NITI Aayog జిల్లా అభివృద్ధికి నీతి ఆయోగ్ సహకరించాలి
ABN , Publish Date - Feb 25 , 2026 | 11:36 PM
NITI Aayog Should Support District Development జిల్లా అభివృద్ధికి నీతి ఆయోగ్ పూర్తి సహకారం అందించాలని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి కోరారు. బుధవారం కలెక్టరేట్‌లో నీతి ఆయోగ్ అధికార ప్రతినిధి ఆయుషి అగర్వాల్‌కు జిల్లా సమగ్ర అభివృద్ధి, భవిష్యత్ ప్రణాళికలను వివరించారు.
పార్వతీపురం,ఫిబ్రవరి25(ఆంధ్రజ్యోతి): జిల్లా అభివృద్ధికి నీతి ఆయోగ్ పూర్తి సహకారం అందించాలని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి కోరారు. బుధవారం కలెక్టరేట్‌లో నీతి ఆయోగ్ అధికార ప్రతినిధి ఆయుషి అగర్వాల్‌కు జిల్లా సమగ్ర అభివృద్ధి, భవిష్యత్ ప్రణాళికలను వివరించారు. అనంతరం ఆయన సంబంధిత అధికారులతో మాట్లాడుతూ.. ‘విలేజ్ ప్లాన్ 2047ను పక్కాగా అమలు చేయాలి. ప్రతి గ్రామం అన్ని రంగాల్లో వృద్ధి సాధించేలా రోడ్ మ్యాప్‌ను సిద్ధం చేయాలి. జిల్లాలో భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయం, ఉద్యాన, అనుబంధ రంగాలను బలోపేతం చేయాల్సి ఉంది. రైతులకు మేలైన ఆదాయ వనరులను కల్పించాలి.’ అని తెలిపారు. వ్యవసాయంతో పాటు ఇతర సేవా రంగాల్లో ఆధునిక సాంకేతికత కోసం నీతి ఆయోగ్ నుంచి నాలెడ్జ్ పార్ట్‌నర్స్ మద్దతు అందించాలని అధికార ప్రతినిధి ఆయుషి అగర్వాల్‌ను కోరారు. నిపుణుల సలహాలతో జిలాలో విప్లవాత్మక మార్పులు తీసుకురావచ్చని ఆమె అభిప్రాయపడ్డారు. పాత నిబంధనల్లో మార్పులు , పారదర్శకమైన పాలన ద్వారా జిల్లాను రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు సహకారం అందించాలని కలెక్టర్ కోరారు. ఈ సమావేశంలో నీతి ఆయోగ్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ భూముల రక్షణ బాధ్యత తహసీల్దార్లదే...
జిల్లాలోని ప్రభుత్వ భూములు, చెరువులను కాపాడాల్సిన బాధ్యత తహసీల్దార్లదేనని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆస్తులు ఆక్రమణకు గురైతే చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో రెవెన్యూ అధికారులతో మాట్లాడుతూ.. మార్చి నెల ముగిసేలోగా ప్రతి మండం నుంచి కనీసం ఒక ఆక్రమణ కేసైనా నమోదు చేయాలన్నారు. ఆర్‌వోఆర్, అసైన్డ్ భూములు, హౌస్ సైట్స్ చట్టాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని తహసీల్దార్లకు సూచించారు. ఈ సమావేశంలో డీఆర్వో కె.హేమలత, సబ్ కలెక్టర్లు ఆర్.వైశాలి, పవార్ స్వప్నిల్ జగన్నాథ్, ప్రత్యేక ఉప కలెక్టర్ ఎస్.దిలీప్ చక్రవర్తి ఉన్నారు.
తాగునీటి ఎద్దడి తలెత్తరాదు
బెలగాం, ఫిబ్రవరి 25(ఆంధ్రజ్యోతి) : వేసవి దృష్ట్యా జిల్లాలో ఎక్కడా తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. నీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా చూడాలన్నారు. ప్రతి గ్రామంలో క్రాష్ ప్రోగ్రాం జరగాలని, ఒక్క గ్రామానికి కూడా నీటి ట్యాంకర్ అవసరం రాకూదని స్పష్టం చేశారు. ప్రతి పాఠశాల, వసతి గృహాల్లో కూడా ో తాగునీటి సమస్యలు ఉండరాదని తేల్చి చెప్పారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఉన్న బోర్‌వెల్స్, ట్యాంకులు, పైప్‌లైన్లను తనిఖీ చేయాలని ఆదేశించారు. ముందస్తుగా సర్వీసింగ్ చేయించాలని తెలిపారు. నీరు కలుషితం కాకుండా చూడాలన్నారు. మండలంలో ఉల్లాస్ బాగా జరగాలని, 10వ తరగతి విద్యార్థులందరూ కచ్చితంగా ఉత్తీర్ణత సాధించాలని అధికారులను ఆదేశించారు. దేశంలో మార్ట్ కింద ఎంపిక చేసిన ఏడు జిల్లాల్లో పార్వతీపురం మన్యం ఎంపికైందని, ఈ కార్యక్రమం కింద గ్రామీణ ఆర్థిక వ్యవస్థ రూపురేఖలు మారనున్నాయని తెలిపారు. ఐటీడీఏ పరిధిలో దేశవ్యాప్తంగా 1000 గ్రామాలు ఎంపిక కాగా అందులో జిల్లా నుంచి 5 గ్రామాలు ఉండడం ఆనందదాయకమన్నారు.