New ‘Wealth’కొత్త‘ధనం’
ABN , Publish Date - Nov 18 , 2026 | 12:22 AM
New ‘Wealth’ పంచాయతీల్లో ప్రజలు సామరస్య వాతావారణాన్ని కోరుకుంటున్నారు. గొడవలు, కక్షలు, వివాదాలకు దూరంగా ఉండాలనుకుంటున్నారు. ఎన్నికల్లో పోటీ లేకుంటే ఇవేవీ వుండవన్న అభిప్రాయంతో ఏకగ్రీవాలవైపు మొగ్గుచూపుతున్నారు.
కొత్త‘ధనం’
ప్రజల్లో వినూత్న మార్పు
పల్లెల్లో ఏకగ్రీవాల వైపు మొగ్గు
ఎవరెక్కువిస్తే వారికే పాలన అప్పగింత
ఓట్ల కొనుగోలు సొమ్ము పంచాయతీలకు మళ్లింపు
ఆలయాలు, కల్యాణ మండపాల నిర్మాణాలకు ఒప్పందం
శృంగవరపుకోట, నవంబరు 17(ఆంధ్రజ్యోతి):
- కొత్తవలస మండలం రామలింగాపురం పంచాయతీలో సర్పంచ్ పదవి జనరల్ మహిళకు కేటాయించారు. ఈ పదవిని చేపట్టాలని ఆశపెట్టుకున్న ఓ కుటుంబానికి ఏకగ్రీవంగా అప్పగించేందుకు గ్రామస్థులంతా అంగీకరించారు. నాలుగు ఆలయాలను ఈ పదవీ కాలంలో నిర్మించేలా అభ్యర్థితో ఒప్పందం కుదిరింది. అందుకు రూ.50లక్షల నుంచి రూ.కోటి వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంది.
- వేపాడ మండలం జాకేరులో గ్రామస్థులంతా ఏకగ్రీవ తీర్మానం చేశారు. గ్రామాభివృద్ధికి ఎవరెక్కువ మొత్తం అందిస్తే వారికే సర్పంచ్ పదవిని అప్పగిస్తామని తేల్చిచెప్పారు. దీంతో టీడీపీ నాయకుడు బుద్ద అప్పలనాయుడు ముందుకొచ్చి తనకున్న స్థిరాస్తిలోని 15 సెంట్ల స్థలంలో కల్యాణ మండపాన్ని నిర్మించి పంచాయతీకి ఇస్తానని వాగ్ధానం చేశాడు. ఇందుకు అందరూ అంగీకారం తెలపడంతో ఈ పంచాయతీ ఏకగ్రీవం కానుంది. రూ.50లక్షల వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంది.
- వేపాడ మండలం ఆతవ గ్రామ పంచాయతీని ఏకగ్రీవం చేసేందుకు అక్కడి ప్రజలు పోటీపడుతున్న అభ్యర్థులకు టెండర్ విధానాన్ని ప్రవేశపెట్టారు. రహస్యంగా కవర్‌లో ఎవరెక్కువ సొమ్మును రాస్తే వారికే సర్పంచ్ పదవిని అప్పగించాలని నిర్ణయించారు. దీంతో సర్పంచ్‌గా పోటీ పడాలనుకున్న ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థుల్లో ఒకరు రూ.26.50లక్షలు, మరొకరు రూ.21.50లక్షలు రాసి కవర్‌లో పెట్టారు. ఎక్కువ సొమ్మును పంచాయతీకి ఇస్తానని రాసిన వారికి సర్పంచ్ పదవిని ఖరారు చేశారు.
ఈ విధంగా పంచాయతీల్లో ప్రజలు సామరస్య వాతావారణాన్ని కోరుకుంటున్నారు. గొడవలు, కక్షలు, వివాదాలకు దూరంగా ఉండాలనుకుంటున్నారు. ఎన్నికల్లో పోటీ లేకుంటే ఇవేవీ వుండవన్న అభిప్రాయంతో ఏకగ్రీవాలవైపు మొగ్గుచూపుతున్నారు. పోటీలో ఉండాలనుకుంటున్న అభ్యర్థుల మధ్య గ్రామాభివృద్ధికి పోటీ పెడుతున్నారు. గ్రామానికి ఎవరెక్కువ ఇస్తే వారికే పదవంటూ మెలికపెడుతున్నారు. సర్పంచ్ ఆశావహులు కూడా దీనికి అంగీకరిస్తున్నారు.
వాస్తవానికి వెయ్యి ఓట్లున్న పంచాయతీలో కూడా రూ.25 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ఖర్చువుతుంది. పోటీలో దిగిన తరువాత గెలుపుకోసం ఒకరిని మించి మరొకరు ఖర్చుచేసేందుకు వెనకాడడం లేదు. ఒకరు ఓటుకు రూ.1000 ఇస్తే మరొకరు రూ.2000 ఇచ్చేస్తున్నారు. ఈవిషయం తెలుసుకున్న ప్రత్యర్థి తిరిగి అదనంగా రూ.1500 మొత్తం రూ.2,500 ఇచ్చేస్తున్నాడు. దీనికి తోడు నిత్యం మందు, బిర్యానీ ఇవ్వాల్సి వస్తుంది. మద్యం మత్తులో ప్రత్యర్థి వర్గాలతో గొడవలకు దిగుతున్నారు. పోలీస్ కేసులు నమోదు అవుతున్నాయి. పల్లెలు రెండు వర్గాలుగా విడిపోతున్నాయి. ఇవన్నీ గుర్తించి సర్పంచ్ అభ్యర్థులు ఓట్లు కొనుగోలుకు ఎంత ఖర్చు అవుతుందో బేరీజు వేసుకుని ఆ మొత్తాన్ని పంచాయతీకి అప్పగించాలనుకుంటున్నారు. అత్యధికంగా రామాలయాలు, గ్రామదేవతల ఆలయాలకు ఈ సొమ్మును వెచ్చించాలనుకుంటున్నారు. ఈ ఆలయాలు బాగున్న పంచాయతీల్లో కల్యాణ మండపాలు, సామాజిక భవనాలు వంటి ఇతర అభివృద్ధి పనులు చేపట్టాలనుకుంటున్నారు. ఇదే సమయంలో ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహక నగదుతో కూడా పంచాయతీల్లో పలు అభివృద్ధి పనులు చేయవచ్చు. అభివృద్ధి, ఐక్యత వంటి లాభాలను గ్రహించిన పలు పంచాయితీల ప్రజలు వీలైనంత వరకు ఏకగ్రీవాల వైపు చూస్తున్నారు.
-------------------