No land auctions. భూముల వేలంపాట వద్దు
ABN , Publish Date - Apr 22 , 2026 | 12:23 AM
No land auctions. ‘ఎన్నో ఏళ్లుగా ఆ భూమినే నమ్ముకుని బతుకుతున్నాం. ఇప్పుడు వేలం పాట నిర్వహించి వేరొకరికి ఇస్తామంటే ఊరుకోబోమని’ శ్రీరంగరాజపురం దేవదాయ భూముల కౌలు రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామంలో సీతారామస్వామి గ్రూపు దేవాలయ భూములకు వేలంపాట నిర్వహించేందుకు మంగళవారం అధికారులు గ్రామ సచివాలయం వద్దకు చేరుకున్నారు.
భూముల వేలంపాట వద్దు
సచివాలయం వద్ద కౌలు రైతుల ఆందోళన
ఉద్రిక్తతల నడుమ వాయిదా
పది రోజులు సమయం ఇచ్చిన దేవదాయశాఖ అధికారులు
గజపతినగరం, ఏప్రిల్ 21(ఆంధ్రజ్యోతి): ‘ఎన్నో ఏళ్లుగా ఆ భూమినే నమ్ముకుని బతుకుతున్నాం. ఇప్పుడు వేలం పాట నిర్వహించి వేరొకరికి ఇస్తామంటే ఊరుకోబోమని’ శ్రీరంగరాజపురం దేవదాయ భూముల కౌలు రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామంలో సీతారామస్వామి గ్రూపు దేవాలయ భూములకు వేలంపాట నిర్వహించేందుకు మంగళవారం అధికారులు గ్రామ సచివాలయం వద్దకు చేరుకున్నారు. దేవదాయ ఇన్‌స్పెక్టర్ జి.శ్యామ్‌ప్రసాద్, ఆలయ ఈవో శ్రీరామ్ ఆధ్వర్యంలో పాట నిర్వహించేందుకు సమాయత్తం కాగా కౌలు రైతులు అభ్యంతరం తెలిపారు. ఒప్పుకొనేదిలేదని భీష్మించుకు కూర్చున్నారు. కౌలు రైతుసంఘం జిల్లా కార్యదర్శి రాకోటి రాములు, సీపీఎం నాయకుడు జి.శ్రీనివాస్ కౌలు రైతులకు మద్దతుగా నిలిచారు. సాగు చేసే వారికే భూమి అప్పగించాలని పట్టుబట్టారు. రెండు వర్గాల మధ్య వాదన సాగుతుండగా ఎస్‌ఐ కె.కిరణ్‌కుమార్ నాయుడు వచ్చి ఇరు వర్గాలుకు సర్దిచెప్పారు. అధికారుల మాటలు విని తరువాత తమ నిర్ణయం తెలపాలని కౌలు రైతులకు సూచించారు. దేవదాయ ఇన్‌స్పెక్టర్ శ్యామ్‌ప్రసాద్ మాట్లాడుతూ గ్రామంలో 47.56 ఎకరాల దేవస్థానం భూమి 12 ఏళ్లుగా వేలం పాట నిర్వహించడం లేదని, నిబంధనల ప్రకారం ప్రతి మూడేళ్లకు పాట నిర్వహించాలన్నారు. గతంలో ఇన్‌చార్జ్ ఈఓలు ఉండడం వల్ల పాట నిర్వహించలేదని, పాటలో పాల్గొని భూమి సాగు చేసే వారు అర్హులుగా ఉంటారని, లేకుంటే ఆక్రమణదారులుగా గుర్తిస్తామని చెప్పారు. ఎన్ని సంవత్సరాలు సాగులో ఉన్నా ఆ భూమి రైతులకు వర్తించదని, అది ఎప్పటికీ దేవదాయ భూమిగానే ఉంటుందన్నారు. సాగు చేసే వారికే ఆ భూమి ఉండాలన్నది తగదని, 47 ఎకరాలను గ్రామానికి చెందిన వారికి ఎకరా లేదా రెండు ఎకరాలు చొప్పున వేలం పాట వేస్తామన్నారు. కౌలుకు తీసుకున్న రైతుల ఆధీనంలో భూమి లేదని కలెక్టర్‌కు ఫిర్యాదులు వచ్చాయని, అలా జరిగితే చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీనిపై కౌలు రైతులు స్పందిస్తూ తమకు కొంత సమయం కావాలని, జిరాయితీ భూమి దేవస్థానం రికార్డుల్లో పడిందని, సర్వే చేశాక వేలంపాట నిర్వహించాలని కోరారు. అందుకు పది రోజులు సమయం ఇస్తున్నామని అధికారులు చెబుతూ ఆ తరువాత తప్పనిసరిగా వేలంపాట నిర్వహిస్తామన్నారు. సమావేశంలో ఈవోలు వంశీలక్ష్మి, కె.రమణమూర్తి, మాజీ సర్పంచ్ కామునాయుడు, గ్రామపెద్దలు పాల్గొన్నారు.