నాగావళి, వంశధార పరవళ్లు
ABN , Publish Date - Aug 23 , 2026 | 11:51 PM
జిల్లాలో నాగావళి, వంశధార నదులు పరవళ్లు తొక్కుతున్నాయి.
-ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురవడంతో పెరిగిన నీటి మట్టం
- దిగువకు విడిచిపెడుతున్న అధికారులు
- రిజర్వాయర్‌ల్లోకి భారీగా నీరు చేరిక
గరుగుబిల్లి/భామిని, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో నాగావళి, వంశధార నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. తోటపల్లి భారీ సాగునీటి ప్రాజెక్టు పరిధిలోని నాగావళి నదిలో ఆదివారం వరద ప్రవాహం నెలకొంది. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురవడంతో ప్రాజెక్టులోకి సుమారు 11 వేల క్యూసెక్కులకు పైగా నీరు చేరుతుంది. అధికారులు అప్రమత్తమై స్పిల్‌వే గేట్లు నుంచి దిగువ ప్రాంతానికి 9 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. శనివారం పైప్రాంతాల నుంచి తక్కువగా ప్రవాహం చేరగా, ఆదివారం మరింతగా పెరిగింది. ప్రాజెక్టుకు సంబంధించి 105 మీటర్లకు గాను 104.44 మీటర్ల నిల్వ సామర్థ్యం నెలకొంది. అలాగే 2.534 టీఎంసీలకు గాను 2.188 నిల్వ సామర్థ్యం ఉంది. సాగునీటి అవసరాలకు ప్రధాన కాలువల నుంచి 1,320 క్యూసెక్కులను సరఫరా చేస్తున్నారు. ప్రాజెక్టులో ప్రవాహం అధికమైతే దిగువ ప్రాంతాలకు మళ్లించేందుకు అధికారులు అవసరమైన చర్యలు చేపడుతున్నారు.
వంశధార నీరు మళ్లింపు
భామిని, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): ఒడిశాలో కురిసిన వర్షాలతో వంశధార నదిలో నీటిమట్టం పెరిగింది. కాట్రగడ ఓపెన్ హెడ్ ఛానల్‌లోకి వరదనీరు చేరింది. ప్రస్తుతం 5,600 క్యూసెక్కుల ప్రవాహం ఉండగా, సైడ్‌వేర్ ద్వారా 3 వేల క్యూసెక్కులను వరద కాలువలోకి మళ్లిస్తున్నట్టు వంశధార ఎస్‌ఈ రామచం ద్రరావు తెలిపారు. సింగిడి, పారాపురం, బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు నిండిన అనంతరం హిరమండలం రిజర్వాయర్‌కు నీరు చేరుతుందన్నారు.
సింగిడి రిజర్వాయర్‌కు పోటెత్తిన నీరు
వంశధార వరదనీరు మళ్లించడంతో సింగిడి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో నీటిమట్టం పెరిగింది. వరదనీరు, వర్షపునీరు చేరడంతో బ్యాక్ వాటర్ కారణంగా వరి, పత్తి పొలాలు మునిగాయి. ఏటా పంటల ముంపుతో నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తక్షణమే పరిహారం అందించాలని కోరుతున్నారు.