Pension Funds పింఛన్ల మిగులు నిధుల జమలో నిర్లక్ష్యం
ABN , Publish Date - May 23 , 2026 | 11:13 PM
Negligence in Depositing Surplus Pension Funds జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల మిగులు నిధులు జమ చేయడంలో కొంతమంది సచివాలయ సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నారు. ప్రతి నెలా ఆరో తేదీలోగా ఈ ప్రక్రియ పూర్తి చేయడం లేదు. దీంతో జిల్లా అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గరుగుబిల్లి, మే 23(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల మిగులు నిధులు జమ చేయడంలో కొంతమంది సచివాలయ సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నారు. ప్రతి నెలా ఆరో తేదీలోగా ఈ ప్రక్రియ పూర్తి చేయడం లేదు. దీంతో జిల్లా అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెలలో 1.37 లక్షల మంది పింఛన్‌దారుల కోసం సచివాలయాల వారీగా రూ.18.56 కోట్లు విడుదల చేశారు. అయితే పలు రకాల పింఛన్‌దారులకు రూ. 17.83 కోట్ల వరకూ పంపిణీ చేశారు. మృతి చెందిన వారు, ఇతర ప్రాంతాల్లో ఉన్నవారితో పాటు పలు కారణాలతో పింఛన్ తీసుకోని వారి మొత్తాలను సచివాలయాల సిబ్బంది తిరిగి జమ చేయాల్సి ఉంది. అయితే సుమారు రూ.35.25 లక్షలను నేటికీ జమచేయలేదు. ఈ క్రమంలో శనివారం డీఆర్వో కె.హేమలత వీడియోకాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత ఎంపీడీవోలతో సమీక్షించారు. సచివాలయ సిబ్బంది తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్దేశించిన సమయంలోగా పింఛన్ మిగులు నిధులు జయచేయని వారికి మెమోలు జారీ చేయాలని ఆదేశించారు. ఇదిలా ఉండగా పింఛన్లు పంపిణీపై ప్రభుత్వం సచివాలయాల వారీగా లబ్ధిదారులకు ఐవీఆర్‌ఎస్ కాల్స్ చేసి సమాచారం సేకరిస్తోంది. పింఛన్‌దారుల నుంచి సిబ్బంది లంచం తీసుకుంటున్నారా? వారి ప్రవర్తనా నియమావళి, పింఛన్లను ఇంటి వద్దే అందిస్తున్నారా? అన్న దానిపై వివరాలు సేకరిస్తున్నారు. అయితే ఈ మొత్తం సమాచారం ఉన్నతాధికారులు దృష్టికి వెళ్లింది. దీంతో వారు సచివాలయ సిబ్బంది పింఛన్ల పంపిణీ తీరు, మిగులు నిధుల జమ తదితర అంశాలపై దృష్టి సారించారు.