Murder of the younger brother తమ్ముడి హత్య
ABN , Publish Date - Jul 24 , 2026 | 12:18 AM
Murder of the younger brother సరసనాపల్లిలో బుధవారం రాత్రి అన్నదమ్ముల మధ్య జరిగిన చిన్నపాటి వివాదం ఘర్షణకు దారితీసి తమ్ముడు మరణానికి కారణమైంది. ఈ ఘటనలో గొడే కృష్ణ(55)ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
తమ్ముడి హత్య
భూమి విషయమై అన్నదమ్ముల మధ్య ఘర్షణ
కర్రతో బలంగా దాడి చేసిన అన్న
మద్యం మత్తులో ఘటన
నిందితుడి కోసం పోలీసుల గాలింపు
రేగిడి, జూలై 23(ఆంధ్రజ్యోతి):
సరసనాపల్లిలో బుధవారం రాత్రి అన్నదమ్ముల మధ్య జరిగిన చిన్నపాటి వివాదం ఘర్షణకు దారితీసి తమ్ముడు మరణానికి కారణమైంది. ఈ ఘటనలో గొడే కృష్ణ(55)ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
సరసనాపల్లి గ్రామానికి చెందిన గొడే అప్పడు, గొడే దాలియ్య, గొడే కృష్ణలు అన్నదమ్ములు. గ్రామ సమీపంలో చెరువు పక్కన కొంత ప్రభుత్వ భూమి వీరి ఆధీనంలో ఉంది. ఇందులో కొన్ని టేకు మొక్కలు ఉన్నాయి. దాలయ్య అన్నదమ్ములకు దూరంగా ఉండటంతో పాటు ఈభూమిపై ఎలాంటి వివాదాల్లో లేడు. మిగిలిన ఇద్దరు అన్నదమ్ములు ఈ భూమితో పాటు చెట్లు పెంపకం విషయంలో తరచూ గొడవపడుతున్నారు. బుధవారం రాత్రి ఆ వివాదం మరింత జఠిలమైంది. ఇద్దరు మద్యం మత్తులో ఉండటంతో తీవ్రంగా వాదులాడుకున్నారు. ఆపై ఘర్షణ జరిగింది. తీవ్ర కోపోద్రిక్తుడైన అన్న అప్పడు సమీపంలో ఉన్న తాటికర్రతో తమ్ముడి తలపైనా, మొహంపైనా మోదాడు. తీవ్ర గాయలతో తమ్ముడు కృష్ణ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అనంతరం అన్న భయంతో ఊరు నుంచి పారిపోయాడు. విషయం గురువారం తెల్లవారి వెలుగులోకి వచ్చింది.
- కృష్ణ భార్య రాములమ్మ ముగ్గురు పిల్లలతో భర్తను విడిచి రేగిడిలో కన్నవారింట ఉంటోంది. నిందితుడు అప్పడు భార్య గతంలోనే చనిపోయింది. ఇద్దరు పిల్లలు పట్టణాలకు వలసపోయి ఉపాధి పొందుతున్నారు. ఈక్రమంలో ఇద్దరు అన్నదమ్ములు ఒంటిరిగానే ఉంటున్నారు. ఘటన విషయం తెలుసుకొన్న రాజాం రూరల్ ఇన్‌చార్జ్ సిఐ నవీన్‌కుమార్, ఎస్‌ఐ బాలకృష్ణ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. నిందుతుడు ఉపయోగించిన బలమైన కర్రను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.
నిందితుని కోసం ముమ్మరంగా గాలింపు
ఘటన జరిగిన కొద్దిసేపుటికే నిందితుడు ఊరునుంచి అదృశ్యమయ్యాడు. పోలీసులు మూడు బృందాలుగా ఏర్పడి నిందితుడి కోసం గాలిస్తున్నట్లు ఎస్‌ఐ బాలకృష్ణ తెలిపారు. కృష్ణ భార్య రాములమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.