Share News

No Demand… No Price దిగబడి లేదు.. ధర లేదు

ABN , Publish Date - Apr 04 , 2026 | 12:40 AM

No Demand… No Price గతేడాది సంభవించిన మొంథా తుఫాన్‌ ప్రభావం.. పసుపు పంటపై పడింది. పంట నాణ్యతతో పాటు దిగుబడి కూడా తగ్గిపోవడంతో సాలూరు ఏజెన్సీలో పసుపు రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

No Demand… No Price దిగబడి లేదు.. ధర లేదు
పసుపును ఎండబెట్టిన దృశ్యం

  • పెట్టుబడులు సైతం రాని వైనం

  • ఆవేదనలో పసుపు రైతులు

సాలూరు రూరల్‌, ఏప్రిల్‌ 3(ఆంధ్రజ్యోతి): గతేడాది సంభవించిన మొంథా తుఫాన్‌ ప్రభావం.. పసుపు పంటపై పడింది. పంట నాణ్యతతో పాటు దిగుబడి కూడా తగ్గిపోవడంతో సాలూరు ఏజెన్సీలో పసుపు రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాలూరు, పాచిపెంట, మక్కువ మండలాల్లో రైతులు సుమారు 234 ఎకరాల్లో పసుపు సాగు చేపట్టారు. గతేడాది మే నెలలో నాట్లు వేశారు. అయితే గతేడాది అక్టోబరు నెలలో మొంథా తుఫాన్‌ కారణంగా కురిసిన వర్షాలతో మడుల్లో నీరు నిల్వ ఉండిపోయింది. దీంతో పలు మొక్కల వేర్లు కుళ్లిపోయాయి. ఎకరాకు సాధారణంగా నాలుగు టన్నుల వరకు పసుపు దిగుబడి వస్తుంది. అయితే తుఫాన్‌ ప్రభావంతో దిగుబడి బాగా తగ్గింది. ఈ ఏడాది పసుపు టన్ను నుంచి టనున్నర వరకు మాత్రమే దిగుబడి వచ్చింది. మరోవైపు పసుపు క్వింటా ధర రూ. 14 వేల నుంచి రూ. 9 వేలకు పడిపోయింది. దీంతో ఈ ప్రాంత పసుపు రైతులు లబోదిబోమంటున్నారు. మొంథా తుఫాన్‌ సమయంలో వారు నష్టాన్ని అంచనా వేయలేక పరిహారానికి నమోదు చేసుకోలేదు. తీరా పంట తవ్వితీసిన తర్వాత నాణ్యత లోపంతో పాటు దిగుబడి తగ్గిందని తెలుసుకుని తీవ్ర ఆవేదన చెందుతున్నారు.

‘ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎకరా పసుపు పంట తవ్వకానికి రూ. 80 వేల వరకు పెట్టుబడి పెట్టాం. తవ్వకం నుంచి విక్రయానికి సిద్ధం చేయడానికి మరో 30 వేలకు పైగా వెచ్చించాం. తవ్వి తీసిన పచ్చి పసుపును విక్రయానికి అనుగుణంగా ఉడికించి, ఎండ బెట్టాల్సి ఉంది. ఈ పని కోసం రావులపాలెం, సిద్ధాంతం తదితర ప్రాంతాల నుంచి కార్మికులను రప్పించాం. పసుపు ఉడికించిన తర్వాత ప్రాసెసింగ్‌, గ్రేడింగ్‌ చేసే ప్రాంతానికి తరలించాల్సి ఉంది. అయితే పంట నాణ్యత, దిగుబడి తగ్గడంతో తీవ్రంగా నష్టపోయాం’ అని కొందరు రైతులు చెబుతున్నారు.

తగ్గిన నాణ్యత, దిగుబడి

సుమారు ఏడు ఎకరాలు కౌలుకు తీసుకుని పసుపు సాగు చేశాను. మొంథా తుఫాన్‌ ప్రభావంతో నాణ్యత, దిగుబడి తగ్గింది. పంట తవ్వకం, ఉడికించడం, గ్రేడింగ్‌ చేయడానికి ఖర్చులు పెరిగాయి. మరోవైపు ధర సైతం క్వింటాకు రూ. 14 వేలు నుంచి రూ. 9 వేలకు పడిపోయినట్టు తెలిసింది. ఇలాయితే ఎలా పసుపు సాగు చేయగలం.

- వెంకటరత్నం, కౌలు రైతు, కందులపథం

================================

సబ్సిడీ ఉంది

పసుపు సాగుకు ప్రభుత్వ సబ్సిడీ ఉంది. దీనికోసం రైతులు దరఖాస్తు చేసుకోవచ్చు. సాలూరు మండలంలో 150 ఎకరాలు, పాచిపెంటలో మరో 50 ఎకరాలు, మక్కువలో 34 ఎకరాలు వరకు పసుపు సాగవుతుంది. 75 ఎకరాలకు సంబంధించి రూ. 25 వేల సబ్సిడీకి ప్రతిపాదించాం. త్వర లోనే ఆయా రైతులకు సబ్సిడీ జమకానుంది.

- ప్రత్యూష, సాలూరు ఇన్‌చార్జి ఉద్యాన శాఖాధికారి

Updated Date - Apr 04 , 2026 | 12:40 AM