Share News

New look for ITIs ఐటీఐలకు కొత్త రూపు

ABN , Publish Date - Jun 28 , 2026 | 11:59 PM

New look for ITIs ప్రభుత్వ ఐటీఐల రూపురేఖలు మారనున్నాయి. వీటిపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టిపెట్టింది. ఆధునీకరణకు భారీగా నిధులు కేటాయిస్తోంది. జిల్లాలో విజయనగరం ఐటీఐను హబ్‌గా చేసి మూడు ఐటీఐలను స్పోక్స్‌గా ఉంచనున్నారు.

 New look for ITIs ఐటీఐలకు కొత్త రూపు
రాజాంలోని ప్రభుత్వ ఐటీఐ

ఐటీఐలకు కొత్త రూపు

కేటాయించనున్న రూ.280 కోట్లు

పీఎం సేతు పథకం కింద అభివృద్ధికి చర్యలు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో అమలు

పరిశ్రమల సాయంతో సదుపాయాలు

రాజాం, జూన్‌ 28(ఆంధ్రజ్యోతి):

ప్రభుత్వ ఐటీఐల రూపురేఖలు మారనున్నాయి. వీటిపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టిపెట్టింది. ఆధునీకరణకు భారీగా నిధులు కేటాయిస్తోంది. జిల్లాలో విజయనగరం ఐటీఐను హబ్‌గా చేసి మూడు ఐటీఐలను స్పోక్స్‌గా ఉంచనున్నారు. ఈ లెక్కన విజయనగరం ఐటీఐకి అత్యధికంగా రూ.80 కోట్లు కేటాయించనున్నారు. మిగిలిన ప్రభుత్వ ఐటీఐలకు రూ.40 కోట్లు చొప్పున నిధులు ఇవ్వనున్నారు. స్పోక్స్‌గా రాజాం, భద్రగిరి, సాలూరు ప్రభుత్వ ఐటీఐలను చేర్చారు. అలాగే విశాఖనగరంలోని కంచరపాలెం ఐటీఐని హబ్‌గా చేసి దాని పరిధిలోకి బొబ్బిలి ఐటీఐని స్పోక్‌గా చేర్చి అభివృద్ధి చేయనున్నారు. పీఎం సేతు పథకం కింద కేంద్ర ప్రభుత్వ వాటాగా 50 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 33 శాతం, పరిశ్రమల వాటాగా 17 శాతం నిధులు కేటాయించాలని నిర్ణయించారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలోని 5, కంచరపాలెం ప్రభుత్వ ఐటీఐకి రూ.40 కోట్లు కలిపి రూ.280 కోట్లు సమకూరనున్నాయి. ఈ నిధులతో హాస్టల్‌ సదుపాయంతో పాటు కాన్ఫరెన్స్‌ హాళ్లు, ప్రయోగశాలలు, ఇంక్యుబేషన్‌ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. కొత్త కోర్సులను అందుబాటులోకి తేనున్నారు.

ఇదీ పరిస్థితి..

ఉమ్మడి జిల్లాల పరిధిలో ఏడు ప్రభుత్వ ఐటీఐ కాలేజీలు ఉన్నాయి. విజయనగరం, రాజాం, బొబ్బిలి, పార్వతీపురం, సాలూరు, గుమ్మలక్ష్మీపురం, భద్రగిరిలో నడుస్తున్నాయి. వీటిల్లో చాలా సమస్యలున్నాయి. పాత భవనాల్లోనే విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. తగినంతమంది సిబ్బంది కూడా లేరు. కొన్నాళ్లుగా శాశ్వత నియామకాలు లేవు. కాంట్రాక్ట్‌ సిబ్బందే శిక్షణ ఇస్తున్నారు. విజయనగరం ప్రభుత్వ ఐటీఐలో 14 యూనిట్లకుగాను శిక్షణ ఇచ్చే సిబ్బంది ఇద్దరే ఉన్నారు. వీరిలో ఒకరు మాత్రమే రెగ్యులర్‌, మరొకరు కాంట్రాక్ట్‌ ఉద్యోగి. ఈ ఐటీఐలో వందలాది మంది విద్యార్థులున్నారు. కానీ ట్రేడ్‌కు తగ్గట్టు శిక్షణనిచ్చేవారు లేరు. ఈ ఐటీఐకి డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ ఎంప్లాయిమెంట్‌ ట్రైనింగ్‌ గుర్తింపు దక్కింది కానీ శిక్షకుల పోస్టులు మంజూరు చేయడం లేదు. బొబ్బిలి ప్రభుత్వ ఐటీఐలో నలుగురు రెగ్యులర్‌, ముగ్గురు కాంట్రాక్ట్‌ శిక్షకులు విధులు నిర్వహిస్తున్నారు. ఇక్కడ 24 యూనిట్లలో వందలాది మంది విద్యార్థులు ఉన్నారు. సిబ్బంది కొరత ఒక వైపు, ఇరుకు గదుల్లో విద్యార్థులు పడుతున్న బాధలు వర్ణనాతీతం. అందుకే ఎక్కువ మంది విద్యార్థులు ప్రైవేటు ఐటీఐల వైపు మొగ్గుచూపుతున్నారు. ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టిపెట్టడం, రాష్ట్ర ప్రభుత్వం ఆసక్తిచూపడం వంటివి కలిసొచ్చే అంశాలు.

ప్రవేశాలు పెరిగే అవకాశం..

పదో తరగతి తరువాత ఎక్కువ మంది ఐటీఐ వైపు చూస్తున్నారు. రైల్వేతో పాటు కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వపరంగా విద్యుత్‌, పంచాయతీరాజ్‌ వంటి శాఖల్లో ఇప్పుడు ఐటీఐ అర్హతతో ఉద్యోగాలు లభిస్తున్నాయి. 2019లో సచివాలయాల విద్యుత్‌ లైన్‌మెన్లు, సర్వేయర్‌ పోస్టులు వేలాదిగా భర్తీ అయ్యాయి. ఆ సమయంలో ఐటీఐ ఎలక్ర్టానిక్‌, సివిల్‌ డ్రాఫ్ట్‌మెన్‌ కోర్సులు చేసిన వారికి పెద్ద ఎత్తున ఉద్యోగాలు లభించాయి. దీంతో అప్పటి నుంచి ఐటీఐకి డిమాండ్‌ ఏర్పడింది. అయితే కొన్ని ప్రైవేటు ఐటీఐల తీరుపై విమర్శలు ఉన్నాయి. జిల్లా వారిని కాకుండా చత్తీస్‌గడ్‌, ఒడిశా విద్యార్థులకు పెద్దపీట వేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. అన్నింటికీ మించి కొన్ని ఐటీఐలలో శిక్షణ తీసుకోకుండానే సర్టిఫికెట్లు జారీచేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ప్రైవేటు ఐటీఐల నిర్వహణ లాభసాటిగా ఉందని విద్యావర్గాల్లో కూడా ఒక ప్రచారం ఉంది. జిల్లా వ్యాప్తంగా 28 ప్రైవేటు ఐటీఐలు కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. వీటిల్లో దాదాపు ఏటా 5 వేల మందికిపైగా విద్యార్థులు రిలీవ్‌ అవుతున్నారు.

బలోపేతానికి చర్యలు

పీఎం సేతు పథకం పరిధిలో ఐటీఐల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఐటీఐ హబ్‌గా విజయనగరం జిల్లా కేంద్రం ఉంది. దీనివల్ల వసతితో పాటు సిబ్బంది కొరత సమస్య తీరుతుంది. కొత్త కోర్సులు సైతం అందబాటులోకి వస్తాయి. ఇంతవరకు రెండుసార్లు మెగా జాబ్‌మేళా నిర్వహించాం. గుర్తింపు పొందిన కంపెనీలు వచ్చి ఇంటర్వ్యూలు నిర్వహించి ఉద్యోగాలకు ఎంపిక చేశాయి. వెళ్లిన వారు ఎక్కువ రోజులు ఉండకుండా వచ్చేస్తున్నారు. దీనివల్లే అనుకున్న లక్ష్యం చేరలేకపోతున్నాం.

- బండారు భాస్కరరావు, ప్రిన్సిపాల్‌, రాజాం ప్రభుత్వ ఐటీఐ

Updated Date - Jun 28 , 2026 | 11:59 PM