వారిలో నా కొడుకు బతికుంటాడు
ABN , Publish Date - Aug 15 , 2026 | 12:26 AM
కళ్లెదుట 26 ఏళ్ల కొడుకు మృతదేహం. తన ఆశలన్నీ కల్లలైన వేళ. ఉన్న ఒక్క ఆసరా లేదన్న వేదన. అయినా గుండె దిటవు చేసుకుందా తల్లి. తన్నుకొస్తున్న దుఃఖాన్ని దిగమింగుకుంది.
రోడ్డు ప్రమాదంలో గాయపడి.. చికిత్స పొందుతూ యువకుడి మృతి
పుట్టెడు దుఃఖంతో అవయవ దానానికి అంగీకరించిన తల్లి
కళ్లెదుట 26 ఏళ్ల కొడుకు మృతదేహం. తన ఆశలన్నీ కల్లలైన వేళ. ఉన్న ఒక్క ఆసరా లేదన్న వేదన. అయినా గుండె దిటవు చేసుకుందా తల్లి. తన్నుకొస్తున్న దుఃఖాన్ని దిగమింగుకుంది. తన కొడుకును నలుగురిలో చూసుకో వాలనుకుంది. అంతే.. కొడుకు అవయవ దానానికి సమ్మ తించింది. అంత దుఃఖంలోనూ ఆమె చేసిన పనిని వైద్యులు, అక్కడున్న వారు అభినందించారు. ఆ తల్లి పేరు పాడి వరలక్ష్మి. వివరాలిలా ఉన్నాయి.
భోగాపురం, ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం జిల్లా మర్రిపాలెం గ్రామానికి చెందిన పాడి వరలక్ష్మి తన భర్త కొన్నేళ్ల కిందట మృతిచెందడంతో క్లీనింగ్ పౌడర్ తదితర వాటిని అమ్ముకుంటూ జీవనం సాగించింది. తన ఒక్కగానొక్క కొడుకు ప్రదీప్‌కుమార్(26)ను డిగ్రీ వరకు చది వించింది. కుమారుడు కూడా తల్లికి చేదోడువాదోడుగా ఉండేవాడు. నెలరోజుల కిందట భోగాపురం ఎయిర్‌పోర్టులో ప్రదీప్‌కుమార్‌కు ఉద్యోగం వచ్చింది. దీంతో భోగాపురంలో ఓ ఇంట్లో అద్దెకు ఉంటూ ఎయిర్‌పోర్టులో పని చేసుకుంటున్నాడు. అయితే ఈనెల 11న ఎయిర్‌పోర్టులో తనతో పనిచేస్తున్న విజయనగరానికి చెంది న బిందుతో కలిసి ద్విచక్రవాహనంపై షూ కొనేందుకు విశాఖపట్నం వెళ్లి, తిరిగి భోగాపురం వస్తుండగా.. భోగాపురంలో డివైడర్‌ను ఢీకొని గాయాలపాలయ్యారు. దీంతో ఇద్దరినీ విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బిందు పరిస్థితి బాగానే ఉండగా.. ప్రదీప్‌కుమార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతిచెందాడు. చేతికందొచ్చిన కుమారుడు అనంతలోకాలకు వెళ్లిపోవడంతో తల్లి వరలక్ష్మి కన్నీరు మున్నీరయ్యింది. కడుపు కోతను దిగమింగుకుని తన కుమారుడి అవయవ దానానికి ముందుకొచ్చింది. మృతదేహాన్ని శ్రీకాకుళం జిల్లా రాగోలు ఆసుపత్రికి తరలించి, అవయవదానం చేయించారు. అనంతరం మృతదే హాన్ని తల్లికి అప్పగించారు. ఆ తల్లిని చూసి బంధువులు, ఇతరులు కన్నీటి పర్వంతమయ్యారు. అవయవాలు పొందిన వారిలో తన కొడుకు బతికుంటాడని వరలక్ష్మి దుఃఖం దిగమింగుకుంది. ఈ ఘటనపై వరలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ రమేష్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.