Share News

Nature Around మనచుట్టూ.. మనసుదోచే ప్రకృతి

ABN , Publish Date - Nov 10 , 2026 | 11:30 PM

Nature Around Us, Captivating Our Hearts ఎత్తయిన కొండలు.. ఎటుచూసినా పచ్చని పొలాలు.. మనసు దోచే జలపాతాలు.. అరకును తలపించే ప్రకృతి సహజ సిద్ధ అందాలు.. ఆధ్యాత్మిక ప్రాంతాలకు కేరాఫ్‌గా నిలుస్తోంది పాచిపెంట మండలం. ప్రధానంగా ఎత్తయిన గిరిశిఖరంపై ఉన్న సతాబి, తంగలాం, గరిసిగుడ్డి, మూలకూడు, గుమ్మడిగూడ, తుమరావెల్లి, మెలియాకాంచూరుతో పాటు మరికొన్ని గ్రామాలు ప్రకృతి అందాలతో కనువిందు చేస్తున్నాయి. ఆయా ప్రాంతాల్లో ఆహ్లాదకర వాతావరణం, ఆకాశాన్ని తాకేలా కనిపించే మబ్బులు దృశ్యం.. చూపర్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

Nature Around  మనచుట్టూ.. మనసుదోచే ప్రకృతి
నీలమ్మవలస జలపాతం

  • ఆధ్యాత్మికం.. ఆహ్లాదకరం

  • పాచిపెంట మండలంలో ప్రకృతి సహజ సిద్ధ అందాలెన్నో..

  • పర్యాటకంగా అభివృద్ధి చేయాలని ప్రజల విన్నపం

పాచిపెంట రూరల్‌, నవంబరు 10(ఆంధ్రజ్యోతి): ఎత్తయిన కొండలు.. ఎటుచూసినా పచ్చని పొలాలు.. మనసు దోచే జలపాతాలు.. అరకును తలపించే ప్రకృతి సహజ సిద్ధ అందాలు.. ఆధ్యాత్మిక ప్రాంతాలకు కేరాఫ్‌గా నిలుస్తోంది పాచిపెంట మండలం. ప్రధానంగా ఎత్తయిన గిరిశిఖరంపై ఉన్న సతాబి, తంగలాం, గరిసిగుడ్డి, మూలకూడు, గుమ్మడిగూడ, తుమరావెల్లి, మెలియాకాంచూరుతో పాటు మరికొన్ని గ్రామాలు ప్రకృతి అందాలతో కనువిందు చేస్తున్నాయి. ఆయా ప్రాంతాల్లో ఆహ్లాదకర వాతావరణం, ఆకాశాన్ని తాకేలా కనిపించే మబ్బులు దృశ్యం.. చూపర్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇవే కాకుండా ఆలూరు సమీపాన ధారగెడ్డ జలపాతం, నీలమ్మవలస సమీపాన కొండవాగు జలపాతం, కన్నయ్యలస సమీపాన మరో జలపాతం, పారమ్మకొండ, పెద్దగెడ్డ జలాశయానికి గత కొన్నేళ్లుగా పర్యాటకుల తాకిడి పెరుగుతోంది. జలపాతాలు పిక్నిక్‌ స్పాట్లుగా మారాయి. ఈ కార్తీక మాసంలో ఆయా ప్రాంతాలు సందర్శకులతో కిటకిటలాడుతుంటాయి. జలపాతాలు చూసేందుకు చుట్టుపక్క ప్రాంతాలతో పాటు ఉత్తరాంధ్ర నలుమూలల నుంచి ఏటా పెద్దసంఖ్యలో సందర్శకులు వచ్చి.. ప్రకృతి అందా లను ఆస్వాదిస్తారు. పెద్దగెడ్డ జలాశయ సమీపంలోని వేగావతినది ఒడ్డున ఉన్న మల్లికార్జున స్వామి ఆలయానికి కూడా ఈ కార్తీక మాసంలో వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఇక్కడకు వచ్చిన ప్రతిఒక్కరూ జలాశయం అందాలను చూసి తిరుగు ప్రయాణమవుతారు. పాచిపెంట మండలంలో జలపాతాలు, పర్యాటక కేంద్రాల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని , పెద్దగెడ్డ జలాశయంలో బోటు షికారు ఏర్పాటు చేయాలని మండల వాసులు కోరుతున్నారు. పర్యాటకులను ఆకట్టుకుంటున్న ప్రాంతాలను అభివృద్ధి చేస్తే ప్రభుత్వానికి ఆదాయం.. స్థానిక గిరిజన యువతకు ఉపాధి లభించే అవకాశం ఉందని వారు చెబుతున్నారు.

Updated Date - Nov 10 , 2026 | 11:30 PM