New TET for veteran teachers పాత టీచర్లకు కొత్త ‘టెట్’
ABN , Publish Date - Jul 09 , 2026 | 12:24 AM
New TET for veteran teachers సీనియర్ ఉపాధ్యాయులకు ఊరట లభించింది. టెట్ ఉత్తీర్ణత తప్పనిసరి అన్న నిబంధనతో ఇన్నాళ్లు పడిన టెన్షన్ పోయినట్లయింది. ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో వారంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇన్ సర్వీసు ఉపాధ్యాయులకు ప్రత్యేక టెట్ నిర్వహిస్తామని చెప్పడాన్ని వారంతా స్వాగతిస్తున్నారు.
పాత టీచర్లకు కొత్త ‘టెట్’
ఇన్ సర్వీసు ఉపాధ్యాయులకు ప్రత్యేక టెట్
పచ్చజెండా ఊపిన రాష్ట్ర ప్రభుత్వం
మెమో జారీ చేసిన విద్యాశాఖ
ఆనందం వ్యక్తం చేస్తున్న ఉపాధ్యాయులు
విజయనగరం/ కలెక్టరేట్, జూలై 8(ఆంధ్రజ్యోతి):
సీనియర్ ఉపాధ్యాయులకు ఊరట లభించింది. టెట్ ఉత్తీర్ణత తప్పనిసరి అన్న నిబంధనతో ఇన్నాళ్లు పడిన టెన్షన్ పోయినట్లయింది. ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో వారంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇన్ సర్వీసు ఉపాధ్యాయులకు ప్రత్యేక టెట్ నిర్వహిస్తామని చెప్పడాన్ని వారంతా స్వాగతిస్తున్నారు.
ఉపాధ్యాయులందరికీ టెట్ ఉత్తీర్ణత తప్పనిసరి అన్న నిబంధనతో టెన్షన్ పడిన సీనియర్ ఉపాధ్యాయులు కొన్నాళ్లుగా వివిధ రూపాల్లో ప్రభుత్వానికి విన్నవిస్తున్నారు. దీనిపై వివిధ ఉపాధ్యాయ సంఘాల నుంచి వచ్చిన విన్నపాలకు స్పందించిన విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ప్రత్యేక టెట్ నిర్వహించేందుకు అంగీకరించారు. దీనిపై విద్యాశాఖ కార్యదర్శి బుధవారం మెమో నెం.3303567 జారీ చేశారు. పాఠ్యాంశాలు బోధించే స్థాయిని బట్టి ఆయా ఉపాధ్యాయులకు టెట్ పరీక్ష ఉంటుందని పేర్కొనడంతో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. 2011 ముందు నియమితులైన ఉపాధ్యాయులు కోసం ప్రత్యేక టెట్‌ను నిర్వహించాలని ఆదేశాలు జారీ అయ్యాయి.
సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఇన్‌సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులు 2028 ఆగస్టు 31నాటికి టెట్ ఉత్తీర్ణత కావాల్సి ఉంది. దీంతో ఉపాధ్యాయుల్లో కలవరం నెలకొంది. సీనియర్ ఇన్ సర్వీసు టీచర్లు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యాహక్కు చట్టం 2010 నుంచి అమలులోకి వచ్చిందని, అంతకుముందు డీఎస్సీలో ఎంపికైన తమకు టెట్ నిబంధన పెట్టడం సరికాదంటూ సుప్రీం తీర్పుపై పిటిషన్ వేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చారు. సుప్రీంలో రిట్ పిటిషన్ వేసారు. అక్కడ వాదోపవాదాలు ముగిసిన తర్వాత ఈఏడాది మే 29న సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. 1 నుండి 8వ తరగతి వరకు బోధించే ప్రతీ టీచర్ టెట్ పాస్ కావాల్సిందేనని స్పష్టం చేసింది. టెట్‌పై దాఖలైన పిటిషన్లను కొట్టివేసింది. టెట్ పాస్ కావడానికి గతంలో రెండేళ్ల సమయం ఇవ్వగా తాజాగా మరో ఏడాది పొడిగిస్తూ అర్హత సాఽధించడానికి గడువును 2028ఆగస్టు 31వరకు పొడిగించింది. 2010 ఆగస్టు 23కు ముందు నియమితులై, పదవీ విరమణకు ఐదేళ్లకంటే ఎక్కువ సర్వీసు ఉన్న ఇన్ సర్వీసు ఉపాధ్యాయులందరూ టెట్ తప్పనిసరి చేసింది.
జిల్లాలో 11,437 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. వీరిలో 2010 డీఎస్సీ నుండి ఎంపికైన ఉపాధ్యాయులకు టెట్ అవసరం లేదు. అంతకు మునుపు నియామకమైన ఉపాధ్యాయులకు మాత్రం టెట్ అవసరం. జిల్లాలో 1998 నుండి 2003 వరకు నిర్వహించే డీఎస్సీలో ఎక్కవ ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేశారు. జిల్లాలో టెట్ అర్హత లేని ఉపాధ్యాయులు సుమారు 5,639 మంది వరకు ఉన్నారు. గతేడాది నిర్వహించిన టెట్ పరీక్షల్లో ఇన్‌సర్వీసులో ఉన్న వారు 30శాతం మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో వందల సంఖ్యలో మాత్రమే అర్హత సాధించారు. ఇప్పటికీ 5 వేల మందిపైగా టెట్ ఉత్తీర్ణత కావాల్సి ఉంది. ఇటీవల టెట్‌కు జిల్లా నుండి 40శాతం మేరకు దరఖాస్తు చేసుకున్నారు. ఫ మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సీనియర్ ఉపాధ్యాయులు ఎమ్మెల్యేలు, ఎంపీల ద్వారా ప్రత్యేక టెట్ నిర్వహించాలని ప్రభుత్వానికి విన్నవించారు. దీనిపై ఎమ్మెల్సీలు వేపాడ చిరంజీవిరావు, ఆలపాటి రాజేంద్రప్రసాద్, కంచర్ల శ్రీకాంత్, భూమిరెడ్డి రామగోపాల్, పేరాబత్తుల రాజశేఖర్ కలిసి సమస్యను విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌తో చర్చించారు. ఆయన సానుకూలంగా స్పందించారు. లోకేశ్ నిర్ణయంతో ఉపాధ్యాయులకు ప్రత్యేక టెట్ నిర్వహణకు పచ్చజెండా ఊపినట్లయింది.