Share News

No Firewood Available! గ్యాస్‌ రాదు.. కలప దొరకదు!

ABN , Publish Date - Apr 07 , 2026 | 11:51 PM

No Gas… No Firewood Available! పశ్చిమాసియా యుద్ధం ప్రభావం గ్యాస్‌పై తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా పూర్తిస్థాయిలో గ్యాస్‌ సిలిండ్ల సరఫరా కావడం లేదు. దీంతో మన్యంవాసులకు కష్టాలు తీరడం లేదు. గ్రామీణ, పట్టణ ప్రాంత ప్రజలు కట్టెల పొయ్యిలపైనే వంటలు చేస్తున్నారు.

 No Firewood Available!  గ్యాస్‌ రాదు.. కలప దొరకదు!
ఓ హోటల్‌ వద్ద కట్టెల పొయ్యిపై వండుతున్న దృశ్యం

  • డిమాండ్‌కు తగినట్లుగా సరఫరా కాని వైనం

  • హోటళ్లలో పెరిగిన ధరలు

  • ప్రజలపై పరోక్ష ప్రభావం

పాలకొండ, ఏప్రిల్‌7(ఆంధ్రజ్యోతి): పశ్చిమాసియా యుద్ధం ప్రభావం గ్యాస్‌పై తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా పూర్తిస్థాయిలో గ్యాస్‌ సిలిండ్ల సరఫరా కావడం లేదు. దీంతో మన్యంవాసులకు కష్టాలు తీరడం లేదు. గ్రామీణ, పట్టణ ప్రాంత ప్రజలు కట్టెల పొయ్యిలపైనే వంటలు చేస్తున్నారు. బుక్‌ చేసుకున్న 20 నుంచి 25 రోజుల తర్వాతే గ్యాస్‌ అందిస్తుండగా.. ఇక కమర్షియల్‌ గ్యాస్‌ సంగతి సరేసరి. ఇది పూర్తిగా అందుబాటులో లేకపోవడంతో హోటళ్లు, ఫుడ్‌కోర్టులు, రెస్టారెంట్లు, టిఫిన్‌ షాపులు, తినుబండారాలు అమ్మే చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే జిల్లాలోని పలు హోటళ్లు, టిఫిన్‌ సెంటర్లు మూతపడ్డాయి. కొంతమంది హోటళ్ల నిర్వాహకులు వంట కోసం కట్టెలను వినియోగిస్తున్నారు. దీంతో వాటి ధర పెరిగింది. మరోవైపు జిల్లాలో ఏజెన్సీ, మైదాన ప్రాంతాల్లో అనుకున్న స్థాయిలో వంట చెరకు లభ్యం కావడం లేదు. గిరిజనులు కొండపోడు వ్యవసాయం చేసేందుకు ఆసక్తి చూపుతుండడంతో వంట కలప అందుబాటులో ఉండడం లేదు. దీంతో డిమాండ్‌ అధికంగా ఉన్నప్పటికీ వంట కలప లభ్యం కావడం లేదు. ఈ నేపథ్యంలో వాటి ధలు అమాంతం పెరిగాయి. నిన్నమొన్నటి వరకు కర్రల డిపోల్లో వంటకానికి వినియోగించే టన్ను కట్టెల ధర రూ.2 వేలు నుంచి రూ.2,200 వరకు ఉండేది. ప్రస్తుతం రూ.3 వేలకు పైగా ధర పలుకుతుంది. కావిడి కట్టెలు నిన్నమొన్నటి వరకు రూ.300కు లభ్యమయ్యేవి. ప్రస్తుతం రూ.600 వరకు ధర పలుకుతోంది. అయితే ఈ ప్రభావ వినియోగదారులపై పడుతోంది. నిన్న మొన్నటి చిన్నపాటి టిఫిన్‌ సెంటర్లలో రూ.20కు మూడు నుంచి నాలుగు ఇడ్లీ ఇచ్చేవారు. అయితే ప్రస్తుతం రెండే ఇస్తున్నారు. కొన్ని హోటళ్లలో మెనూ ధరలను సైత పెంచేశారు.

గిట్టుబాటు కావడం లేదు..

గ్యాస్‌ అందుబాటులో లేకపోవడంతో కట్టెల పొయ్యిలపై వంటకాలు చేస్తున్నాం. గతంలో కావిడి కర్రలు రూ.300కు లభ్యం అయ్యేవి. ప్రస్తుతం అవి మార్కెట్‌లో రూ.600కు కొనుగోలు చేస్తున్నాం. దీనితో గిట్టుబాటు కావడం లేదు.

- కె.శ్రీనివాసరావు, హోటల్‌ యజమాని, పాలకొండ

==============================

ధరలు అధికం..

ప్రస్తుతం అడవి నుంచి వంట కలపను సేకరించిన వారు తక్కువగా ఉన్నారు. అయినప్పటికీ వాటిని కొనుగోలు చేసుకుని పట్టణాల్లో విక్రయిస్తున్నాం. ప్రస్తుతం మార్కెట్‌లో వంట కలపకు డిమాండ్‌ ఉన్నప్పటికీ ఆ స్థాయిలో సరఫరా చేయలేకపోతున్నాం. ధరలు అయితే అధికంగానే ఉన్నాయి.

- కె.అచ్చెయ్య, కలప వ్యాపారి

Updated Date - Apr 07 , 2026 | 11:51 PM