Share News

new look to kotta valasa Railway Station‘కొత్త’వలస రైల్వేస్టేషన్‌

ABN , Publish Date - Jan 15 , 2026 | 12:05 AM

new look to kotta valasa Railway Station కొత్తవలస రైల్వేస్టేషన్‌కు మహర్దశ పట్టింది. కేంద్రప్రభుత్వం కొత్తవలస రైల్వేస్టేషన్‌ను అమృత భారత్‌ రైల్వేస్టేషన్‌గా గుర్తించి అభివృద్ధికి సుమారు రూ.18 కోట్లు మంజూరు చేసింది.

new look to kotta valasa Railway Station‘కొత్త’వలస రైల్వేస్టేషన్‌
కొత్తవలస రైల్వే స్టేషన్‌లో జరుగుతున్న విస్తరణపనులు

‘కొత్త’వలస రైల్వేస్టేషన్‌

శరవేగంగా అభివృద్ధి పనులు

అదనంగా లైన్ల నిర్మాణం

ప్లాట్‌ఫారాల సంఖ్య పెంపు

కొత్తవలస, జనవరి 14(ఆంధ్రజ్యోతి): కొత్తవలస రైల్వేస్టేషన్‌కు మహర్దశ పట్టింది. కేంద్రప్రభుత్వం కొత్తవలస రైల్వేస్టేషన్‌ను అమృత భారత్‌ రైల్వేస్టేషన్‌గా గుర్తించి అభివృద్ధికి సుమారు రూ.18 కోట్లు మంజూరు చేసింది. ఆ నిధులతో జోరుగా పనులు జరుగుతున్నాయి. దేశానికి స్వాతంత్య్రం రాకముందే కొత్తవలస రైల్వేస్టేషన్‌ ఏర్పాటు చేశారు. జపాన్‌ దేశంతో ఉన్న ఒప్పందం ప్రకారం కిరండోల్‌లోని ఐరన్‌ ఓర్‌ ఘనులను ఆదేశానికి ఇచ్చి కిరండోల్‌ వరకు రైల్వే లైన్‌ ఏర్పాటు చేయడానికి అప్పట్లో అంగీకారం కుదిరింది. అనంతరం కొత్తవలస కిరండోల్‌ రైల్వేలైన్‌ ఏర్పాటైంది. కొత్తవలస రైల్వేస్టేషన్‌ను కూడా ఏర్పాటు చేశారు. తరువాత కాలంలో విజయనగరం-రాయగడ్‌ రైల్వే లైన్‌ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం కొత్తవలస-కిరండోల్‌కు సంబంధించి రెండో రైల్వే లైన్‌, కొత్తవలస నుంచి విజయనగరానికి మూడో రైల్వే లైన్‌ ఏర్పాటు చేస్తున్నారు. దీంతో కొత్తవలస రైల్వే స్టేషన్‌ ప్రాముఖ్యం పెరగనుంది. గోపాలపట్నం నుంచి కొత్తవలస వరకు ఐదు, ఆరు లైన్‌లు ఏర్పాటు చేయడానికి కూడా చర్యలు తీసుకుంటున్నారు. కొత్తవలస నుంచి అనకాపల్లి మీదుగా రాజమహేంద్రవరం వరకు మరో రైల్వే లైన్‌ ఏర్పాటు చేస్తున్నారు. మొత్తంగా కొత్తవలస రైల్వే స్టేషన్‌లో విశాలమైన ఫ్లాట్‌ఫారాలతో పాటు స్టేషన్‌కు సంబంధించి నూతన భవనాలు, ఫ్లాట్‌ఫారాల సంఖ్య పెంపు వంటి చర్యలు చేపట్టారు. కొత్తవలస రైల్వేస్టేషన్‌లో జరిగే అభివృద్ధి పనులను ఎప్పటికప్పుడు డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ వచ్చి పరిశీలిస్తున్నారు. భవిష్యత్తులో విజయనగరం, విశాఖపట్టణం జిల్లాలకు ఈ రైల్వే స్టేషన్‌ ప్రాముఖ్యమైనదిగా మారుతుందని భావిస్తున్నారు.

ప్రయోజనాలు ఇవే

కొత్తవలస రైల్వేస్టేషన్‌ విశాఖపట్టణం-అరుకు రోడ్డును ఆనుకుని ఉండడం వల్ల పర్యాటక ప్రాంతమైన అరుకు వెళ్లడానికి పర్యాటకులు కొత్తవలస రైల్వే స్టేషన్‌కే వస్తుంటారు. విశాఖపట్నంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న గూగుల్‌ డేటా కేంద్రంతో పాటు ఆనందపురం ఏర్పాటు చేస్తున్న సాఫ్ట్‌ వేర్‌ కంపెనీలు కొత్తవలసకు దగ్గరలో ఉండడంతో రైల్వే స్టేషన్‌ ప్రాముఖ్యం పెరగనుంది. కొత్తవలస మండలం రెల్లి రెవెన్యూలో గ్రేహౌండ్స్‌ దళాల శిక్షణ కేంద్రం ఏర్పాటుకు 530 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన విషయం తెలిసిందే. అక్కడకు చేరేందుకు కూడా రైల్వేస్టేషన్‌కు రావాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో ఉంచుకుని కేంద్రం కొత్తవలస రైల్వేస్టేషన్‌ అభివృద్ధికి చర్యలు చేపట్టింది.

అన్ని రైళ్లకూ హాల్ట్‌లు ఉండాలి

కొత్తవలస రైల్వే స్టేషన్‌ను విస్తరించడం వల్ల ఇక్కడ ప్రయాణికుల సంఖ్య పెరగాలంటే దువ్వాడ స్టేషన్‌ మీదుగా వెళ్లే అన్ని ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు కొత్తవలసలో హాల్ట్‌ ఇవ్వాలన్న డిమాండ్‌ ఉంది. ఇలా చేయడం వల్ల విశాఖపట్నానికి చెందిన ప్రయాణికులు, అనకాపల్లి, దువ్వాడ స్టేషన్‌లకు వెళ్లి రైళ్లు ఎక్కకుండా కొత్తవలస వచ్చి రైలును ఆశ్రయించే వీలుందనేది అందరి మాట.

Updated Date - Jan 15 , 2026 | 12:05 AM