Share News

No ego. అహం వద్దు

ABN , Publish Date - Jul 16 , 2026 | 11:26 PM

No ego.అధికారులు ఒకరికొకరు కలిసికట్టుగా సమన్వయంతో పనిచేయాలి తప్ప ఆహానికి పోవద్దని జిల్లా ఇన్‌చార్జి మంత్రి, హోంమంత్రి వంగలపూడి అనిత సూచించారు. శాఖల మధ్య సమన్వయం ఉంటే మంచి ఫలితాలు సాధించి వెనుకబడిన జిల్లాగా ముద్రపడిన విజయనగరాన్ని రాష్ట్రానికి వెన్నెముకగా మారుద్దామని పిలుపునిచ్చారు.

No ego. అహం వద్దు
డీఆర్‌సీ సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా ఇన్‌చార్జి మంత్రి అనిత

అహం వద్దు

అధికారులు సమన్వయంతో పనిచేయాలి

వ్యాఽఽధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలి

నిర్లక్ష్యంగా ఉంటే సస్పెండ్‌ చేస్తాను

జిల్లా ఇన్‌చార్జి మంత్రి వంగలపూడి అనిత

సేంద్రియ పంటలను సాగు చేయాలి

మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ పిలుపు

విజయనగరం/ కలెక్టరేట్‌, జూలై 16(ఆంధ్రజ్యోతి): అధికారులు ఒకరికొకరు కలిసికట్టుగా సమన్వయంతో పనిచేయాలి తప్ప ఆహానికి పోవద్దని జిల్లా ఇన్‌చార్జి మంత్రి, హోంమంత్రి వంగలపూడి అనిత సూచించారు. శాఖల మధ్య సమన్వయం ఉంటే మంచి ఫలితాలు సాధించి వెనుకబడిన జిల్లాగా ముద్రపడిన విజయనగరాన్ని రాష్ట్రానికి వెన్నెముకగా మారుద్దామని పిలుపునిచ్చారు. కలెక్టరేట్‌ ఆడిటోరియంలో గురువారం జరిగిన డీఆర్‌సీ (డిస్ట్రిక్ట్‌ రివ్యూ కమిటీ) సమావేశంలో ఇన్‌చార్జి మంత్రితో పాటు జిల్లా మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌, ఎంపీలు శ్రీభరత్‌, కలిశెట్టి, కలెక్టర్‌ రామసుందర్‌రెడ్డి, ఎస్పీ దామోదర్‌ తదితరులు పాల్గొన్నారు. తొలుత గత డీఆర్‌సిలో ప్రజాప్రతినిఽఽధులు ప్రస్తావించిన అంశాలపై యాక్షన్‌ రిపోర్టుపై చర్చించారు. అనంతరం శాఖలవారీగా సమీక్షించారు. ప్రధానంగా వ్యవసాయం, విద్య, నీటి పారుదల, వైద్య ఆరోగ్య శాఖల పరంగా ప్రస్తుత పరిణామాలను చర్చించారు. ఎల్‌నినో ప్రభావం వల్ల వర్షాలు కురవకపోతే ఎలాంటి పంటలు వేసుకోవాలనేదానిపై కార్యాచరణ తయారు చేశారా? యూరియా ప్రైవేటు డీలర్లకు ఎంత కేటాయించారు? ఆర్‌ఎస్‌కేలకు ఎంత ఇచ్చారు? అనేదానిపై చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు ప్రశ్నించారు. దీనిపై స్పందించిన వ్యవసాయ శాఖ జిల్లా అధికారి తారక రామారావు మాట్లాడుతూ 26,400 ఎకరాలకు కంటెన్‌జెన్సీ ప్లాన్‌ తయారు చేసినట్లు తెలిపారు. యూరియా ప్రైవేటు డీలర్లుకు 50 శాతం, ఆర్‌ఎస్‌కెలకు 50 శాతం చొప్పున కేటాయించినట్లు తెలిపారు. జిల్లాలో ఎరువుల కొరత లేదని, తమ వద్ద కూడా యూరియా నిల్వలు ఉన్నాయని డీసీఎంఎస్‌ చైర్మన్‌ గొంప కృష్ణ అన్నారు.

- భోగాపురం మండలం ఆర్‌డబ్ల్యూఎస్‌ అధ్వర్యంలోని వాటర్‌ స్టోరేజీ కోసం గోడ నిర్మించినట్లు ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ కవిత వివరించగా దీనిపై స్పందించిన మార్క్‌ఫెడ్‌ చైర్మన్‌ కర్రోతు బంగార్రాజు రూ.కోటీ 50 లక్షలతో నిర్మిస్తున్న గోడ వల్ల ఎలాంటి ఉపయోగం ఉందని ప్రశ్నించారు. ప్రైవేటు భూమిలో నిర్మించడం వల్ల ఇబ్బంది వస్తుందని చెప్పారు. దీనిపై స్పందించిన హోంమంత్రి అనిత మాట్లాడుతూ ఏదైనా పని చేసినప్పుడు మిగిలిన శాఖలతో సమన్వయం చేసుకోరా? అంటూ ప్రశ్నించారు. అధికారుల మధ్య ఇగో ఉండకూడదని సూచించారు. ఒకరికొకరు సమన్వయం చేసుకోవాలన్నారు. ముఖ్యంగా రాబోయే సీజన్‌లో వ్యాధులను దృష్టిలో ఉంచుకుని సంబంధిత శాఖలు విధులు నిర్వహించాలన్నారు. డయేరియా వంటి కేసులు మళ్లీ పునరావృతం కాకుండా చూడాలన్నారు. అధికారుల లోపం వల్లే డయేరియా ప్రబలినట్లు తెలిస్తే ఆ అధికారిని సస్పెండ్‌ చేస్తామని హెచ్చరించారు.

- బొబ్బిలి ఎమ్మెల్యే బేబీనాయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ఇళ్ల మ్యాపింగ్‌ చేయడం వల్ల చాలా సమస్యలు వచ్చాయిని, వీటి వల్ల చాలా మందికి అర్హత ఉన్నా కూడా ప్రభుత్వ పథకాలకు దూరమవుతున్నారని మంత్రుల దృష్టికి తీసుకువచ్చారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన డిగ్రీ కాలేజీ భవన నిర్మాణం పరిస్థితి ఎంత వరకూ వచ్చిందని విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అదితిగజపతిరాజు ప్రశ్నించారు. దీనిపై కళాశాల ప్రిన్సిపాల్‌ మాట్లాడుతూ రెవెన్యూ అధికారులు టైటిల్‌ ఇవ్వకపోవడం వల్ల నిర్మాణం పనులు ప్రారంభించలేదని తెలిపారు. దీనిపై స్పందించిన కలెక్టరు రామసుందర్‌రెడ్డి మాట్లాడుతూ పొజిషన్‌ తీసుకుని నిర్మాణ పనులు ప్రారంభించాలని ప్రిన్సిపాల్‌కు సూచించారు. నెల్లిమర్ల నియోజకవర్గంలో నిర్మించిన టిట్కో ఇళ్ల వద్ద అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని ఎమ్మెల్యే లోకం మాధవి ప్రస్తావించారు. దీనిపై స్పందించిన ఎస్‌పీ దామోదర్‌ మాట్లాడుతూ గంజాయి వినియోగిస్తున్న వారిపై దృష్టి పెట్టామని, వారి మీద పీడీ యాక్ట్‌ కూడా నమోదు చేస్తామని, ఒక సంవత్సరం వరకూ బెయిల్‌ కూడా రాదన్నారు. ఎమ్మెల్సీ రఘురాజు మాట్లాడుతూ జిల్లాలో పలు చెరువులు ఆక్రమణకు గురయ్యాయని ప్రస్తావించారు.

అంకెలు కాదు.. చేతల్లో చూపాలి: మంత్రి అనిత

అధికారులు తమ నివేదికలను అంకెల్లో చూపడం కాకుండా వాటిని చిత్తశుద్ధితో అమలు చేయడం ద్వారా చేతల్లో చూపాలని హోంమంత్రి అనిత సూచించారు. జలధార కార్యక్రమం ద్వారా ప్రతి నీటిబొట్టును ఒడిసిపట్టేందుకు ప్రయత్నం జరుగుతోందని చెప్పారు. ఈ కార్యక్రమం అమల్లో జిల్లా ఇతర జిల్లాలకు ఆదర్శంగా నిలవాలని, పెద్దఎత్తున అవగాహన కల్పించాలని, సోషల్‌ మీడియాను విస్తృతంగా వినియోగించుకోవాలని సూచించారు. ఎల్‌నినో పరిస్థితులను దీటుగా ఎదుర్కొనేందుకు ప్రణాళికలు రూపాదించాలని చెప్పారు. జిల్లాలో ఎక్కడైనా డయేరియా లేదా సీజనల్‌ వ్యాఽధులు ప్రబలితే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. కొవిడ్‌ను ఎదుర్కోవడంలో అప్రమత్తంగా ఉండాలని, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రజలను అనవసర భయబ్రాంతులకు గురిచేయవద్దని సూచించారు.

సేంద్రీయ పంటలను సాగు చేయాలి: మంత్రి కొండపల్లి

సేంద్రీయ పద్ధతిలో పంటలను సాగు చేయడం చాలా అవసరమని, వీటికి మార్కెట్‌ల్లో మంచి డిమాండ్‌ ఉందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ సూచించారు. వీటిని రైతు బజారుల్లో లేదా ప్రత్యేక స్టాల్‌ద్వారా విక్రయించాలన్నారు. సేంద్రీయ సాగుకు సంబంధించి రైతుల్లో అవగాహన కల్పించాలన్నారు. ఎరువుల వాడకం వల్ల వచ్చే దుష్ఫలితాలను రైతులకు వివరించాలని సూచించారు. జలధార ద్వారా సాగునీటి చెరువులను బాగుచేశామని చెప్పారు. జిల్లాలో ఏటా మొక్కజొన్న సాగు పెరుగుతోందని, అందుకు తగ్గట్టుగా యాక్షన్‌ ప్లాన్‌ రూపొందించాలని అధికారులకు ఆదేశించారు.

ఎస్‌.కోట ఆసుపత్రికి నిధులు: ఎంపీ భరత్‌

ఎస్‌.కోట ఏరియా ఆసుపత్రి అభివృద్ధికి ఎంపీ ల్యాడ్స్‌ నుంచి నిధులను కేటాయిస్తానని విశాఖ పార్లమెంట్‌ సభ్యుడు శ్రీభరత్‌ ప్రకటించారు. ఎస్‌.కోట ఆసుపత్రిలో పడకలు చాలడం లేదని సభ్యులు ప్రస్తావించగా వెంటనే ఆయన స్పందించి ఎంపీ నిధుల ద్వారా అవసరమైన బెడ్స్‌, ఫర్నీచర్‌ ఏర్పాటుకు ముందుకు వచ్చారు. జిల్లాలో చిరుధాన్యాల సాగును పెంచాలని సూచించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు గాదె శ్రీనివాసులు నాయుడు, పి.సురేష్‌ బాబు, కావలి గ్రీష్మ, జేసీ సేతుమాధవన్‌, డీఆర్‌వో సత్త్తిబాబు, సీపీవో బాలాజీ, హౌసింగ్‌ పీడీ మురళీ తదితరులు పాల్గొన్నారు.

నిరుద్యోగుల విన్నపం

కానిస్టేబుల్‌, ఎస్‌ఐ పోస్టులను 2500 నుంచి 10వేల వరకు పెంచాలని డిమాండ్‌ చేస్తూ డీఆర్సీ మీటింగ్‌ జరుగుతున్న సమయంలో కలెక్టరేట్‌ ఎదుట ఆంధ్రప్రదేశ్‌ నిరుద్యోగుల సంఘం నిరసన తెలిపింది. ఎస్పీ దామెదర్‌ చొరవ తీసుకుని వారిని హోంమంత్రి అనిత వద్దకు తీసుకువెళ్లారు. ఆమెకు వారి సమస్యలను వివరించారు. వీటిని ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తానని మంత్రి అనిత తెలిపారు.

Updated Date - Jul 16 , 2026 | 11:26 PM