Must come on time సమయానికి రావాల్సిందే
ABN , Publish Date - Jan 15 , 2026 | 12:07 AM
Must come on time సచివాలయ ఉద్యోగులు నిర్దేశించిన సమయానికి విధులకు హాజరుకావాల్సిందే. ఆలస్యమైతే ఆ రోజు వేతనంలో కోత విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
సమయానికి రావాల్సిందే
హాజరు వేయకుంటే జీతం కోత
సచివాలయ వ్యవస్థపై దృష్టిపెట్టిన ప్రభుత్వం
పర్యవేక్షణకు మండలానికి ఇద్దరు డిప్యూటీ ఎంపీడీవోలు
సచివాలయ ఉద్యోగులు నిర్దేశించిన సమయానికి విధులకు హాజరుకావాల్సిందే. ఆలస్యమైతే ఆ రోజు వేతనంలో కోత విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను మరింతగా సంస్కరించాలని భావించిన కూటమి ప్రభుత్వం ఆ దిశగా మార్పులు తీసుకొస్తోంది. ఇటీవల వాటి పేర్లను మార్చింది. గ్రామ సచివాలయాలను స్వర్ణ గ్రామాలుగా.. వార్డు సచివాలయాలను స్వర్ణ వార్డులుగా మార్చేందుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. పాలనలోనూ మార్పులు తీసుకొస్తోంది. ముఖ్యంగా సమయపాలన, హాజరు విషయంలో కఠినంగా ఉండాలనుకుంటోంది.
రాజాం, జనవరి 14 (ఆంధ్రజ్యోతి):
సచివాలయ వ్యవస్థను 2019లో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటుచేసింది. ఒక్కో సచివాలయంలో 13 మంది సహాయకులను నియమించింది. అయితే గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థపై సరైన పర్యవేక్షణ లేకపోయింది. ఒకవైపు సచివాలయాల్లో పనిచేస్తూనే మాతృశాఖల అజమాయిషీ ఉండేది. దానిని ఇప్పుడు సరిచేసే ప్రయత్నం చేస్తోంది. జిల్లాలో 777 పంచాయతీలకుగాను 626 గ్రామ/వార్డు సచివాలయాలు ఉన్నాయి. 5,781 మంది ఉద్యోగులు పనిచేస్తున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. అయితే వీరిలో చాలామంది సమయపాలన పాటించడం లేదని.. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలున్నాయి. ఈ పరిస్థితిని గాడిన పెట్టేలా ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది.
ముఖ హాజరు తప్పనిసరి..
ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులకు ముఖ హాజరును తప్పనిసరి చేసింది. పనివేళలుగా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటలుగా నిర్ణయించింది. ఖచ్చితంగా సచివాలయంలోనే ఆన్‌లైన్ ద్వారా ఉదయం, సాయంత్రం హాజరువేసేలా చర్యలు చేపట్టింది. సమయానికి హాజరువేయకుంటే ఆ రోజు గైర్హాజరుగా పరిగణనలోకి తీసుకొని వేతనంలో కోత పెట్టేలా విధి విధానాలను రూపొందించింది. సచివాలయాల పర్యవేక్షణకు ప్రభుత్వం ప్రత్యేకాధికారులను నియమించింది. ప్రతి మండలానికి ఇద్దరు డిప్యూటీ ఎంపీడీవోలను నియమించింది.
పనితీరు మెరుగుపడింది
జిల్లాలో సచివాలయ వ్యవస్థ పనితీరు మెరుగుపడింది. ముఖ్యంగా ఉద్యోగుల సమయపాలనపై దృష్టిపెట్టాం. క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించాం. ముఖ హాజరులో కూడా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఆదేశాలు ఇచ్చాం.
- రోజారాణి, సచివాలయాల ప్రత్యేకాధికారిణి, విజయనగరం