నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
ABN , Publish Date - Feb 22 , 2026 | 12:07 AM
జిల్లాలో సోమవారంనుంచి ఇంటర్మీయట్ పరీక్షలు ప్రారంభంకానున్నాయి.
- రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు
- ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
విజయనగరం కలెక్టరేట్, ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో సోమవారంనుంచి ఇంటర్మీయట్ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే పరీక్ష కేంద్రాల్లోని బెంచీలపై విద్యార్థుల హాల్ టిక్కెట్ల నెంబర్లను వేశారు. ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ పరీక్షలు జరగనున్నాయి. విద్యార్థులు ఉదయం 8.30 గంటలకే కేంద్రాలకు చేరుకోవాలి. 9 గంటల తర్వాత నిమిషంఆలస్యమైనా పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించమని అధికారులు తెలిపారు. పరీక్షల్లో కాపీయింగ్, ఇతర అవకతవలకు చెక్ పెట్టేందుకు అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. దీంతో విద్యార్థుల నిఘా నేత్రాల నీడలో పరీక్షలు రాయనున్నారు.
66 కేంద్రాలు ఏర్పాటు..
జిల్లాలో మొత్తం 39,037 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరుకానున్నారు. వీరికోసం 66 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో 21 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, 45 ప్రైవేట్ జూనియర్ కాలేజీలు ఉన్నాయి. పరీక్షల నిర్వహణకు 66మంది చీఫ్‌లు, 66 మంది డిపార్ట్‌మెంట్ అధికారులతో పాటు 1,000మంది ఇన్విజలేటర్లను నియమించారు. 400 మంది ప్రభు త్వ వ్యాయామ ఉపాధ్యాయులు, 600 మంది ప్రైవేటు కాలేజీల అధ్యాపకులు ఇన్విజలేటర్లగా వ్యవహరించనున్నారు. మూడు ఫ్లయింగ్, మూడు సిట్టింగ్ స్క్వాడ్‌లను ఏర్పాటు చేశారు. వీటికి అదనంగా ఆర్‌ఐవో, డీఈసీ సభ్యులు, స్పెషలాఫీసర్, కలెక్టర్, రెవెన్యూ అధికారులు, రాష్ట్ర స్థాయి బోర్డు అధికారులు కూడా కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేస్తారు. జిల్లా ఇంటర్ విద్యా కార్యాలయాన్ని విజయవాడలోని ఇంటర్మీడియట్ బోర్డు ప్రధాన కార్యాలయానికి సీసీ కెమెరాలతో అనుసంధానం చేశారు. పరీక్ష కేంద్రాల్లో ఏమి జరుగుతుందో వీక్షించేందుకు ఏర్పాట్లు చేశారు.
సెల్‌ఫోన్లు నిషేదం
పరీక్ష కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లను నిషేధించారు. చీఫ్‌లు, డిపార్ట్‌మెంట్ అధికారులు, ఇన్విజిలేటర్లు, పోలీసు, వైద్యసిబ్బంది, స్క్వాడ్ అధికారులు, ఇతర సిబ్బంది ఎవరూ సెల్‌ఫోన్లు తీసుకురాకూడదు. ఇతర ఎలక్ర్టానిక్ పరికరాలు కూడా కేంద్రాల్లోకి అనుమతించరు. పరీక్షల విధులు నిర్వహించే సిబ్బంది వద్ద తప్పనిసరిగా గుర్తింపు కార్డులు ఉండాలి. పరీక్షలకు సంబంధించిన సమాచారం అందించేందుకు ఆర్‌ఐవో కార్యాలయంలో 24 గంటలు పనిచేసేలా కంట్రోలు రూంను ఏర్పాటు చేశారు. దానికి ల్యాండ్ లైన్ నెంబరు 08922-237988, సెల్‌నెంబర్ 9059926425 కేటాయించారు.
- విద్యార్థులు వాట్సాప్ ద్వారా నేరుగా హాల్‌టిక్కెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కళాశాల ప్రిన్సిపాల్ సంతకంతో సంబంధం లేకుండా పరీక్షకు హాజరుకావచ్చు. విద్యార్థులకు హాల్‌టిక్కెట్లు ఇచ్చేందుకు నిరాకరిస్తే కళాశాలల యాజమాన్యాలపై కఠినచర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ఫొటో ఉన్న హాల్ టిక్కెట్‌ను మాత్రమే విద్యార్థులు పరీక్ష కేంద్రానికి తీసుకుని వెళ్లాలి.