Share News

Pension Distribution పింఛన్ల పంపిణీలో నూతన విధానం

ABN , Publish Date - Oct 26 , 2026 | 12:16 AM

New System for Pension Distribution ఎన్టీఆర్‌ భరోసా సామాజిక పింఛన్లకు సంబంధించి నవంబరు నుంచి నూతన విధానం అమలుకానుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ వాటాలను వేర్వేరుగా పింఛన్‌దారులకు అందించనున్నాయి. రాష్ట్ర సర్కారు వాటా కింద పింఛన్‌ నగదు మొత్తాన్ని సచివాలయాల సిబ్బంది లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి అందిస్తారు.

  Pension Distribution పింఛన్ల పంపిణీలో నూతన విధానం

గరుగుబిల్లి, అక్టోబరు 25(ఆంధ్రజ్యోతి): ఎన్టీఆర్‌ భరోసా సామాజిక పింఛన్లకు సంబంధించి నవంబరు నుంచి నూతన విధానం అమలుకానుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ వాటాలను వేర్వేరుగా పింఛన్‌దారులకు అందించనున్నాయి. రాష్ట్ర సర్కారు వాటా కింద పింఛన్‌ నగదు మొత్తాన్ని సచివాలయాల సిబ్బంది లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి అందిస్తారు. కేంద్రం వాటాను సంబంధిత పింఛన్‌దారుల బ్యాంకు ఖాతాల్లో డైరెక్ట్‌ బెనిఫిషరీ ట్రాన్స్‌ఫర్‌ (డీబీటీ) విధానంలో జమ చేయనున్నారు. వృద్ధులు, ఒంటరి మహిళలకు అందించే రూ. 4 వేలుకు గాను కేంద్రం వాటాగా రూ. 200లు బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. మిగిలిన మొత్తం రూ. 3,800 రాష్ట్ర ప్రభుత్వం వాటా కింద నగదు రూపంలో సచివాలయం సిబ్బంది అందిస్తారు. దివ్యాంగులకు సంబంధించి రూ. 6 వేలుకు గాను రూ. 300 బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. రూ. 5,700లు రాష్ట్ర ప్రభుత్వం నేరుగా నగదు రూపంలో అందిస్తారు. నూతన విధానంలో కేంద్ర ప్రభుత్వం వాటా పొందాలంటే విధిగా పింఛన్‌దారుల బ్యాంకు ఖాతాలకు ఆధార్‌ అనుసంధానం తప్పనిసరి. ఆధార్‌ కేవైసీ చేసుకోవలసి ఉంది. ఖాతాలకు నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ అఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ) విధిగా పూర్తయి ఉండాలి. జాతీయ స్థాయిలో ఆధార్‌ నంబరు ద్వారా ప్రభుత్వ పథకాలకు సంబంధించిన నగదు బదిలీ సులభతరమవుతుంది. జిల్లాలో 1,36,170 మంది నెలవారీ పింఛన్లు పొందుతున్నారు. ఇందుకోసం ప్రభుత్వం రూ. 58.52 కోట్లు విడుదల చేస్తుంది.

ఎన్‌పీసీఐ ఇలా చూడొచ్చు

పాస్‌ పుస్తకాలు లేని డిజిటల్‌ ఖాతాలకు ఆధార్‌ అనుసంధానమైతే నగదు జమలో సమస్య తలెత్తే అవకాశం ఉంది. ఎన్‌పీసీఐ లింక్‌ను సరిచూసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. పింఛన్‌దారులకు ఎన్ని బ్యాంకు ఖాతాలు ఉన్నా ఎన్‌పీసీఐ లింక్‌ ఒక్క దానికే అనుసంధానం అవుతుంది. పింఛన్‌దారులు వెబ్‌సైట్‌ ద్వారా మార్చుకునే అవకాశం ఉంది. ‘నవంబరు 1 నుంచి ప్రారంభం కానున్న నూతన విధానంపై ఎంపీడీవోలు, సచివాలయాల సిబ్బందికి ఆదేశాలు జారీ చేశాం. విధిగా ఆధార్‌ అనుసంధానం చేయాలని పింఛన్‌దారులకు సూచించాం. బ్యాంకుల్లో ఆధార్‌కు కేవైసీ చేసుకోకుంటే కేంద్రం వాటా జమ కాదు. ఎన్‌పీసీఐ తప్పనిసరి. ’ అని డీఆర్‌డీఏ పీడీ సీహెచ్‌ ప్రభావతి తెలిపారు.

Updated Date - Oct 26 , 2026 | 12:16 AM