Share News

గిరిజనుల విద్య, ఆరోగ్యం విషయంలో రాజీ పడేది లేదు

ABN , Publish Date - Jul 03 , 2026 | 11:39 PM

గిరిజన ప్రాంతాల్లో పిల్లలు, గర్భిణులు, బాలింతల ఆరోగ్యం, విద్యా ప్రమాణాల విషయంలో రాజీపడేది లేదని ఇన్‌చార్జి జాయింట్‌ కలెక్టర్‌, ఐటీడీఏ పీవో ఆర్‌.వైశాలి స్పష్టం చేశారు. సాలూరు మండలం తోణాం పంచాయతీ పరిధి దిగువ మెండంగి గిరిజన గ్రామంలో శుక్రవారం పర్యటించారు.

గిరిజనుల విద్య, ఆరోగ్యం విషయంలో రాజీ పడేది లేదు

  • విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు

సాలూరు, జూలై 3(ఆంధ్రజ్యోతి): గిరిజన ప్రాంతాల్లో పిల్లలు, గర్భిణులు, బాలింతల ఆరోగ్యం, విద్యా ప్రమాణాల విషయంలో రాజీపడేది లేదని ఇన్‌చార్జి జాయింట్‌ కలెక్టర్‌, ఐటీడీఏ పీవో ఆర్‌.వైశాలి స్పష్టం చేశారు. సాలూరు మండలం తోణాం పంచాయతీ పరిధి దిగువ మెండంగి గిరిజన గ్రామంలో శుక్రవారం పర్యటించారు. ముందుగా గ్రామంలో అంగన్‌వాడీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. పౌష్టికాహార నిల్వలు, లబ్ధిదారుల హాజరును పరిశీలించారు. లబ్ధిదారులందరికీ పూర్తిస్థాయిలో పౌష్టికాహారం అందించాలని సిబ్బందిని ఆదేశించారు. సరుకుల పంపిణీ, రికార్డుల నిర్వహణలో ఏ మాత్రం తేడాలు వచ్చినా సహించేది లేదని హెచ్చరించారు. అనంతరం మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో మౌలిక వసతులు, మధ్యాహ్న భోజనం నాణ్యతను పరిశీలించారు. కాసేపు విద్యార్థులతో మాట్లాడి.. వారి విద్యా ప్రమాణాలను పరీక్షించారు. గిరిజన ప్రాంతాల్లో విద్యా సంస్థల బలోపేతానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, ఉపాధ్యాయులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. శతశాతం హాజరుతోపాటు నాణ్యమైన విద్యను అందించాలని ఆదేశించారు. విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.

‘సర్‌’ ప్రక్రియ పరిశీలన

‘ బుక్‌ ఎ కాల్‌ విత్‌ బీఎల్‌వో’ సౌకర్యాన్ని ఓటర్లు సద్వ్వినియోగం చేసుకోవాలని ఇన్‌చార్జి జేసీ కోరారు. మెండంగి గ్రామంలోని 90,91 పోలింగ్‌ స్టేషన్లలో చేపడుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియను ఆమె పరిశీలించారు. దరఖాస్తుల స్వీకరణ, ఓటరు వివరాల సవరణ, కొత్తగా ఓటర్ల నమోదు, మరణించిన, ద్వంద్వ నమోదుల తొలగింపు తదితర వాటిపై ఆరా తీశారు. అనంతరం సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సమర్థంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని పారదర్శకంగా.. నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని సూచించారు.

అభివృద్ధి పనులు వేగవంతం

సీతానగరం(బలిజిపేట): బలిజిపేట మండలం పెదపెంకి గ్రామంలో చేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఇన్‌చార్జి జేసీ ఆర్‌.వైశాలి ఆదేశించారు. శుక్రవారం పెదపెంకి గ్రామంలో పర్యటించారు. అధికారులతో కలిసి అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం వారితో సమీక్ష సమావేశం నిర్వహించారు. నిర్దేశిత గడువులోగా నాణ్యతతో పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. జాప్యానికి తావు లేకుండా చూడాలన్నారు. ఈ మేరకు ముందుగానే పనులు పూర్తి చేసి నివేదికలు సిద్ధం చేయాలని సూచించారు. ఈసమావేశంలో ఆర్డీవో కె.మాధురి, డ్వామా పీడీ కె.రామచంద్రరావు, డీపీవో రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 04 , 2026 | 08:10 AM