No Progress! అనుమతులు లేక.. పనులు సాగక!
ABN , Publish Date - Mar 22 , 2026 | 11:31 PM
No Approvals… No Progress! నిధులున్నా.. కొమరాడ మండలంలో సీసాడవలస జంక్షన్ నుంచి నయా పంచాయతీ వరకు రోడ్డు నిర్మాణం జరగడం లేదు. సుమారు రూ.5 కోట్లతో ఈ పనులకు చేపట్టేందుకు కొద్దిరోజుల కిందట ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి శంకుస్థాపన చేశారు. అయితే అటవీశాఖ క్లియరెన్స్ రాని కారణంగా నిర్మాణం సాగడం లేదు.
కొద్ది రోజుల కిందట ప్రభుత్వ విప్ శంకుస్థాపన
అటవీశాఖ నుంచి క్లియరెన్స్ రాని వైనం
నేడు కలెక్టరేట్ వద్ద ఆందోళనకు సిద్ధమైన గ్రామస్థులు
పార్వతీపురం, మార్చి22(ఆంధ్రజ్యోతి): నిధులున్నా.. కొమరాడ మండలంలో సీసాడవలస జంక్షన్ నుంచి నయా పంచాయతీ వరకు రోడ్డు నిర్మాణం జరగడం లేదు. సుమారు రూ.5 కోట్లతో ఈ పనులకు చేపట్టేందుకు కొద్దిరోజుల కిందట ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి శంకుస్థాపన చేశారు. అయితే అటవీశాఖ క్లియరెన్స్ రాని కారణంగా నిర్మాణం సాగడం లేదు. గతంలో జిల్లా అటవీశాఖ నుంచి రాష్ట్రస్థాయికి ప్రతిపాదనలు వెళ్లాయి. అయితే వాటికి మోక్షం లభించలేదు. మరోవైపు రహదార పనుల కోసం కాంట్రాక్టర్లు యంత్రాలతో రావడంతో అనుమతులు లేవని అటవీ శాఖాధికారులు చెప్పి.. వారిని వెనక్కి పంపించేశారు. మొత్తంగా ఆ రోడ్డు పనులకు బ్రేక్ పడింది. అటవీశాఖ అనుమతుల మంజూరులో జాప్యం కారణంగా రహదారుల నిర్మాణాలు జరగడం లేదని గతంలో ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి అసెంబ్లీలో ప్రస్తావించారు. అయినప్పటికీ ఆమె నియోజకవర్గంలోనే పరిస్థితి మారకపోవడం చర్చనీయాంశమవుతోంది. సీసాడవలస జంక్షన్ నుంచి నయా పంచాయతీ వరకు బీటీ రహదారి నిర్మాణం పూర్తయితే నయాతో పాటు సుంకేసు, దేరుపాడు, గుడ్డం, పులేంద్రి, ఉలిగేషు, లొడ్డ, వాటకోసు, వనకాబడి కొతేసి పంచాయతీ పరిధిలో ఉన్న మరికొన్ని గ్రామాలకు రవాణా కష్టాలు తీరుతాయి. అయితే ఈ రహదారి నిర్మాణానికి రాష్ట్రస్థాయి అటవీశాఖ నుంచి అనుమతులు మంజూరు కాకపోవడంతో జిల్లా స్థాయిలో ప్రయత్నాలు చేశారు. కాగా ఒక్కసారి రాష్ట్రస్థాయి అనుమతుల కోసం వెళ్లిన రహదారిని జిల్లాస్థాయిలో పెట్టకూడదనేది అటవీ శాఖ వాదన. అయితే అటవీ శాఖ తీరుపై ఆయా గ్రామస్థులు మండిపడుతున్నారు. నేడు కలెక్టరేట్ వద్ద ఆందోళన చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని వారు చెబుతున్నారు. దీనిపై అటవీశాఖ రేంజర్ రవికుమార్‌ను వివరణ కోరగా.. ‘రాష్ట్రస్థాయి అనుమతులు కోసం ప్రతిపాదనను పంపించాం. అనుమతులు వచ్చిన తర్వాత పనులు ప్రారంభించొచ్చు. అంత వరకు వేచి చూడాల్సి ఉంది. అనుమతులు రాకపోవడం వల్లే యంత్రాలను తిరిగి వెనక్కి పంపించాం.’ అని తెలిపారు.