Mutations must be resolved within 15 days మ్యుటేషన్లను 15 రోజుల్లో పరిష్కరించాలి
ABN , Publish Date - May 14 , 2026 | 12:06 AM
Mutations must be resolved within 15 days పెండింగ్‌లో ఉన్న మ్యుటేషన్లను 15 రోజుల్లో పరిష్కరించాలని కలెక్టర్ రామసుందర్ రెడ్డి ఆదేశించారు. తహసీల్దార్లతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో తిరస్కరణకు గురైన మ్యుటేషన్లపై సభలు పెట్టి కారణాలు వివరించాలని అన్నారు.
మ్యుటేషన్లను
15 రోజుల్లో పరిష్కరించాలి
తిరస్కరిస్తే కారణాలను గ్రామ సభలో వివరించాలి
కలెక్టర్ రామసుందర్ రెడ్డి
విజయనగరం కలెక్టరేట్, మే 13(ఆంధ్రజ్యోతి):
పెండింగ్‌లో ఉన్న మ్యుటేషన్లను 15 రోజుల్లో పరిష్కరించాలని కలెక్టర్ రామసుందర్ రెడ్డి ఆదేశించారు. తహసీల్దార్లతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో తిరస్కరణకు గురైన మ్యుటేషన్లపై సభలు పెట్టి కారణాలు వివరించాలని అన్నారు. వంగర, చీపురుపల్లి భోగాపురం, డెంకాడ, కొత్తవలస, గంట్యాడ తహసీల్దార్లతో మాట్లాడుతూ ఎక్కువ మొత్తంలో మ్యుటేషన్లు పెండింగులో ఉండటానికి కారణాలు అడిగారు. తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. ఇక నుంచి ప్రతి రోజు సమీక్ష ఉంటుందన్నారు. కార్యక్రమంలో జేసీ సేతుమాధవన్, జిల్లా రెవెన్యూ అధికారి చందక సత్తిబాబు, ఆర్‌డీవోలు సుధాసాగర్, రామ్మోహన్, సుధారాణి ఉన్నారు.
తాగునీటి సరఫరాపై దృష్టి పెట్టాలి
జలధార-జలహారతి కింద మంజూరైన పనులన్నీ వెంటనే ప్రారంభం కావాలని కలెక్టరు రామసుందర్ రెడ్డి తెలిపారు. తాగునీరు, జలధారపై మండలాల వారీగా బుధవారం సమీక్షించారు. నిధులు పరిమితంగా ఉన్నందున ప్రాధాన్యతననుసరించి పనులను ప్రతిపాదించాలన్నారు. ప్రతి పనికీ ప్రణాళిక వేసుకోవాలన్నారు. జిల్లాలో 13,555 పనులు మంజూరు కాగా ఇప్పటి వరకూ 5026 పనులు మాత్రమే ప్రారంభం అయ్యాయని, మిగిలిన పనులు వెంటనే ప్రారంభం కావాలన్నారు.
జనగణన వేగంగా జరగాలి
ఇంటింటికీ జరుగుతున్న జనాభా లెక్కింపును వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ రామసుందర్ రెడ్డి ఆదేశించారు. అధికారులుతో బుధవారం నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఇప్పటి వరకూ 27.9 శాతం మాత్రమే పూర్తయ్యిందని, ఈనెల 20 నాటికి పూర్తి చేయాల్సి ఉందన్నారు. డైలీ ప్రోగ్రస్ కనపడాలని, అలసత్వం వహిస్తే సహించేది లేదన్నారు.
భూసేకరణ పూర్తి చేయాలి
జిల్లాలోని వివిధ ప్రాజెక్టుల కోసం భూసేకరణ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని కలెక్టరు రామసుందర్ రెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆయా శాఖల అధికారులతో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. గిరిజన విశ్వవిద్యాలయం, తారకరామ తీర్థసాగర్ ప్రాజెక్టు, జాతీయ రహదారులు, కొత్తవలస- విజయనగరం -సంబలపూర్ నాలుగో రైల్వేలైన్ పనులకు భూసేకరణ పూర్తి చేయాలన్నారు. ఉత్తరాంధ్ర సుజలస్రవంతి ప్రాజెక్టు యూనిట్ 2 కోసం జే.గుమడాం, బి,రాజేరు, జిన్నాం, బొండపల్లి గ్రామాల్లో భూసేకరణ కోసం పబ్లిక్ నోటీసులు జారీ చేయాలన్నారు.