Share News

నో హెల్మెట్‌.. నో పెట్రోల్‌!

ABN , Publish Date - Feb 14 , 2026 | 12:10 AM

హెల్మెట్‌ ధరించకుండా పెట్రోల్‌ బంకులకు వెళ్తున్నారా!.. అయితే అక్కడ మీ ద్విచక్ర వాహనాల్లో పెట్రోల్‌ పోయారు.

నో హెల్మెట్‌..  నో పెట్రోల్‌!
విజయనగరంలో వాహనదారులకు హెల్మెట్‌పై అవగాహన కల్పిస్తున్న ఎస్పీ దామోదర్‌

దాన్ని పెట్టుకుంటేనే బైక్‌ల్లో పోయండి

పెట్రోల్‌ బంక్‌లకు పోలీసు శాఖఆదేశాలు

రోడ్డు ప్రమాదాల తగ్గింపునకు చర్యలు

హెల్మెట్‌ వినియోగంపై విస్తృత ప్రచారం

హెల్మెట్‌ ధరించకుండా పెట్రోల్‌ బంకులకు వెళ్తున్నారా!.. అయితే అక్కడ మీ ద్విచక్ర వాహనాల్లో పెట్రోల్‌ పోయారు. హెల్మెట్‌ పెట్టుకొని వెళ్తేనే పెట్రోల్‌ వేయాలని ఫిలింగ్‌ స్టేషన్ల యాజమాన్యాలకు జిల్లా పోలీసు శాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. గతంలో హైకోర్టు జారీ చేసిన ఆదేశాలను కచ్చితంగా అమలు చేసేందుకు ఎస్పీ చర్యలు చేపడుతున్నారు. ఈ మేరకు రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా హెల్మెట్‌ వినియోగంపై వాహనచోదకులకు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు.

విజయనగరం, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి. ఇందులో ఎక్కువగా యువత ప్రాణాలు కోల్పోతుండడం ఆందోళన కలిగిస్తోంది. ప్రధానంగా హెల్మెట్‌ ధరించకపోవడం వల్లే రోడ్డు ప్రమాదాల్లో చాలామంది ప్రాణాలు కోల్పోతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ మేరకు పోలీస్‌ శాఖ కఠిన చర్యలకు దిగింది. హెల్మెట్‌ ధరించకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేసింది. దీనిపై అవగాహన కల్పిస్తూ విజయనగరంతో పాటు ప్రధాన పట్టణాల్లో భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తోంది. మరో అడుగు ముందుకేసి హెల్మెట్‌ లేకుంటే ద్విచక్ర వాహనాలకు పెట్రోల్‌ అమ్మకూడదని అన్ని పెట్రోల్‌ బంకులకు ఎస్పీ దామోదర్‌ ఆదేశాలు జారీ చేశారు.

పెరుగుతున్న ప్రమాదాలు..

జిల్లాలో ఏదో ఒకచోట నిత్యం ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. పరిమితికి మించి ప్రయాణాలు చేయడం, అతివేగం, సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌, హెల్మెట్‌ ధరించకపోవడం, ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లగించడం వంటి కారణాలతో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. గత ఏడాది ఏకంగా 60వేల వరకు కేసులు నమోదు చేసినట్టు పోలీసులు చెబుతున్నారు. అయినా ప్రమాదాలకు అడ్డుకట్ట పడడం లేదు. విలువైన ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. 2022లో జరిగిన ప్రమాదాల్లో 244 మంది మృతిచెందగా, 925 మంది క్షతగాత్రులయ్యారు. 2023లో 213 మంది చనిపోతే, 826 మంది గాయపడ్డారు. 2024లో 166 మంది మృతి చెందితే, 695 మంది క్షతగాత్రులయ్యారు. 2025లో 420 ప్రమాదాలు జరగగా 150 మంది వరకూ చనిపోగా, 400 మంది వరకూ క్షతగాత్రుల య్యారు. అయితే ద్విచక్ర వాహన ప్రమాదాలకు సంబంధించి హెల్మెట్‌ ధరించకపోవడం వల్లే చాలామంది ప్రాణాలు కోల్పోయినట్లు గణాంకాల్లో వెల్లడైంది.

జరిమానాలు ఇలా..

గత ఏడాది మార్చి 1 నుంచి ట్రాఫిక్‌ నిబంధనలకు సంబంధించి కీలక ఆదేశాలు వచ్చాయి. హెల్మెట్‌ లేకుండా డ్రైవింగ్‌ చేస్తే రూ.వెయ్యి, వెనుక కూర్చున్న వారు హెల్మెట్‌ ధరించకపోతే రూ.వెయ్యి, వాహనానికి ఇన్సూరెన్స్‌ లేకపోతే రూ.వెయ్యి, రెండోసారి పట్టుబడితే రూ.2వేలు, భారీ సైలెన్సర్లతో సౌండ్‌ పొల్యూషన్‌కు పాల్పడితే రూ.2వేలు, అదే వాహనం రెండోసారి దొరికితే రూ.4వేలు, పరిమితికి మించి వాహనాల్లో ఎక్కించుకుంటే మనిషికి రూ.200 లెక్క జరిమానా విధిస్తారు. మైనర్లు డ్రైవింగ్‌ చేసి పట్టుబడితే రూ.వెయ్యి, నిషేధం ఉన్న ప్రాంతాల్లో పార్కింగ్‌ చేస్తే రూ.1500 నుంచి రూ.2వేలు, బైక్‌ రేసుల్లో పాల్గొంటే రూ.5వేలు, రెండోసారి దొరికితే రూ.10వేలు, తాగి వాహనం నడిపితే మూడు నెలల జైలుశిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధిస్తున్నారు.

ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలి..

‘అమ్మ జన్మనిస్తుంది.. హెల్మెట్‌ పునర్జన్మనిస్తుంది’ ఈతరహా నినాదంతో విస్తృతంగా ప్రచారం చేపడుతున్నాం. హెల్మెట్‌ వినియోగంపై ఇన్‌స్టాగ్రాం, ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ తదితర సామాజిక మాధ్యమాలతో ప్రచారం చేస్తున్నాం. జిల్లా వ్యాప్తంగా భారీగా ప్లెక్సీలు కూడా ఏర్పాటు చేస్తున్నాం. కుటుంబంలో ఓ వ్యక్తి మరణిస్తే.. ఆ కుటుంబం మొత్తం రోడ్డున పడుతుందనే విషయం బైక్‌ రైడర్లు గుర్తుపెట్టుకోవాలి. ఇక నుంచి వాహనదారులు కచ్చితంగా నిబంధనలు పాటించాలి. హెల్మెట్‌ అనేది తప్పనిసరి. లేకుంటే పెట్రోల్‌ బంకుల్లో పెట్రోల్‌ పోయకుండా ఆదేశాలిచ్చాం. ద్విచక్ర వాహనాలపై వెళ్లేవారు తప్పకుండా హెల్మెట్లు పెట్టుకోవాలి. కార్లపై వెళ్లేవారు సీటు బెల్టు పెట్టుకోవడం తప్పనిసరి. ఎవరైనా నిబంధనలు పాటించకపోతే భారీ జరిమానాలు, జైలుశిక్ష తప్పదు. హైకోర్టు ఆదేశాల మేరకు జరిమానాలు, కేసులు నమోదుచేస్తాం. ప్రజల బాగుకోసమే ఈ ప్రయత్నం. అందుకే అంతా సహకరించాలి. ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలి.

- ఏఆర్‌ దామోదర్‌, ఎస్పీ, విజయనగరం

Updated Date - Feb 14 , 2026 | 12:10 AM