Share News

Educational Standards విద్యా ప్రమాణాల స్థాయి పెంచాలి

ABN , Publish Date - Aug 21 , 2026 | 12:08 AM

Need to Improve Educational Standards ప్రాథమిక దశలోనే గిరిజన విద్యార్థుల విద్యాప్రమాణాల స్థాయిని పెంచాలని ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో పవార్‌స్వప్నిల్‌ జగన్నాథ్‌ ఆదేశించారు. గురువారం జల్లార గ్రామంలోని జీపీ పాఠశాలను పరిశీలించారు. తొలుత గిరిజన విద్యార్థులతో మాట్లాడి.. ఉపాధ్యాయులు బోధిస్తున్న పాఠ్యాంశాలు ఎంతవరకు అర్థమవుతున్నాయో అడిగి తెలుసు కున్నారు.

  Educational Standards  విద్యా ప్రమాణాల స్థాయి పెంచాలి
గిరిజన విద్యార్థినులతో కలిసి భోజనం చేస్తున్న ఇన్‌చార్జి పీవో

సీతంపేట,ఆగస్టు 20(ఆంధ్రజ్యోతి): ప్రాథమిక దశలోనే గిరిజన విద్యార్థుల విద్యాప్రమాణాల స్థాయిని పెంచాలని ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో పవార్‌స్వప్నిల్‌ జగన్నాథ్‌ ఆదేశించారు. గురువారం జల్లార గ్రామంలోని జీపీ పాఠశాలను పరిశీలించారు. తొలుత గిరిజన విద్యార్థులతో మాట్లాడి.. ఉపాధ్యాయులు బోధిస్తున్న పాఠ్యాంశాలు ఎంతవరకు అర్థమవుతున్నాయో అడిగి తెలుసు కున్నారు. ప్రతీ విద్యార్థి చదువులో పురోగతి సాధించేలా ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టిసారించాలని సూచించారు. అనంతరం గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రాన్ని పరిశీలించి చిన్నారులతో ముచ్చటించారు. చిన్నారుల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు పౌష్టికాహారం ఎంతో అవసరమన్నారు. అంగన్‌వాడీ కేంద్రానికి వచ్చే చిన్నారులకు రోజూ నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించాలని అంగన్‌వాడీ సిబ్బందిని ఆదేశించారు. పీవో వెంట డిప్యూటీ ఈవో పి.నారాయడు ఉన్నారు.

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి

పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకుంటే దోమలు వ్యాప్తిచెందవని ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో పవార్‌ స్వప్నిల్‌ జగన్నాథ్‌ అన్నారు. ప్రపంచ దోమల నివారణ దినం సందర్భంగా సామరెల్లి ఆశ్రమ బాలికల పాఠశాలలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముందుగా గ్రామంలో అవగాహన ర్యాలీ నిర్వహించి విద్యార్థినులకు దోమతెరలు పంపిణిచేశారు. అనంతరం పీవో మాట్లాడుతూ.. పరిసరాల్లో మురుగునీరు నిల్వా లేకుండా చూసుకోవాలన్నారు. దోమతెరలను తప్పనిసరిగా వినియోగించాలని సూచించారు. అనంతరం పాఠశాలలో విద్యా కార్యక్రమాల్లో భాగంగా భౌతికశాస్త్రంలో ప్రదర్శనాత్మక డెమోను పీవో పరిశీలించి గణితంలో విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించారు. సాంకేతిక, ప్రయోగాత్మక పద్ధతుల్లో బోధన కొనసాగించాలని ఉపాధ్యాయులకు పీవో సూచించారు. విద్యార్థినులతో కలిసి భోజనం చేసిన పీవో .. ఆహారం రుచి, మెనూ అమలుపై ఆరా తీశారు. విద్యార్థినుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని హెచ్‌ఎం భాస్కరరావును ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌వో విజయపార్వతి, మలేరియా సబ్‌ యూనిట్‌ అధికారి మోహన్‌రావు, కన్సల్టెంట్‌ శ్రీకాంత్‌, ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Aug 21 , 2026 | 12:08 AM