Only Two Functioning! నిర్మించినవి తొమ్మిది.. పనిచేస్తున్నవి రెండే!
ABN , Publish Date - Sep 28 , 2026 | 12:19 AM
Nine Built, Only Two Functioning! గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జిల్లాలో పలుచోట్ల నిర్మించిన వేబ్రిడ్జిలు (బరువు వంతెన) నిరుపయోగంగా మారాయి. రైతుల ప్రయోజనార్థం వాటికోసం లక్షలాది రూపాయలతో వెచ్చించారు. అయితే ప్రధాన రహదారికి పక్కన కాకుండా వాహనాలు తిరగలేని ప్రదేశాలలో వేబ్రిడ్జిలను నిర్మించారు. దీంతో అవి పూర్తిగా వినియోగంలోకి రాలేదు. ప్రస్తుతం తుప్పు పట్టి మరమ్మతులకు గురయ్యాయి.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్మాణం
వినియోగంపై దృష్టి సారించని వైనం
రైతులకు తప్పని ఇబ్బందులు
కూటమి ప్రభుత్వంపై ఆశలు
జియ్యమ్మవలస, సెప్టెంబరు 27(ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జిల్లాలో పలుచోట్ల నిర్మించిన వేబ్రిడ్జిలు (బరువు వంతెన) నిరుపయోగంగా మారాయి. రైతుల ప్రయోజనార్థం వాటికోసం లక్షలాది రూపాయలతో వెచ్చించారు. అయితే ప్రధాన రహదారికి పక్కన కాకుండా వాహనాలు తిరగలేని ప్రదేశాలలో వేబ్రిడ్జిలను నిర్మించారు. దీంతో అవి పూర్తిగా వినియోగంలోకి రాలేదు. ప్రస్తుతం తుప్పు పట్టి మరమ్మతులకు గురయ్యాయి. జిల్లాలో సుమారు రూ. 1.25 కోట్లతో 9 చోట్ల వే బ్రిడ్జిలు నిర్మించారు. పాలకొండ, మక్కువ, వీరఘట్టం, సాలూరు ఏఎంసీలలో, సీతంపేట, బలిజిపేట ఎంఎల్‌ఎఫ్‌సీలలో, జియ్యమ్మవలస, కొమరాడ ఎంపీఎఫ్‌సీలో, భామిని సీఎస్‌సీలో వాటిని నిర్మించారు. పాలకొండ, బలిజిపేటలో ఉన్నవి మాత్రమే ప్రస్తుతం పనిచేస్తున్నాయి. మిగిలినవి అతీగతీలేకుండా పోయాయి. ఈ నిర్మాణాలన్నీ జిల్లా సివిల్ సప్లైస్ పర్యవేక్షణలోనే జరిగాయి. కాగా ఆపరేటర్లు, సెక్యూరిటీ గార్డుల నియామకాలు జరగకపోవడం, వే బ్రిడ్జిల ప్రాంతాలకు భారీ వాహనాలు వెళ్లేందుకు అనువైన రోడ్డు సౌకర్యం లేకపోవడంతో ఏడు వే బ్రిడ్జిలు నిరుపయోగంగా మారాయి. అయితే వాటిని వినియోగంలోకి తేవడంలో గత వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. వాస్తవంగా రైతులు పండించే పంటలు, ధాన్యం తదితర వాటిని ప్రభుత్వం నిర్దేశించిన మిల్లులకు అమ్ముకునేందుకు ప్రధానంగా కావల్సినవి ఈ వే బ్రిడ్జిలు. వాటిపై వాటి తూకం వేసి నికర బరువు ఆధారంగా రైతులకు సొమ్ము చెల్లించే వీలుంటుంది. కానీ ఇవి లేకపోవడం వల్ల అటు మిల్లర్లు, ఇటు రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. తూనికల్లో తేడాతో అన్నదాతలు నష్టపోతున్నారు. తరచూ దళారుల చేతుల్లో మోసపోతున్నారు. రైతుల విజ్ఞప్తి మేరకు ఇటీవల లీగల్ మెట్రాలజీ బృందం బక్కో వే బ్రిడ్జిని పరిశీలించింది. వాటి రిపేర్లుకు ఎంత ఖర్చు అవుతుందనేది ఎస్టిమేట్లు వేసి ప్రభుత్వానికి నివేదించారు. ప్రభుత్వం ఏ మేరకు స్పందిస్తుందోనని రైతులు ఎదురు చూస్తున్నారు. దీనిపై జిల్లా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డీఎం బి.బాలాజీరాంను వివరణ కోరగా.. ‘జిల్లాలో 9 వే బ్రిడ్జిలలో రెండే పనిచేస్తున్నాయి. మిగిలినవి ధాన్యం కొనగోలు ప్రారంభం నాటికి పూర్తి వినియోగంలోకి తీసుకొస్తాం. రైతులు, మిల్లర్లు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.’ అని తెలిపారు.