NFBS.. ఎన్‌ఎఫ్‌బీఎస్‌తో పేదలకు భరోసా
ABN , Publish Date - Nov 16 , 2026 | 12:19 AM
NFBS: A Ray of Hope for the Poor ఇంటి పెద్దను కోల్పోయిన నిరుపేదలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలవనుంది. ఇకపై కుటుంబ పెద్ద మరణిస్తే.. ఆ కుటుంబానికి రూ.20 వేలు ఆర్థిక సాయం అందించనుంది. జాతీయ కుటుంబ లబ్ధి పథకంతో (ఎన్‌ఎఫ్‌బీఎస్) భరోసా కల్పించనుంది. ఈ మేరకు వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి దీనిని అమలు చేయాలని నిర్ణయించింది.
వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి అమలు
పాలకొండ, నవంబరు 15(ఆంధ్రజ్యోతి): ఇంటి పెద్దను కోల్పోయిన నిరుపేదలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలవనుంది. ఇకపై కుటుంబ పెద్ద మరణిస్తే.. ఆ కుటుంబానికి రూ.20 వేలు ఆర్థిక సాయం అందించనుంది. జాతీయ కుటుంబ లబ్ధి పథకంతో (ఎన్‌ఎఫ్‌బీఎస్) భరోసా కల్పించనుంది. ఈ మేరకు వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి దీనిని అమలు చేయాలని నిర్ణయించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేసే ఈ పథకంపై ఇటీవల జీవో కూడా జారీ చేశారు. వాస్తవంగా గత వైసీపీ ప్రభుత్వం ఈ పథకం అమలు చేయలేదు. దీంతో జిల్లాలో వందలాది కుటుంబాలు లబ్ధి పొందలేకపోయాయి. ఈ నేపథ్యంలో వారి కష్టాలను పరిగణనలోకి తీసుకున్న కూటమి ప్రభుత్వం ఎన్‌ఎఫ్‌బీఎస్ పథకం కింద చేయూత ఇవ్వాలని నిర్ణయించింది. కుటుంబాన్ని పోషించే వ్యక్తి అకస్మాత్తుగా మరణిస్తే ఆ కుటుంబానికి ఈ పథకం ద్వారా రూ. 20వేల వరకు ఆర్థికసహాయం అందించనున్నారు.
- ఇంటి పెద్ద మరణించిన తేదీ నుంచి రెండు సంవత్సరాల్లోపు ఈ దరఖాస్తు చేసుకోవచ్చు. మరణించిన వ్యక్తి వయసు 18 నుంచి 60 సంవత్సరా లోపు మధ్య ఉండాలి. కుటుంబం దారిద్య్రరేఖకు దిగువున డీపీఎల్‌గా ఉండాలి. రేషన్ కార్డు, ఆధార్‌కార్డు, వయసు ధ్రువీకరణప త్రం, బ్యాంకు ఖాతా వివరాలతో దరఖాస్తు చేసుకోవచ్చు. తహసీల్దార్, ఆర్డీవో, సబ్‌కలెక్టర్, జిల్లా సాంఘిక సంక్షేమశాఖాధికారి తదితర రాష్ట్ర ప్రభుత్వ పోర్టల్స్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. మరణానికి కారణంతో సంబంధం లేకుండా ఆర్థిక సహాయం వర్తించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది. ‘జాతీయ కుటుంబ లబ్ధి పథకంతో పేద కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ నెల నుంచి ఈ పథకం అమలులోకి రానుంది. దీనిపై ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు రావాల్సి ఉంది.’ అని పాలకొండ తహసీల్దార్ రాధాకృష్ణ తెలిపారు.