Share News

the Pain Remains ఎద వేసినా.. తప్పని వ్యధ

ABN , Publish Date - Aug 12 , 2026 | 12:24 AM

No Matter How Paddy Is Cultivated.. the Pain Remains వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఈ ఏడాది జిల్లాలో భారీగా ఎద పద్ధతిలో వరి పంట వేసిన రైతులకు వ్యధ తప్పడం లేదు. ప్రకృతి సహకరించక పోవడంతో వారు తలలు పట్టుకుంటున్నారు. అడపాదడపా కూడా వర్షాలు కురవకపోవడంతో ఆదిలోనే తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

 the Pain Remains ఎద వేసినా.. తప్పని వ్యధ
ఎద పంటలోని కలుపును తీస్తున్న మహిళలు

  • కలుపునకు ఆజ్యం పోస్తున్న అరకొర వర్షాలు

  • తల పట్టుకుంటున్న రైతన్నలు..

  • ఆదిలోనే తడిసిమోపెడవుతున్న ఖర్చులు

  • కొన్నిచోట్ల పంటను వదిలేస్తున్న వైనం

పాలకొండ, ఆగస్టు11(ఆంధ్రజ్యోతి): వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఈ ఏడాది జిల్లాలో భారీగా ఎద పద్ధతిలో వరి పంట వేసిన రైతులకు వ్యధ తప్పడం లేదు. ప్రకృతి సహకరించక పోవడంతో వారు తలలు పట్టుకుంటున్నారు. అడపాదడపా కూడా వర్షాలు కురవకపోవడంతో ఆదిలోనే తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఎల్‌నినో ప్రభావంపై ముందుస్తుగా వ్యవసాయ శాఖ అవగాహన కల్పించడంతో గత ఏడాది 15 వేల ఎకరాల్లో సాగు చేపట్టిన రైతులు ఈ ఏడాది 30 వేల ఎకరాల్లో ఎద పద్ధతిలో వరి సాగు చేపట్టారు. అయితే ఈ పద్ధతిలో వరి విత్తనాలు మొలకెత్తిన 20 రోజుల్లోపు కలుపు నివారణకు అవసరమైన మందులను పిచికారీ చేయాలి. లేదా కూలీల ద్వారా కలుపును తీసివేయాలి. అయితే అందుకు అవసరమైన వర్షాలు కురవకపోవడంతో రైతులు కలుపు నివారణా చర్యలు చేపట్టలేకపోతున్నారు. అడపాదడపా కురిసిన వర్షం కలుపునకు మరింత ఆజ్యం పోసినట్టు అవుతుంది. కాగా కలుపు ఏపుగా పెరిగి వరి మొక్కలను ఎదగకుండా చేస్తున్నాయి. దీంతో కొంతమంది రైతులు చేసేది లేక.. చిన్నపాటి వర్షం కురిసినప్పుడు రెండోసారి దుక్కు దున్ని మరలా విత్తనాలు జల్లుతున్నారు. మరికొంతమంది స్వల్ప వర్షానికి కలుపు నివారణా చర్యలు చేపడుతున్నారు. మొత్తంగా కలుపు ఏపుగా పెరగడం, సకాలంలో నివారణా చర్యలు చేపట్టలేకపోవడంతో ప్రస్తుతం కలుపు నివారణ మందులు పిచికారీ చేసినప్పటికీ సరిగా పనిచేయడం లేదు. దీంతో రైతులు ఆదిలోనే పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తోంది. ఏదేమైనా రానున్న రోజుల్లో వర్షాలు కురవకుంటే పంటను దక్కించుకోవడం కష్టమేనని కొందరు భావిస్తున్నారు. కాగా కొన్ని మండలాల్లోని రైతులు చేసేది లేక ఆ పంటను అలాగే వదిలేస్తున్నారు.

ఖర్చులు ఇలా..

- పాలకొండ మండలం వీపీరాజుపేటకు చెందిన యందవ గోపాలరావు ఆరు ఎకరాల్లో ఎద పద్దతిలో వరి పంట వేశారు. విత్తనాలు జల్లి 20 రోజులు అయింది. వరి మొక్క కంటే ఏపుగా కలుపు పెరిగింది. కలుపు నివారణా చర్యలు చేపడదామంటే వర్షం కురవడం లేదు. దీంతో చేసేది లేక ఆరు ఎకరాల్లో 50 రోజుల వ్వవధిలో మూడుసార్లు వరి విత్తనాలు జల్లారు. అయితే వర్షాలు లేక కలుపు పెరిగిపోగా.. మళ్లీ ఆ పొలాన్ని దుక్కుదున్నడంతో ఆ రైతుకు విత్తనాలు, దుక్కు ఖర్చు రూ.6 వేలకు చేరింది. మూడోసారి వేసిన ఎద పంటలో కలుపు అధికంగా పెరగడంతో ఒక ఎకరా పొలాన్ని పూర్తిగా వదిలివేశారు. మిగిలిన ఐదు ఎకరాల్లో ఇప్పుడిప్పుడే వరి మొక్క పెరుగుతుంది.

- వీరఘట్టం మండలం చలివేంద్రి పంచాయతీ బూరుగ గ్రామానికి చెందిన కలుసు అప్పలస్వామినాయుడు రెండు ఎకరాల్లో ఎద పద్ధతిలో వరి పంట వేశాడు. సకాలంలో వర్షాలు కురవకపోవడంతో వరి మొక్కలు కంటే కలుపు అధికంగా పెరిగింది. అడపాదడపా కురిసిన వర్షంతో కలుపు నివారణకు మందులు పిచికారీ చేశారు. అయినప్పటికీ ప్రయోజనం దక్కలేదు. ఇటీవల మళ్లీ రెండోసారి మందులు పిచికారీ చేశారు. కొద్దోగొప్పో కలుపు నివారణ అవుతుం డడంతో కూలీలను పెట్టి కలుపు నివారణకు చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే రెండు ఎకరాలకు ఆయనకు రూ.10 వేలు వరకు ఖర్చు అయింది. జిల్లాలోని 15 మండలాల్లో 30 వేల ఎకరాల్లో ఎద పంట వేసిన రైతుల పరిస్థితి ఇలానే ఉంది.

- జిల్లాలో ఇప్పుడిప్పుడే అడపాదడపా వర్షాలు పడుతున్నాయి. ఒక పక్క నారు మడులు సిద్ధంగా ఉన్న వారు నాట్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఎద పంటలో కలుపు అధికంగా పెరిగి అవస్థలు పడుతున్న రైతులకు కూలీలు దొరకడం లేదు. ఒక పక్క వర్షాభావ పరిస్థితులు, కూలీల కొరత, అధిక ఖర్చులతో ఈ ఏడాది ఖరీఫ్‌ రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలి

ఎద పద్ధతిలో వేసిన వరి పంటకు అవసరమైన నీరు ప్రస్తుతం అందుతుంది. కలుపు నివారణా చర్యలు చేపట్టిన అనంతరం మొక్క అధిక శాతం పిలకలు వచ్చి దిగుబడి సాధించాలంటే వ్యవసాయాధికారుల సూచనలు, సలహాలు తీసుకోవాలి. పంటకు సస్యరక్షణ చర్యలు చేపట్టాలి.

- భవానీ శంకర్‌, డీఏవో, పార్వతీపురం మన్యం

Updated Date - Aug 12 , 2026 | 12:24 AM