కొత్త పింఛన్లు వస్తున్నాయ్
ABN , Publish Date - Sep 07 , 2026 | 12:12 AM
అర్హత ఉన్న వారికి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల మంజూరుకు ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది.
- నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ
- మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం
పార్వతీపురం/గరుగుబిల్లి, సెప్టెంబరు 6 (ఆంధ్రజ్యోతి): అర్హత ఉన్న వారికి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల మంజూరుకు ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఎక్స్ అఫిషియా కార్యదర్శి కరుణ ఆదేశాలు జారీచేశారు. అర్హులైన వారు సోమవారం నుంచి స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు కార్యాలయంలో దరఖాస్తులు అందించాలన్నారు. దరఖాస్తుతో పాటు ఆధార్, బియ్యం కార్డు, ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలు, దివ్యాంగులైతే సదరం ధ్రువీకరణ పత్రం అందించాల్సి ఉంది. వృద్ధాప్యం, వితంతు, ఒంటరి మహిళలు, వికలాంగ పింఛన్లకు సంబంధించి సెర్ప్ సీఈవో, చేనేత కార్మికులకు చేనేత శాఖ, మత్స్యకారులకు మత్స్యశాఖ, డప్పు కళాకారులకు సంబంధించి సోషల్ వెల్ఫేర్, తదితర శాఖల అధికారుల పర్యవేక్షణలో పింఛన్ల మంజూరు ఉంటుంది.ఈ నెల 7 నుంచి 16 వరకు దరఖాస్తుల స్వీకరణ, 17 నుంచి 21 వరకు పరిశీలన, 22 నుంచి 24 వరకు ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషననర్ల పరిశీలన, 25, 26 తేదీల్లో నూతన పింఛన్లకు నిధులు ప్రతిపాదన ఉంటుందని అన్నారు.
- పింఛన్ పొందేందుకు బియ్యంకార్డు, ఆధార్ కార్డు, ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలు, పలు కేటగిరీలపై అందాల్సి ఉంది. వృద్ధాప్యానికి వయసు రుజువు చేసేందుకు ఆధార్, వితంతువులకు భర్త మరణ ధ్రువీకరణ పత్రం, భర్త ఆధార్ నంబరు, ఒంటరి మహిళలకు సంబంధించి విడాకుల పత్రాలు, అవివాహిత అయితే తహసీల్దార్ నుంచి ధ్రువీకరణ పత్రం, వికలాంగ పింఛన్లకు సదరం ధ్రువీకరణ పత్రం 40 శాతం పైబడి ఉండాలి. అలాగే పలు రకాల పింఛన్లకై ఆయా శాఖల అధికారుల ధ్రువీకరణ పత్రాలు విధిగా పొందుపర్చాలి ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్ల తరువాత నూతన పింఛన్లకు ప్రకటన చేయడంతో ప్రజల్లో ఆనందం వ్యక్తవుతుంది.