Share News

‘నూతన’ సందడి

ABN , Publish Date - Jan 01 , 2026 | 10:57 PM

జిల్లా అంతటా గురువారం నూతన సంవత్సర సందడి నెలకొంది.

 ‘నూతన’ సందడి
కేక్‌ను కట్‌ చేస్తున్న కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి, చిత్రంలో జేసీ యశ్వంత్‌కుమార్‌రెడ్డి, డీఆర్వో హేమలత తదితరులు

- జిల్లా అంతటా న్యూ ఇయర్‌ వేడుకలు

- ప్రజాప్రతినిధులు, అధికారులకు శుభాకాంక్షలు చెప్పేందుకు బారులు

పార్వతీపురం/బెలగాం/సాలూరు, జనవరి 1 (ఆంధ్రజ్యోతి): జిల్లా అంతటా గురువారం నూతన సంవత్సర సందడి నెలకొంది. కొత్త సంవత్సరానికి జిల్లావాసులు స్వాగతం పలుకుతూ కేక్‌ కట్‌ చేసి.. స్వీట్లు పంచుకుని ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు. గురువారం ఉదయం ప్రజాప్రతినిధులు, అధికారులకు పలువురు పుష్పగుచ్ఛాలు అందజేశారు. కలెక్టరేట్‌లో కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి కేక్‌ కట్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నూతన సంవత్సరంలో జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రతి ఒక్కరూ అంకితభావంతో విధులు నిర్వహించాలని కోరారు. జేసీ యశ్వంత్‌కుమార్‌రెడ్డి, డీఆర్వోవో హేమలతతో పాటు వివిధ శాఖల అధికారులు, ఎంపీడీవోలు, తహసీల్దార్లు, రెవెన్యూ సంఘం, ఏపీ ఎన్‌జీవో సంఘం ప్రతినిధులు కలెక్టర్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు. ఎస్పీ ఎస్‌వీ మాధవరెడ్డి కేక్‌ కట్‌ చేశారు. కొత్త ఏడాదిలో అందిరికీ మంచి జరగాలని, నిర్దేశించుకున్న లక్ష్యాలను అధిగమించేలా సమర్థవంతంగా పని చేయాలని, ప్రజలందరికీ మంచి సేవలందించి పోలీస్‌ శాఖ ప్రతిష్టను పెంచాలని ఎస్పీ సూచించారు. కార్యక్రమంలో ఏఎస్పీ వెంకటేశ్వరరావు, పార్వతీపురం ఏఎస్పీ మనీషా వంగలరెడ్డి, డీఎస్పీలు రాంబాబు, థామస్‌రెడ్డి, పలువురు సీఐలు, సిబ్బంది పాల్గొన్నారు. మహిళా శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖా మంత్రి గుమ్మిడి సంధ్యారాణిని కలెక్టర్‌ ఎన్‌.ప్రభాకర్‌రెడ్డి, జాయింట్‌ కలెక్టర్‌ సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి కే.హేమలత కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

Updated Date - Jan 01 , 2026 | 10:57 PM