Share News

వినతుల పరిష్కారంలో అలసత్వం వద్దు: జేసీ

ABN , Publish Date - May 26 , 2026 | 12:00 AM

ప్రజా ఫిర్యాదుల వేదిక (పీజీఆర్‌ఎస్‌)లో అందిన వినతుల పరిష్కారంలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని జాయింట్‌ కలెక్టర్‌ సేతుమాధవన్‌ హెచ్చరించారు.

వినతుల పరిష్కారంలో అలసత్వం వద్దు: జేసీ
వినతులు స్వీకరిస్తున్న జేసీ సేతు మాధవన్‌

విజయనగరం కలెక్టరేట్‌, మే 25(ఆంధ్రజ్యోతి): ప్రజా ఫిర్యాదుల వేదిక (పీజీఆర్‌ఎస్‌)లో అందిన వినతుల పరిష్కారంలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని జాయింట్‌ కలెక్టర్‌ సేతుమాధవన్‌ హెచ్చరించారు. కలెక్టరేట్‌ ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో వివిధ సమస్యలపై 191 వినతులు వచ్చాయి. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అర్జీదారులు తమ వినతులను అధికారులకు అందజేశారు. జేసీ సేతుమాధవన్‌, డీఆర్‌వో చందక సత్తిబాబు, ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్లు వినతులు స్వీకరించారు. ఈ వినతుల్లో 87 రెవెన్యూ శాఖకు సంబందించినవి. డీ ఆర్‌డీఏ 25, పంచాయతీరాజ్‌ 17, విద్యుత్‌ 6, గృహ నిర్మాణ శాఖకు సంబంధించి 1, మున్సిపల్‌ 18, వైద్యారోగ్య శాఖకు 2, గ్రామ సచివాలయ శాఖకు 4, విద్య శాఖకు 6, మిగిలినవి ఇతర శాఖలవి ఉన్నాయి. ఈ సందర్భంగా జేసీ సేతు మాధవన్‌ మాట్లాడుతూ వచ్చిన వినతులును వెంటనే పరిష్కరించాలని సంబం ధిత అధికారులను ఆదేశించారు.

వేతనదారుడిపై చర్యలు తీసుకోండి...

గ్రామంలో ఉపాధి హామీ పనులు చేస్తున్న సమయంలో ఓ వేతనదారుడు తమకు ఇబ్బంది కల్గిస్తున్నాడని గంట్యాడ మండలానికి చెందిన వేతనదారులు జేసీకి విన్నవించారు. మస్తర్లు వేసే సమయంలో ఆ వేతనదారుడు సహకరించడం లేదన్నారు. దీని వల్ల మిగిలిన కూలీలు చాలా ఇబ్బంది పడుతున్నారని వివరించారు. వెంటనే ఆయన పై చర్యలు తీసుకోవాలని కోరారు.

మరో సబ్‌ స్టేషన్‌ నుంచి సరఫరా చేయండి..

జామి సబ్‌ స్టేషన్‌ నుంచి కాకుండా వేరే సబ్‌ స్టేషన్‌ నుంచి విద్యుత్‌ సరఫరా కల్పించాలని జామి మండలం విఘ్నేశ్వర కాలనీ వాసులు విన్నవించుకున్నారు. ఈ కాలనీలో సుమారు 200 కుటుంబాలు నివశిస్తున్నాయి. చిన్న గాలి వీచినా విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలుగుతోంది. దీని వల్ల ఇబ్బంది పడుతున్నామని...మరో ప్రాంతం నుంచి విద్యుత్‌ సదుపాయం కల్పించాలని కాలనీ వాసులు కోరారు.

ఆధార్‌ కార్డు మంజూరు చేయాలి..

‘నేను 2022లో ఆధార్‌ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నాను. దరఖాస్తును తిరస్కరించారు. ఇప్పటి వరకూ ఆధార్‌ కార్డు మంజూరు కాలేదు. దీని వల్ల పథకాలు మంజూ రు కాలేదు. వెంటనే ఆధార్‌ కార్డు మంజూరు చేయాల’ని నెల్లిమర్ల మండలం సారిపల్లికి చెందిన పి.నీలిమ కోరారు.

‘నీటి తరలింపు పనులను ఆపాలి’

నెల్లిమర్ల, మే 25(ఆంధ్రజ్యోతి): నెల్లిమర్ల, జరజాపుపేట నగర పంచాయతీ ప్రజల తాగునీటి సమస్యల పరిష్కరించకుండా చంపావతి నది నుంచి ఇతర ప్రాంతాలకు తాగునీటిని తరలించేందుకు చేపట్టిన పనులను తక్షణమే నిలుపుదల చేయాలని నెల్లిమర్ల, జరజాపుపేట గ్రామాల పెద్దలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఇన్‌చార్జి కలెక్టర్‌ సేతు మాధవన్‌ను కోరారు. ఈ మేరకు వారంతా సోమవారం విజయనగరంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వినతిపత్రం సమర్పించారు. జరజాపుపేట లో రక్షిత నీటి పథకం పనులు తక్షణమే ప్రారంభించాలని కోరారు. చంపావతి నదిలో ఇన్‌ఫిల్టరేషన్‌ బావులను తవ్వి తాగునీటిని బయట ప్రాంతాలకు సరఫరా చేస్తే తమ గ్రామ రక్షిత నీటి పథకాలు ఎండిపోయే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సముద్రపు రామారావు, అవనాపు సత్యనారాయణ, చిక్కాల సాంబశివరావు, లెంక అప్పలనాయుడు, ఏఎం నాయుడు, కాళ్ల సన్యాసిరావు, కాళ్ల రాజశేఖర్‌, నల్లి బంగారు చంద్రశేఖర్‌, మద్దిల వాసు, కిల్లంపల్లి రామారావు, డొంక కృష్ణ, సముద్రపు సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.

‘భూములు ఇచ్చేది లేదు’

భోగాపురం, మే 25 (ఆంధ్రజ్యోతి): డేటా సెంటర్‌కు తమ సాగు భూములు ఇవ్వ బోమని టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు కర్రోతు సత్యనారాయణ, పొలిపల్లి మాజీ సర్పంచ్‌ కర్రోతు వెంటరమణ తదితరులు స్పష్టం చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్‌ గ్రీవెన్స్‌లో వినతిపత్రం అందజేసినట్లు తెలిపారు. పోలిపల్లి రెవెన్యూ పరిధిలో 358.7 ఎకరాలు రిలయన్స్‌ డేటా సెంటర్‌కు కేటాయించినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయని అన్నారు. అందులో సాగు భూమి 80.85 ఎకరాలు మినహాయించి మిగిలిన భూముల్లో ఐటీ పార్కు ఏర్పాటు చేసుకోవాలన్నారు. జేసీకి వినతిపత్రం ఇచ్చిన వారిలో నాయకులు కర్రో రాజు, పతివాడ రామకృష్ణ, తదితరులు ఉన్నారు.

Updated Date - May 26 , 2026 | 12:00 AM