కొత్తగా.. అధునాతనంగా
ABN , Publish Date - Sep 02 , 2026 | 11:39 PM
విద్యార్థుల వసతి గృహాలను గత వైసీపీ ప్రభుత్వం పూర్తిగా గాలికి వదిలేసింది.
- ఎస్.కోట, గజపతినగరంలో వసతి గృహాల నిర్మాణం
- రూ.3కోట్ల చొప్పున నిధుల కేటాయింపు
- అన్ని సదుపాయాల కల్పన
- త్వరలో అందుబాటులోకి
- శృంగవరపుకోట పట్టణ పరిధి పందిరప్పన్న కూడలి సమీపంలో ఉన్న ప్రభుత్వ సాంఘిక సంక్షేమ కళాశాల బాలికల వసతి గృహం ఇది. గత కొన్నేళ్లుగా అద్దెభవనంలో నడుస్తోంది. 75 మంది బాలికలు వసతి పొందుతున్నారు. మరుగుదొడ్లు, స్నానపు గదులు కలిపి ఆరు మాత్రమే ఉన్నాయి. ఇవి చాలకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. నిద్రపోయేందుకు, హోం వర్కు చేసేందుకు గదులు సరిపోకపోవడంతో చదువుపై దృష్టిసారించలేకపోతున్నారు.
-బాలికల ఇబ్బందుల దృష్ట్యా ఎస్.కోట ఎస్సీ కాలనీలో అధునాతనంగా నిర్మిస్తున్న వసతి గృహం ఇది. వంద మంది బాలికలకు వసతి కల్పించేలా నిర్మిస్తున్నారు. గ్రౌండ్ ప్లోర్‌తో పాటు ఒక అంతస్తు గల భవన సముదాయంలో కింద ఆరు మరుగుదొడ్లు, తొమ్మిది స్నానపు గదులు, పైన ఆరు మరుగుదొడ్లు, ఆరు స్నానపు గదులు, అధునాతన కిచెన్, డైనింగ్ హాల్, విద్యార్థినులు దుస్తులు ఉతుక్కునేందుకు ప్రత్యేక స్థలం, చదువుకునేందుకు కింద, పైన ప్రత్యేక డార్మిటరీలు, నిద్రించేందుకు ప్రత్యేక గదులు వంటి సకల సదుపాయాలు కల్పిస్తున్నారు. ఒకట్రెండు నెలల్లో అందుబాటులోకి రానున్నట్లు సహాయ ఇంజనీర్లు జాన్సన్, సోమశేఖర్ చెబుతున్నారు.
శృంగవరపుకోట, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): విద్యార్థుల వసతి గృహాలను గత వైసీపీ ప్రభుత్వం పూర్తిగా గాలికి వదిలేసింది. విద్యార్థులు హాస్టళ్లలో ఉండడం లేదన్న కారణం చూపి చాలా వాటిని మూసేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వసతి గృహాలపై దృష్టిసారించింది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ప్రధాన మంత్రి అనుసుచిత్ అభ్యుధయ్ యోజన (పీఎం-అజయ్)ను వినియోగంలోకి తీసుకువచ్చింది. ముందుగా అత్యంత అవసరమైన వాటిని గుర్తించింది. స్థానిక శాసన సభ్యుల ప్రతిపాదినల మేరకు మంజూరు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 25 వసతి గృహాల నిర్మాణాలకు శ్రీకారం చుట్టింది. మొదటి విడతగా జిల్లాలో రూ.3కోట్లతో శృంగవరపుకోట బాలికల వసతి గృహం, గజపతినగరం బాలుర వసతి గృహాన్ని నిర్మిస్తున్నారు. అఽధునాతన సౌకర్యాలతో మరుగుదొడ్లు, స్నానపు గదులు, కిచెన్, డైనింగ్ హాల్ వంటికి కడుతున్నారు. గజపతినగరంలోని బాలుర వసతి గృహం దాదాపుగా పూర్తికావచ్చింది.
ప్రతిపాదన మేరకు మంజూరు
గత వైసీపీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహాలను పట్టించుకోలేదు. నియోజకవర్గంలో చాలా వరకు శిథిలావస్థకు చేరాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వసతి గృహాల మరమ్మతులకు, కొత్త భవనాల నిర్మాణాలకు ప్రతిపాదనలు చేశాను. ఎస్.కోటలో బాలికల వసతి గృహం నిర్మాణానికి రూ.3కోట్లు పీఎం-అజయ్ నిధులు కేటాయించారు. గత ఏడాది నవంబరులో పనులు ప్రారంభమయ్యాయి. అతిత్వరలో భవనం అందుబాటులోకి వస్తుంది.
-కోళ్ల లలిత కుమారి, ఎమ్మెల్యే, శృంగవరపుకోట
అధునాతనంగా నిర్మిస్తున్న వసతి గృహం