వసతి లేదు.. భోజనం అంతంతే!
ABN , Publish Date - Nov 21 , 2026 | 12:06 AM
రాష్ట్రస్థాయి కరాటే పోటీలకు వచ్చిన క్రీడాకారులకు వసతి కల్పించడంలో అధికారులు విఫలమయ్యారు.
రాష్ట్రస్థాయి పోటీలకు వచ్చిన విద్యార్థులకు అవస్థలు
రాత్రివేళ క్రీడా ప్రాంగణంలోనే పడిగాపులు
చలికి వణుకుతూ పచ్చికబయళ్లపై కాలక్షేపం
వసతులు కల్పించడంలో అధికారులు విఫలం
పాలకొండ, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): రాష్ట్రస్థాయి కరాటే పోటీలకు వచ్చిన క్రీడాకారులకు వసతి కల్పించడంలో అధికారులు విఫలమయ్యారు. దీంతో ఆ చిన్నారులతో పాటు తల్లిదండ్రులు చలికి వణుకుతూ పచ్చిక బయళ్లపై కాలక్షేపం చేయాల్సి వచ్చింది. ఈ నెల 21, 22 తేదీల్లో అండర్-14, 17, 19 బాలబాలికల విభాగాల్లో జరగనున్న పోటీల్లో పాల్గొనేందుకు ఉమ్మడి 13 జిల్లాల నుంచి సుమారు 800 మంది విద్యార్థులు శుక్రవారం రాత్రి పాలకొండకు తరలివచ్చారు. ఒక్కో జిల్లా నుంచి 60 మంది చొప్పున వచ్చిన క్రీడాకారులతో పాటు వారి తల్లిదండ్రులు, కోచ్‌లు కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రిజిస్ట్రేషన్ కోసం క్రీడాకారులంతా రాత్రివేళ సీహెచ్‌ఎల్ నాయుడు విద్యాసంస్థల ప్రాంగణానికి చేరుకున్నారు. అయితే భోజన సదుపాయాలు పూర్తిస్థాయిలో లేకపోవడంతో అవస్థలు పడ్డారు. రిజిస్ట్రేషన్ అనంతరం బాలికలకు రవీంద్రభారతి పాఠశాలలో.. బాలురకు వివేకానంద, సురేష్ ఉన్నత పాఠశాలల్లో బస ఏర్పాటు చేశారు. రాత్రివేళ ఆయా ప్రాంతాలకు చేరుకోవడం కష్టంగా మారింది. అక్కడ కనీస వసతులు లేకపోవడంతో కొందరు పైవ్రేటు లాడ్జీలను ఆశ్రయించగా, మరికొందరు చేసేదిలేక రిజిస్ట్రేషన్ ప్రాంగణంలోని పచ్చికబయళ్లపైనే కాలం గడిపారు. కొందరు నేలపైనే కూర్చుని భోజనం చేశారు. క్రీడాకారుల్లో బాలికలు కూడా ఉన్నారు. వీరితో పాటు తల్లిదండ్రులు కూడా అర్ధరాత్రి వేళ చలికి వణుకుతూ జాగరణ చేయాల్సి వచ్చింది. అనంతపురం వంటి దూర ప్రాంతాల నుంచి మన్యం జిల్లా శివారు ప్రాంతమైన పాలకొండకు వచ్చిన క్రీడాకారులకు అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేయకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రెండు రోజుల పాటు పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన విద్యార్థులకు కనీస సౌకర్యాలు కల్పించకపోవడంపై తల్లిదండ్రులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి ఆర్.రాములును వివరణ కోరగా.. 21వ తేదీ ఉదయానికి క్రీడాకారులు వస్తారని భావించామని, అయితే ముందుగానే రిజిస్ట్రేషన్ కోసం ప్రాంగణానికి చేరుకున్నారని తెలిపారు. క్రీడాకారుల కోసం 300 మందికి భోజన ఏర్పాట్లు చేశామని చెప్పారు.
సబ్ కలెక్టర్ ఆరా
క్రీడాకారులకు వసతి, భోజన సదుపాయాలు సరిగా లేవన్న సమాచారం అందడంతో సబ్ కలెక్టర్ స్వప్నిల్ పవర్ జగన్నాథ్ స్పందించారు. పోటీల నిర్వహణ బాధ్యతలు చూస్తున్న ఉద్యోగులతో మాట్లాడి ఏర్పాట్లపై ఆరా తీసినట్లు తెలిసింది.