Share News

New charm for the Gurajada house గురజాడ గృహానికి నూతన శోభ

ABN , Publish Date - Jun 04 , 2026 | 12:26 AM

New charm for the Gurajada house విజయనగరంలోని గురజాడ అప్పారావు స్వగృహం త్వరలో కొత్త శోభను అద్దుకోనుంది. ఆధునికీకరణ దిశగా ప్రభుత్వం చొరవ తీసుకుంటోంది. ఇంటిని తీర్చిదిద్దుతూ ఆడిటోరియం కూడా ఏర్పాటు చేసేందుకు రూ.1.20 కోట్లతో ప్రతిపాదనలు తయారు చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ కార్యాలయం బుధవారం తెలిపింది.

New charm for the Gurajada house గురజాడ గృహానికి   నూతన శోభ

గురజాడ గృహానికి

నూతన శోభ

ఆధునికీకరణ దిశగా అడుగులు

ఆడిటోరియం నిర్మాణానికి రూ.1.20 కోట్లతో ప్రతిపాదనలు

డిప్యూటీ సీఎం పవన్‌ కార్యాలయం వెల్లడి

కృతజ్ఞతలు తెలియజేస్తున్న జిల్లా ప్రజలు

విజయనగరం, (ఆంధ్రజ్యోతి):

విజయనగరంలోని గురజాడ అప్పారావు స్వగృహం త్వరలో కొత్త శోభను అద్దుకోనుంది. ఆధునికీకరణ దిశగా ప్రభుత్వం చొరవ తీసుకుంటోంది. ఇంటిని తీర్చిదిద్దుతూ ఆడిటోరియం కూడా ఏర్పాటు చేసేందుకు రూ.1.20 కోట్లతో ప్రతిపాదనలు తయారు చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ కార్యాలయం బుధవారం తెలిపింది. ఇంకోవైపు గురజాడ రచనల డిజిటలైజేషన్‌ ప్రక్రియ కూడా జరుగనుంది. ఆయన గురుతులు పది కాలలు నిలిచేలా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. పురావస్తు శాఖ సహకారంతో 150 ఏళ్ల నాటి గురజాడ నివాసం కొత్త రూపు సంతరించుకోనుండడం గురించి తెలిసి జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ చొరవను అభినందిస్తున్నారు. గురజాడ గృహం ఆధునికీకరణకు సంబంధించి నేడో రేపో జీవో విడుదల కానున్నట్లు తెలిసింది.

గత ఏడాది ఆగస్టు 24న విశాఖలో జనసేన సభ జరిగింది. విజయనగరంలో గురజాడ స్వగృహం స్థితిని జనసేన నేతలు పవన్‌ కల్యాణ్‌ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై పవన్‌ చలించి ఆ మహనీయుడి నివాసగృహాన్ని ఆధునీకరిస్తామని, ఆయన రచనలను డిజిటలైజేషన్‌ చేస్తామని ప్రకటించారు. ఆ మాటలు ఆచరణ దిశగా నేడు అడుగులు పడుతున్నాయి. దీనిపై సాహితీప్రియులు, గురజాడ అభిమానులు, జిల్లా ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.

సామాన్యులకు సైతం అర్థమయ్యే సరళమైన పదాలు, అందరి నోళ్లలో నానే నుడికారాలు, ప్రజల జీవన శైలిని ప్రతిబింబించే మాండలికాలు, సజీవ పాత్రలు, సామాజిక రుగ్మతలపై తూటల్లాంటి మాటలు, మహాకవి గురజాడ రచనల్లో కనిపించే ప్రత్యేకతలివి. ఆయన చనిపోయి శతాబ్దం అవుతున్నా.. ప్రజల గుండెల్లో ఇప్పటికీ జీవించే ఉన్నారు. అలాంటి వ్యక్తి నివసించిన గృహాన్ని సంరక్షించే నాథుడే లేకపోయాడు. భవనం శిథిలావస్థకు చేరుకున్నా.. మందుబాబులు అడ్డగోలుగా ప్రవేశిస్తున్నా పట్టించుకునేవారు లేరు. ఇటువంటి సమయంలో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ గత ఏడాది కీలక ప్రకటన చేశారు. విశాఖలో జరిగిన సేనతో సేనాని కార్యక్రమంలో పాల్గొన్న పవన్‌ కల్యాణ్‌ గురజాడ అప్పారావు ఇంటిని సంరక్షిస్తామని.. ఆధునీకరించి ఆయన రచనలను డిజిటలైజేషన్‌ చేస్తామని ప్రకటించారు. కార్యాచరణ ప్రారంభం కావడంపై ఆయనకు జిల్లా సాహితీ వేత్తలు, గురజాడ అభిమానులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

చారిత్రక సంపదగా గుర్తింపు..

గురజాడ అప్పారావుది విశాఖ జిల్లా ఎస్‌.రాయవరం మండలం. కానీ ఆయన విజయనగరంలోనే స్థిరపడ్డారు. విజయనగరం వాసిగానే గుర్తింపుపొందారు. 1915లోనే ఆయన కాలం చేశారు. అంతకు కొన్నేళ్ల ముందునే విజయనగరం రాజుల నుంచి ఆ ఇంటిని కొనుగోలు చేశారు. ఆయన మరణానంతరం రచనలను, డైరీని హైదరాబాద్‌ తరలించారు. కళ్లజోడు, రబ్బరుస్టాంప్‌, ఇత్తడి కత్తి, రంగూన్‌ టేకుతో చేయించిన మేబల్ల, రెండు కుర్చీలు, విదేశాల నుంచి తెప్పించిన మూడు ఆయిల్‌ పెయింటింగ్స్‌ మాత్రమే విజయనగరంలో మిగిలాయి. ఈ మహాకవి గొప్పతనం దేశవిదేశాలకు తెలియడంతో ఈ గృహాన్ని చారిత్రాత్మక సంపదగా గుర్తించారు. 2015లోనే పురావస్తు శాఖ పరిధిలోకి వెళ్లింది. దీంతో కళ్లజోడు, చదువుకున్న పుస్తకాలు, రాసుకున్న నోట్సులు, ఆయన నిద్రించే గదికి అప్పట్లో మరమ్మతులు చేశారు. ఈ క్రమంలో అప్పటి ప్రభుత్వం రెండు గదులను పునర్నిర్మించి అందుబాటులోకి తెచ్చింది. అయితే మిగతా ఆరు గదులను మాత్రం అలానే విడిచిపెట్టారు.

వైసీపీ ఆర్భాటపు ప్రకటనలు..

గురజాడ గృహాన్ని మ్యూజియంగా మార్చుతామని వైసీపీ ప్రకటించింది. ఆర్భాటం చేసింది. కానీ ఎటువంటి చర్యలు చేపట్టలేదు. 2012లో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏకంగా శంకుస్థాపనలు చేసింది. తరువాత ఆ ఊసు మరిచిపోయింది. కాగా గురజాడ గృహంలో దిగువన ఉన్న ఓ గదిలో గ్రంథాలయం నిర్వహిస్తున్నారు. గురజాడ మునిమనువడు వెంకటేశ్వరప్రసాద్‌ను ఔట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన గ్రంథాలయ నిర్వహణకు జిల్లా పరిషత్‌ నియమించింది. నెలకు రూ.10 వేల వేతనంగా నిర్ణయించింది. కానీ ఆ జీతం కూడా సక్రమంగా అందడం లేదు. రోజూ విద్యార్థులు చదువుకునేందుకు అక్కడకు వస్తుంటారు. ఇంటి పక్కనే డంపింగ్‌ యార్డును తలపించేలా చెత్త ఉంటోంది. దుర్గంధం నడుమే అక్కడకు వచ్చి విద్యార్థులు పుస్తకాలు చదువుతుంటారు. ఇకపై ఈ పరిస్థితి మారనుంది.

శుభ పరిణామం..

గురజాడ స్వగృహంపై డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ స్పందించడం శుభ పరిణామం. నివాసం, ఆడిటోరియం నిర్మాణంపై కార్యాచరణ ప్రారంభించడం ఆహ్వానించదగ్గ విషయం. ఇప్పటివరకూ ఏ ప్రభుత్వాలు పట్టించుకోలేదు. కానీ తొలిసారిగా కూటమి ప్రభుత్వం ముందుకురావడం శుభ పరిణామం.

- అవనాపు విక్రమ్‌ జనసేన నాయుకుడు

చాలా సంతోషంగా ఉంది

గురజాడ ఇందిర (అప్పారావు మునిమనవడి భార్య)

ప్రభుత్వం ముందుకొచ్చి గురజాడ గృహాన్ని అభివృద్ధి చేయాలనుకోవడం ఆనందంగా ఉంది. ఈ విషయాన్ని బుధవారం సోషల్‌ మీడియాలో చూశాను. ప్రభుత్వం, ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ చొరవతో గురజాడ అప్పారావు గృహం భావితరాల కవులకు, సాహితీవేత్తలకు ఎంతో ఉపయోగకరంగా మారుతుంది. గురజాడ గురుతులు చెరిగిపోకుండా ఉండేందుకు ఆయన మునిమనవడు గురజాడ వెంకటేష్‌ప్రసాద్‌ నిత్యం శ్రమిస్తున్నారు. పక్కన ఖాళీ స్థలం ఉండడంతో ఆకతాయిలు ఇంట్లోకి చొరబడి పాడుచేస్తున్నారు. ఇదే విషయాన్ని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌కు చెప్పడంతో ఇంటి వెనుక భాగాన గ్రిల్స్‌, సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.

------------------------

Updated Date - Jun 04 , 2026 | 12:26 AM