addy Cultivation! వరిసాగులో వెనక్కి తగ్గలే..!
ABN , Publish Date - Oct 14 , 2026 | 12:13 AM
No Backing Down on Paddy Cultivation! ఎల్‌నినో పరిస్థితులకు జిల్లా రైతులు భయపడలేదు. ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. గతేడాది పోలిస్తే ఈ ఖరీఫ్ సీజన్‌లో అధికంగా వరిసాగు చేపట్టారు.
గతేడాదితో పోలిస్తే అదనంగా 4,347 హెక్టార్లలో సాగు
కలిసొచ్చిన ఆర్నాబ్ తుఫాన్
ప్రస్తుతం ఠారెత్తిస్తున్న ఎండలు.. వర్షం కురిస్తే పంటలకు మేలు
పార్వతీపురం, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో పరిస్థితులకు జిల్లా రైతులు భయపడలేదు. ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. గతేడాది పోలిస్తే ఈ ఖరీఫ్ సీజన్‌లో అధికంగా వరిసాగు చేపట్టారు. వాస్తవంగా ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనే అవకాశం ఉంటుందని వ్యవసాయాఽధికారులు ఎంతో గట్టిగా చెప్పారు. వరికి ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలు వేసుకోవాలని సూచించారు. దీనిపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఇందుకు తగ్గట్టుగానే జిల్లాలో ఎల్‌నినో ప్రభావం కనిపించింది. ఖరీఫ్ సీజన్‌లో ప్రారంభంలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అయితే ఏళ్లుగా వరినే నమ్ముకున్న జిల్లా అన్నదాతలు అప్పుడప్పుడు కురిసే వర్షాలకు వరినాట్లు వేశారు. జిల్లాలో గత ఏడాదిలో 79,212 హెక్టార్లలో వరిసాగు చేపట్టిన రైతులు ఈ ఏడాదిలో 83,559 హెక్టార్లలో వరిసాగు చేపట్టారు. ఆర్నాబ్ తుఫాన్ కారణంగా ఇటీవల కురిసిన భారీ వర్షాలు వరిసాగుకు ఆక్సిజన్‌లా పని చేశాయి. అయితే ఇప్పుడు వాతావరణం మళ్లీ మారింది. ఎండలు ఠారెత్తిస్తున్నాయి. మరో రెండు, మూడు రోజుల్లో వర్షాలు పడకుంటే వరికి నష్టం తప్పదని రైతులు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా ఇటీవల కురిసిన భారీ వర్షాలకు 154 హెక్టార్లలో వరి పంటతో పాటు మొక్కజొన్నకు నష్టం వాటిల్లింది. నిబంధనల ప్రకారం 33 శాతం దెబ్బతిన్న పంటల వివరాలను అధికారులు ప్రభుత్వానికి పంపించారు. సుమారు రూ.24 లక్షల వరకు పంట నష్టం జరిగినట్లు అంచనా వేశారు.
ఇతర పంటలు ఇలా..
జిల్లాలో గత ఏడాది 5,914 హెక్టార్లలో మొక్కజొన్న సాగు చేపట్టగా.. ఈ ఏడాది 6,727 హెక్టార్లలో సాగు చేపట్టారు. రాగి పంట సాగు విస్తీర్ణం మాత్రం తగ్గింది. గత ఏడాది 1,725 హెక్లార్లలో సాగైతే.. ఈ సంవత్సరం 1626 హెక్టార్లకే పరిమితమైంది. అదే విధంగా కందులు సాగు కూడా తగ్గింది. గత ఏడాది 1018 హెక్టార్లలో సాగు జరగ్గా.. ఈ సంవత్సరం 581 హెక్టార్లకే పరిమితమైంది. పత్తి సాగు విస్తీర్ణం మాత్రం పెరిగింది. గత ఏడాది 7448 హెక్టార్లలో చేపడితే.. ఈ సంవత్సరం 9007 హెక్టార్లలో సాగు చేపట్టారు. గత ఏడాది చెరకు 946 హెక్టార్లలో సాగు జరగ్గా.. ఈ ఏడాది 563 హెక్టార్లకు మాత్రమే పరిమితమైంది. మొత్తంగా జిల్లాలోని 96, 859 హెక్టార్లలో పలు రకాల పంటలు సాగవుతున్నాయి.
వర్షాలు పడితే ఊరట
గతేడాదితో పోలిస్తే జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్‌లో వరి సాగు విస్తీర్ణం బాగా పెరిగింది. రైతులు వరిసాగు వైపు ఎక్కువగా దృష్టి కేంద్రీకరించారు. ఇటీవల తుఫాన్ కారణంగా కురిసిన వర్షాలు వరితో పాటు ఇతర పంటలకు ఊపిరిపోశాయి. అయితే ఇప్పుడు మళ్లీ ఉష్ణోగ్రతలు పెరిగాయి. కాస్త వర్షాలు పడితే ఊరట కలుగుతుంది. ఆర్నాభ్ తుఫాన్ కారణంగా జిల్లాలోని 154 హెక్టార్లలో పలు రకాల పంటలలకు నష్టం ఏర్పడింది.
-భవానీ శంకర్, డీఏవో