No Buses రద్దీకి తగ్గట్టుగా బస్సులేవీ?
ABN , Publish Date - Jan 10 , 2026 | 11:31 PM
No Buses to Match the Rush? సంక్రాంతి పండుగ వేళ సొంతూళ్లకు వస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో రద్దీకి తగ్గట్లుగా ఆర్టీసీ అదనపు బస్సులు నడపడం లేదు. దీంతో ప్రయాణికులకు అవస్థలు తప్పడం లేదు.
అదనపు బస్సులు లేక అవస్థలు
తగిన సర్వీసులు నడపని ఆర్టీసీ
ప్రయాణికులకు తప్పని పడిగాపులు
పాలకొండ, జనవరి10(ఆంధ్రజ్యోతి): సంక్రాంతి పండుగ వేళ సొంతూళ్లకు వస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో రద్దీకి తగ్గట్లుగా ఆర్టీసీ అదనపు బస్సులు నడపడం లేదు. దీంతో ప్రయాణికులకు అవస్థలు తప్పడం లేదు. స్ర్తీ శక్తి పథకం అమలులోకి వచ్చిన తర్వాత ఆర్టీసీ బస్సుల్లో మహిళా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ పథకానికి ముందు 65 శాతం ఓఆర్ (ఆక్యుపెన్సీ రేషియో) ఉండగా, ప్రస్తుతం 91 శాతానికి పెరిగింది. పండుగ సీజన్ కావడంతో స్వగ్రామాలకు వచ్చేవారి సంఖ్య పెరుగుతోంది. స్టేజ్‌లో బస్సు పెట్టిన కొద్ది సెకెన్లలోనే నిండిపోతోంది. అటువంటి పరిస్థితుల్లో ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా కొత్తగా ఆర్టీసీ సర్వీసులను ఏర్పాటు చేయడం లేదు. అరకొర బస్సులనే నడుపుతుం డడంతో ఆర్టీసీ కాంప్లెక్స్‌లు, బస్టాండ్ల వద్ద ప్రయాణికులు గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది.
ఇదీ పరిస్థితి..
జిల్లాలో పాలకొండ, సాలూరు, పార్వతీపురంలో ఆర్టీసీ డిపోలు ఉన్నాయి. వాటి పరిధిలో 261 బస్సులు ఉన్నాయి. వీటిలో 187 బస్సులు స్ర్తీశక్తి పథకానికి వినియోగిస్తున్నారు. ఈ పథకం అమలు తర్వాత ఒక్కో బస్సులో ప్రయాణించేవారి సంఖ్య 70 నుంచి 80 వరకు కనిపిస్తుంది. పండుగ సీజన్ కావడంతో ఈ సంఖ్య మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో జిల్లాలోని 18 రూట్లలో నూతనంగా బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులకు వినతులు వచ్చాయి. రద్దీకు అనుగుణంగా బస్సు సర్వీసులను నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు. ఇకపోతే సుదీర్ఘ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఒక్కో డిపో నుంచి 8 నూతన బస్సులు ఏర్పాటు చేయాలి. మొత్తంగా 24 బస్సులు సమకూర్చితే ప్రయాణికులు సాఫీగా రాకపోకలు సాగించే వీలుంది. పండుగ రద్దీని దృష్టిలో పెట్టుకుని జిల్లాలో ఆర్టీసీ బస్సు సర్వీసులు పెంచాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని జిల్లావాసులు అభిప్రాయపడుతున్నారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. దీనిపై జిల్లా ప్రజా రవాణా అధికారి వెంకటేశ్వరరావును వివరణ కోరగా.. ‘జిల్లా వ్యాప్తంగా మూడు డిపోల పరిధిలో 18 రూట్లలో సర్వీసులు నడపాలని వినతులు వచ్చాయి. వీటిని ఉన్నతాధికారులకు నివేదించాం. అదనపు బస్సులు కోసం ప్రతిపాదించాం. వీలైనంత త్వరగా కొత్త రూట్లలోనూ బస్సులు నడిపేందుకు చర్యలు తీసుకుంటాం.’ అని తెలిపారు.