Nandank has four companies. నందాంకు నాలుగు కంపెనీలు
ABN , Publish Date - Oct 12 , 2026 | 12:17 AM
Nandank has four companies. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పెద్ద సంఖ్యలో పరిశ్రమల ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి. ఎక్కడికక్కడ కంపెనీల ఏర్పాటుకు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు ముందుకొస్తున్నారు. వారికి భూముల కేటాయింపు కూడా త్వరత్వరగా జరుగుతోంది.
నందాంకు నాలుగు కంపెనీలు
50 ఎకరాల్లో పరిశ్రమలు స్థాపించే అవకాశం
రెండు ఎకరాలు మినహా డిపట్టా భూములు
ఏపీఐఐసీకి త్వరలో అప్పగించనున్న భూములు
యువత ఉపాధికి భరోసా
గంట్యాడ, అక్టోబరు 11(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పెద్ద సంఖ్యలో పరిశ్రమల ఏర్పాటుకు అడుగులు పడుతున్నాయి. ఎక్కడికక్కడ కంపెనీల ఏర్పాటుకు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు ముందుకొస్తున్నారు. వారికి భూముల కేటాయింపు కూడా త్వరత్వరగా జరుగుతోంది. మరోవైపు ప్రతి నియోజకవర్గంలో ఒక ఎంఎస్‌ఎంఈ పార్కు ఏర్పాటు చేస్తున్నారు. ఆ పార్కుల్లో అనేక పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి. తాజాగా గంట్యాడ మండలంలోని నందాం గ్రామ పరిధిలో నాలుగు పరిశ్రమల ఏర్పాటుకు రంగం సిద్ధం అవుతోంది. సుమారు 50 ఎకరాల్లో ఈ కంపెనీలు స్థాపించనున్నారు. పరిశ్రమలు ఏర్పాటు చేస్తే యువతకు ఉపాధి కలుగనున్నది. కాగా కంపెనీలు ఏర్పాటు చేయనున్న భూముల్లో రెండు ఎకరాలు మినహా మిగిలినంతా డిపట్టా భూములుగా రెవెన్యూ అధికారులు గుర్తించారు. ఆ భూములపై గతంలో నిరుపేదలకు డిపట్టాలు అందజేశారు. వారిలో సుమారు 50 మందికి పైబడి రైతులు ఉన్నారు. ఆ భూములకు ఫ్రీహోల్డ్ పట్టాలు మంజూరు చేశారు. దీంతో ఆ రైతులకు పరిహారం ఇచ్చి వాటిని సేకరించనున్నారు. ప్రభుత్వం భూములను సేకరించి ఏపీఐఐసీకి అప్పగించనున్నది. అనంతరం భూముల్లో పరిశ్రమలు ఏర్పాటయ్యే అవకాశం ఉంది. 20 ఎకరాల్లో ఏఆర్‌ఈ కంటైనర్ తయారీ యూనిట్ , 10.13 ఎకరాల్లో గన్నీ బ్యాగ్స్ తయారీ, 10.26 ఎకరాల్లో భారతీ టెంట్స్, 12.839 ఎకరాల్లో సీఎన్‌జీ బయోగ్యాస్ కంపెనీ ఏర్పాటు కానున్నాయి. ఈ నాలుగు పరిశ్రమలు ఏర్పాటు చేస్తే ఈ ప్రాంత అభివృద్ధికి కీలక అడుగులు పడతాయి. ఇదే విషయాన్ని తహసీల్దార్ సూర్యకాంతం వద్ద ప్రస్తావించగా నందాంలో నాలుగు పరిశ్రమల ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం భూములు సేకరించనున్నదని వెల్లడించారు.