి వస్తున్నారు. సోమవారం కలెక్టరేట్‌లో హోంమంత్రిని కలసి గోడువెళ్లబోసుకోవాలని నిర్ణయించుకున్నారు.
ఇక తాడోపేడో
ప్రైవేటు సంస్థ మోసాలపై బయటకు వస్తున్న బాధితులు
నేడు హోంమంత్రికి విన్నపం ఇవ్వాలని నిర్ణయం
రంగంలోకి పోలీసు, ఇంటిలిజెన్స్
కూపీలాగుతున్న అధికారులు
విజయనగం క్రైం,మార్చి 29(ఆంధ్రజ్యోతి):
ప్రైవేటు సంస్థ మోసాలపై బాధితులు పోరాట బాట పట్టారు. ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలకు చెందిన సంస్థ వంచితులందరూ ఏకతాటిపైకి వస్తున్నారు. సోమవారం కలెక్టరేట్‌లో హోంమంత్రిని కలసి గోడువెళ్లబోసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే సేకరించిన బాధితుల వివరాలు, వారి సంతకాలతో కూడిన వినతిపత్రాన్ని ఆమెకు అందజేయనున్నారు. పోరాటాన్ని శాంతియుత పంథాలో కొనసాగించాలని నిర్ణయించారు. పోలీసులు మద్దతుగా ఉన్నందున వారికి ఏవిధంగానూ ఇబ్బంది కలగకుండా ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లనున్నట్టు బాధితులు ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. ఇదిలా ఉంటే మోసంపై ఇంటిలిజెన్స్ వర్గాలు రంగంలోకి దిగాయి. ఉత్తరాంధ్రలో పోలీసు స్టేష్లన్ల వారీగా బాధితుల వివరాలు సేకరిస్తూ వారికి చట్టపరంగా అండగా నిలిచేందుకు ప్రయత్నిస్తున్నారు. కుంభకోణం కోట్ల రూపాయల్లో ఉంటుందని వారుకూడా ప్రాథమిక అంచనాకు వచ్చినట్టు సమాచారం. ఇంటిలిజెన్స్ రంగంలోకి దిగడంతో బాధితుల్లో ఆశలు చిగురించాయి. మరోవైపు ఉత్తరాంధ్రకే పరిమితమని అనుకున్న ఆ సంస్థ మోసాల బాగోతంపై ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చ నడుస్తున్నట్టు సమాచారం. తాజా పరిణామాలు టీమ్ లీడర్లలో కలవరం పుట్టిస్తున్నాయని తెలుస్తోంది. ఈగండం నుంచి బయటపడే మార్గాలను వారు వెతుకుతున్నట్టు తెలియవచ్చింది.