Share News

Rocks and Rough Terrain! రాళ్లు, రప్పలు దాటాల్సిందే!

ABN , Publish Date - May 30 , 2026 | 11:22 PM

Must Cross Rocks and Rough Terrain! ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధికి కూటమి సర్కారు చర్యలు తీసుకుంటున్నా.. ఇంకా క్షేత్రస్థాయిలో పరిస్థితి మారడం లేదు. అధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టి సారించకపోవడంతో భామిని మండలంలో పలు గిరిశిఖర గ్రామాలు మౌలిక వసతులకు నోచుకోవడం లేదు. కనీసం రహదారి సౌకర్యం కూడా లేకపోవడంతో గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

 Rocks and Rough Terrain! రాళ్లు, రప్పలు దాటాల్సిందే!
రాళ్లు తేలిన కోటకొండ రహదారి

  • అధ్వానంగా మారిన దారులు

  • కాలినడకన కూడా రాకపోకలు సాగించలేని వైనం

  • ఏటా ప్రతిపాదనలతోనే సరి

  • గిరిజనులకు తప్పని ఇబ్బందులు

భామిని, మే30(ఆంధ్రజ్యోతి): ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధికి కూటమి సర్కారు చర్యలు తీసుకుంటున్నా.. ఇంకా క్షేత్రస్థాయిలో పరిస్థితి మారడం లేదు. అధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టి సారించకపోవడంతో భామిని మండలంలో పలు గిరిశిఖర గ్రామాలు మౌలిక వసతులకు నోచుకోవడం లేదు. కనీసం రహదారి సౌకర్యం కూడా లేకపోవడంతో గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాళ్లు తేలిన మట్టి రోడ్లపై కాలినడకన కూడా వెళ్లలేని పరిస్థితి. దీంతో అత్యవసర వేళల్లో వారికి డోలీ మోతలు తప్పడం లేదు. ఏటా రోడ్ల నిర్మాణ ప్రతిపాదనల పేరిట హడావుడి తప్పితే.. ఆ తర్వాత ఎవరూ పట్టించుకోవడం లేదని గిరిశిఖర గ్రామస్థులు వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని వారు కోరుతున్నారు.

ఇదీ పరిస్థితి..

- భామిని మండలంలో గిరిశిఖర గ్రామాలైన కోటకొండ, కోసిమానుగూడకు కనీసం రహదారి సదుపాయం లేదు. ఇవి మండల కేంద్రానికి సుమారు 12 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాయి. ఆయా గ్రామాల్లో సుమారు 50 కుటుంబాలు జీవిస్తున్నాయి. అయితే విద్య, వైద్యం, నిత్యావసరాల కోసం రోజూ వారు కొండ దిగి ఎక్కాల్సి వస్తోంది. సుమారు 5 కిలోమీటర్లు రాళ్లు రప్పలు దాటి.. బండ్రసింగి లేదా మణిగ రోడ్డు వరకు చేరుకోవాల్సి వస్తోంది.

-2017-18లో అప్పటి టీడీపీ ప్రభుత్వం.. ఆయా గిరిశిఖర గ్రామాల్లో మట్టి రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేసింది. ఈ మేరకు భామిని నుంచి కోటకొండ, బండ్రసింగి, కోసిమానుగూడ, డోకులగూడ తదితర గిరిజన గ్రామాలకు మట్టి రోడ్లు నిర్మించారు. అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చాక రోడ్ల నిర్వహణను గాలికొదిలేసింది. దీంతో ఆయా రహదారులు అధ్వానంగా మారాయి. వర్షాలకు పూర్తిగా కొట్టుకుపోవడంతో ఆయా ప్రాంతవాసులకు దారి కష్టాలు తప్పడం లేదు.

అర్థాంతరంగా నిలిచిన పనులు...

స్థానిక ఏబీ రోడ్డు నుంచి ఇసుకగూడ మీదుగా డోకులగూడ వరకు నాలుగు కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణానికి గత టీడీపీ ప్రభుత్వం రూ.72లక్షలు మంజూరు చేసింది. అయితే అప్పట్లో వివిధ కారణాలతో అరకొరగా సీసీ రోడ్డు పనులు చేసి విడిచిపెట్టారు. దీంతో వర్షాలకు ఆ రోడ్డు పనులు కొట్టుకుపోయాయి. ప్రస్తుతం బైక్‌పై కూడా వెళ్లలేని విధంగా రోడ్డు తయారైంది. కొత్త రోడ్డు మంజూరుకు సాంకేతిక అడ్డంకులున్న నేపథ్యంలో ఇసుకగూడ నుంచి డోకులగూడ, గేదెలగూడ వరకు నిలిచిపోయిన రోడ్డు పనులను పునరుద్ధరించాలని ఆయా ప్రాంతవాసులు కోరుతున్నారు.

- ఇటీవల మణిగ రోడ్డు నుంచి కడంబసింగి రోడ్డు వరకు రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. అయిటే టెండర్లు పూర్తి కాకపోవడంతో పనులు ప్రారంభం కావడం లేదు.

- దీనిపై పంచాయతీరాజ్‌శాఖ జేఈ భాస్కరరావును వివరణ కోరగా.. ‘కడంబసింగి, కోసిమానుగూడ నుంచి కోటకొండకు పీఎం జన్‌మన్‌ పథకం కింద రూ.3.2 కోట్లతో బీటీ రోడ్డు మంజూరైంది. టెండర్‌ దశలో ఉంది. ఇది ఖరారయ్యాక పనులు ప్రారంభిస్తాం. ఏబీ రోడ్డు నుంచి ఇసుకగూడకు బీటీ రోడ్డు త్వరలోనే పూర్తి చేస్తాం.’అని తెలిపారు.

Updated Date - May 30 , 2026 | 11:22 PM