Share News

‘సీతారామ’ భూములపై నిర్లక్ష్యం

ABN , Publish Date - Nov 28 , 2026 | 12:30 AM

గజపతినగరంలోని సీతారామస్వామి గ్రూపు దేవా లయాల్లోని సీతారామస్వామి ఆలయానికి ఆస్తులు ఉన్నా ఆదాయం మాత్రం అంతంతే. పదుల ఎకరాల్లో భూములు, దుకాణాలు ఉన్నా వాటివలన వచ్చే ఆదాయం ఆ స్థాయిలో ఉండడం లేదు.

 ‘సీతారామ’ భూములపై నిర్లక్ష్యం
ఎం.గుమడాం గ్రామంలో సాగులో ఉన్న ఆలయ భూములు

- కొన్ని భూములకే వేలం పాట

- ఆదాయం అంతంత మాత్రమే

- షాపులు ఉన్నా రాబడి లేదు

- ఇదీ గజపతినగరంలోని సీతారామస్వామి ఆలయ పరిస్థితి

గజపతినగరం, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): గజపతినగరంలోని సీతారామస్వామి గ్రూపు దేవా లయాల్లోని సీతారామస్వామి ఆలయానికి ఆస్తులు ఉన్నా ఆదాయం మాత్రం అంతంతే. పదుల ఎకరాల్లో భూములు, దుకాణాలు ఉన్నా వాటివలన వచ్చే ఆదాయం ఆ స్థాయిలో ఉండడం లేదు. దీంతో ప్రతీ సంవత్సరం సీతారాముల కల్యాణాన్ని దాతల సహకారంతో జరిపించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. భక్తులు సమర్పించిన కానుకలతో నిత్య పూజలు, తీర్థ ప్రసాదాలను నెట్టుకొస్తున్నారు. ప్రతిఏటా ఆలయ భూముల సాగుకు వేలం నిర్వహించి వాటిపై వచ్చే ఆదాయాన్ని స్వామివారి దూప, దీప, నైవేద్యంతో పాటు అర్చకులకు జీతాల చెల్లింపులు తదితర ఖర్చుల కోసం వినియోగించేవారు. అయితే, కొన్నిభూములకు వేలం వేయక పోవడంతో ఆదాయం అంతంత మాత్రమే వస్తుంది.

ఇదీ పరిస్థితి..

సీతారామస్వామి దేవాలయానికి మండలంలోని ఐదు గ్రామాల్లో భూములు ఉన్నాయి. శ్రీరంగ రాజపురంలో 49.23 ఎకరాలు, ఎం.గుమడాంలో 19.3 ఎకరాలు, కనిమెరకలో 29 సెంట్లు, గజపతినగరంలో 34 సెంట్లు, మదుపాడ గ్రామంలో 62 సెంట్లు మొత్తం 69.51ఎకరాల భూమి ఉంది. ఈ భూములను 23 మంది రైతులు కౌలు తీసుకున్నారు. ఇందుకు ప్రతీ సంవత్సరం వారికి నచ్చినంత కౌలు చెల్లించేవారు. అయితే, ఈ ఏడాది జూన్‌ 19న జిల్లా అధికారుల సమక్షంలో 44.54ఎకరాల భూములకు సంబంధించి వేలంపాట నిర్వహించారు. దీనిపై వచ్చిన ఆదాయం 7.40లక్షలను వచ్చే ఏడాది మార్చి నాటికి కౌలుదారులు చెల్లించాల్సి ఉంది. అయితే, మిగిలిన 24.97 ఎకరాలకు వేలం నిర్వహించాల్సి ఉంది. ఈ భూములు ఎం.గుమడాం, కనిమెరక, మదుపాడలో ఉన్నాయి. వాస్తవానికి ఆలయ భూములన్నింటికీ ఒకేసారి వేలం నిర్వహించాల్సి ఉంది. కానీ, ప్రజాప్రతినిధుల ఒత్తిడితో అధికారులు కొన్ని భూములకే వేలం చేపట్టినట్లు విమర్శలు ఉన్నాయి. వేలం నిర్వహించకపోవడంపై భూములు ఏమైనా అన్యాక్రాంతమయ్యాయా? అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. రీసర్వే జరుగుతున్న కారణంగా సంబంధిత అదికారులు ఆలయ భూముల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. అలాగే గజపతినగరం పట్టణంలో సీతారామ ఆలాయానికి చెందిన 6 షాపులు ఉన్నాయి. ఒక్కోషాపునకు నెలకు రూ.825 అద్దెను గత కొంత కాలంగా వసూలు చేస్తున్నారు. మార్కెట్‌ ధర కంటే అతితక్కువకు దుకాణాలను అద్దెకు ఇచ్చినా వాటిని కూడా సక్రమంగా కట్టడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. వేలం పాట నిర్వహిస్తే అద్దెలు పెరుగుతాయని, దీంతో ఆదాయం కూడా దేవాలయానికి సమకూరుతుందని పట్టణ వాసులు అంటున్నారు.

ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు :

జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు దేవదాయ భూములకు వేలం వేస్తాం. ఇప్పటికే 44.54ఎకరాలకు వేలం వేశాం. ఇంకా 24.97 ఎకరాలకు వేలంపాట నిర్వహించాల్సి ఉంది. ఈ భూముల్లో వరి పంట కోత దశలో ఉన్నందున ఉన్నతాధికారులకు నివేదిక అందజేశాం. ఉన్నతాధికారుల నుంచి ఉత్తర్వులు వచ్చిన తక్షణమే ఈ భూములతో పాటు పట్టణంలోని షాపులకు కూడా వేలం నిర్వహిస్తాం.

-శ్రీరామ్‌, ఈవో, గజపతినగరం

Updated Date - Nov 28 , 2026 | 12:30 AM