Share News

‘లీప్‌’పై నిర్లక్ష్యం

ABN , Publish Date - Aug 03 , 2026 | 12:36 AM

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలు తీసుకువచ్చింది.

 ‘లీప్‌’పై నిర్లక్ష్యం

-యాప్‌ను డౌన్‌లోడ్‌లో వెనుకంజ

- కేవలం 18వేల మంది ఫోన్లలోనే నిక్షిప్తం

-విద్యార్థుల తల్లిదండ్రులకు కొరవడిన అవగాహన

-పట్టించుకోని అధికారులు

గజపతినరగం, ఆగస్టు 2(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలు తీసుకువచ్చింది. ఇందులో భాగంగా లెర్నింగ్‌ ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ ఆంధ్రప్రదేశ్‌ (లీప్‌)యాప్‌ తీసుకువచ్చింది. ఇందులో విద్యార్థుల వివరాలు, హాజరు, పరీక్షల్లో సాధించిన మార్కులతో పాటు ఉపాధ్యాయుల వివరాలు, అర్హతలు, ప్రభుత్వ పథకాల సమాచారం ఉంటుంది. పాఠశాలల అకడమిక్‌ వివరాలు, మౌలిక సదుపాయాల సమాచారంతో పాటు తల్లిదండ్రుల నుంచి అభిప్రాయాలు సేకరించే అవకాశం ఇందులో ఉంది. విద్యార్థుల సమగ్ర సమాచారం తల్లిదండ్రులకు తెలియాలనే లక్ష్యంతో ప్రభుత్వం లీప్‌ యాప్‌ను రూపొందించింది. తల్లిదండ్రులు తమ ఫోన్‌లో ఈ యాప్‌ను డౌన్‌ లోడ్‌ చేసుకుంటే తమ పిల్లల విద్యాప్రగతిని ఎప్పటికప్పుడు తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఈ ఏడాది నూతన విద్యా సంవత్సరానికి సంబంధించి జిల్లాలో 2,235 ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతి వరకు 2,24,051 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరి తల్లిదండ్రుల ఫోన్‌లో లీప్‌ యాప్‌ను డౌన్‌ లోడ్‌ చేయించాలన్నది లక్ష్యం. కానీ, ఇప్పటి వరకు కేవలం 18వేల విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రమే యాప్‌ను డౌన్‌ లోడ్‌ చేసుకున్నారు. జిల్లాలో ఏడు నియోజకవర్గాలు ఉండగా ప్రతీ నియోజకవర్గంలో ఒక పాఠశాలను లీప్‌ పాఠశాలగా అధికారులు ఎంపిక చేశారు. విశాలవంతమైన మైదానం, అధిక సంఖ్యలో విద్యార్థుల ఉన్న పాఠశాలలను వీటి కోసం ఎంపిక చేశారు.

ప్రయోజనాలు..

లీప్‌ యాప్‌లో పిల్లల అభ్యసన సామర్థ్యాలను చూసుకోవడంతో పాటు వారు ప్రతి రోజూ బడికి వెళుతున్నారా? లేదా?, పరీక్షల్లో ఎన్ని మార్కులు వస్తున్నాయి? వంటి వివరాలు చూసుకోవచ్చు. అలాగే విద్యార్థుల తల్లిదండ్రులు విద్యావ్యవస్థలో సంస్కరణలకు తమకున్న ఆలోచన విధానంతో సలహాలు, సూచనలు ఇవ్వవచ్చు. పదో తరగతి విద్యార్థుల నామినల్‌ రోల్స్‌ పరిశీలించవచ్చు. పేర్లు, వయస్సు ఇతర వివరాలు తప్పుగా నమోదయితే ఈ యాప్‌ ద్వారా మార్చుకునేందుకు వీలుంటుంది.

పట్టించుకోని అధికారులు

ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఈ యాప్‌ను డౌన్‌ లోడ్‌ చేసుకుని తమ పిల్లల వివరాలు చూసుకోవచ్చు. అయితే, బడులు ప్రారంభమై రెండు నెలలు కావస్తున్నప్పటికీ యాప్‌ డౌన్‌లోడ్‌పై ఎందుకు దృష్టి సారించడంలేదని రాష్ట్ర విద్యాశాఖ జిల్లా అధికారులను ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిని పర్యవేక్షించాల్సిన మానిటరింగ్‌ విభాగంలో జిల్లా స్థాయి అధికారులతో పాటు ఎంఈవోలు, సీఆర్పీలు ఉంటారు. సీఆర్పీలు ప్రతీ పాఠశాలను సందర్శించి ఉపాధ్యాయులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులకు చెప్పి యాప్‌ను డౌన్‌ లోడ్‌ చేయాల్సి ఉంటుంది. అయితే వీరు పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి.

డౌన్‌లోడ్‌ చేయించాలి..

లీప్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేయించే బాధ్యత ఎంఈవోలు, సీఆర్పీలదే. దీనివల్ల కలిగే ప్రయోజనాలపై విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలి. ఈ యాప్‌ ద్వారా తల్లిదండ్రులు తమ పిల్లల సామర్థ్యం తెలుసుకోవచ్చు. విద్యార్థుల తల్లిదండ్రులందరూ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకునే విధంగా చర్యలు తీసుకుంటాం.

కె.మోహనరావు, డిప్యూటీ జిల్లా విద్యాశాఖ అధికారి.

Updated Date - Aug 03 , 2026 | 12:36 AM