మ్యుటేషన్లు పెండింగ్ ఉండకూడదు
ABN , Publish Date - Jun 09 , 2026 | 11:28 PM
రైతులు మ్యుటేషన్ల కోసం పెట్టుకున్న దరఖాస్తులేవీ పెండింగ్ ఉండకుండా చూడాలని కలెక్టర్ రామసుందర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.
- జాయింట్ ఎల్‌పీఎంలను విడదీయాలి
- కలెక్టర్ రామసుందర్ రెడ్డి
విజయనగరం కలెక్టరేట్, జూన్ 9 (ఆంధ్రజ్యోతి): రైతులు మ్యుటేషన్ల కోసం పెట్టుకున్న దరఖాస్తులేవీ పెండింగ్ ఉండకుండా చూడాలని కలెక్టర్ రామసుందర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్, సీసీఎల్‌ఏ జయలక్ష్మి మంగళవారం అమరావతి నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. మ్యుటేషన్లను ఎప్పటికప్పుడు పూర్తి చేసి, 1బి కూడా రైతులకు వెంటనే జారీ చేయాలని అధికారులకు ఆదేశించారు. 22ఏ జాబితా కారణంగా సామాన్య రైతులు ఇబ్బంది పడకుండా చూడాలన్నారు. జాయింట్ ఎల్‌పీఎంలను వీలైనంత వేగంగా విడదీయాలని, జూలై చివరి నాటికి ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. నోషనల్ ఖాతాలు, సున్నా ఖాతాలు, ఈకేవైసీ పోర్టింగ్, ఇనాం భూములు తదితర అంశాలపై సూచనలు చేశారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జేసీ సేతుమాధవన్, డీఆర్‌వో చందక సత్తిబాబు, ఆర్‌డీవోలు పాల్గొన్నారు.
ఖచ్చితమైన ఓటర్ల జాబితా కోసమే ‘సర్’
తప్పులు లేని ఖచ్చితమైన ఓటర్ల జాబితా తయారు చేయడం కోసం సర్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. మంగళవారం ఆయన తన చాంబర్‌లో సర్, యోగాంధ్రపై విలేకరులతో మాట్లాడారు. సర్ కార్యక్రమం 24 ఏళ్ల కిందట జరిగిందని, మళ్లీ ఇప్పుడు నిర్వహిస్తు న్నారని తెలిపారు. 2002 ఓటర్ల జాబితాతో మ్యాపింగ్ జరుగుతుందని చెప్పారు. 77 శాతం వరకూ ఓటరు మ్యాపింగ్ చేసినట్లు తెలిపారు. ఈ నెల 15 నుంచి జూలై 14 వరకూ బీఎల్‌వోలు ఇంటింటికీ వెళ్లి పాక్షికంగా నింపబడిన ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేస్తారని, ఓటర్ల సమాచారం నింపిన తర్వాత తిరిగి వాటిని సేకరిస్తారని తెలిపారు. యోగాంధ్ర-2026లో భాగంగా జిల్లాలో 3 లక్షల మందికి యోగా శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. ఈ నెల 21 నుంచి జూలై 21 వరకూ ప్రతిరోజూ ప్రతి సచివాలయంలో కనీసం 50 మందితో యోగా కార్యక్రమాలు నిర్వహించేందుకు లక్ష్యంగా నిర్దేశించినట్లు తెలిపారు.
ప్రభుత్వ సేవలపై ప్రజల నుంచి సానుకూలత పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రజల నుంచి తక్కువ సానుకూలత వ్యక్తమవుతున్న కొన్ని సేవలకు సంబంధించి క్షేత్రస్థాయి ఉద్యోగులు, ఆయా శాఖాధిపతులతో ఆయన మాట్లాడారు. సేవలను మెరుగుపరచడమే కాకుండా, ఐవీఆర్‌ఎస్ ద్వారా అడిగే ప్రశ్నలపైనా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.
జిల్లాలో వివిధ ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. విజయనగరం -సంబల్‌పూర్ మూడో రైల్వే లైన్ పనులు, కొత్తవలస-విజయనగరం నాలుగో లైన్, ఖుర్ధారోడ్-విజయనగరం మూడో లైన్ పనులకు గెజిట్ నోటిఫికేషన్లు, స్ట్రక్లరు వ్యాల్యూయేషన్ రిపోర్టులు సిద్ధం చేయాలన్నారు. ప్రాజెక్టులు అన్ని సకాలంలో పూర్తయ్యే విధంగా చూడాలన్నారు. మున్సిపాల్టీల్లో మురుగునీటి సమస్య పరిష్కారం కోసం ప్రతిపాదించిన ఎస్టీపీలకు భూసేకరణ పూర్తి చేయాలని అన్నారు.