Murder for a walkway నడకదారి కోసం హత్య
ABN , Publish Date - Jun 04 , 2026 | 12:29 AM
Murder for a walkway తాతయ్యకు, ఇంటి వెనుక ఉంటున్న మనవడికి కొద్దిరోజులుగా గొడవలు జరుగుతున్నాయి. నడకదారి విషయమై తరచూ వాదులాడుకుంటున్నారు. తాతయ్య అడ్డు తొలగిస్తే సమస్య ఉండదనుకున్న మనవడు చివరకు అందుకు తెగించాడు.
నడకదారి కోసం హత్య
తాతను హతమార్చిన మనవడు
జగన్నాథపురంలో ఘటన
బొబ్బిలి/రూరల్, జూన్ 3 (ఆంధ్రజ్యోతి):
తాతయ్యకు, ఇంటి వెనుక ఉంటున్న మనవడికి కొద్దిరోజులుగా గొడవలు జరుగుతున్నాయి. నడకదారి విషయమై తరచూ వాదులాడుకుంటున్నారు. తాతయ్య అడ్డు తొలగిస్తే సమస్య ఉండదనుకున్న మనవడు చివరకు అందుకు తెగించాడు. అర్ధరాత్రి వేళ నిద్రలో ఉన్న వృద్ధుడిపై నిర్దాక్షిణ్యంగా కత్తితో దాడి చేసి హతమార్చాడు. జగన్నాథపురం గ్రామానికి చెందిన కన్నాం రమణమూర్తి(70) విషాదాంతమిది. నిందితుడిని బుధవారం సాయంత్రం పోలీసులు అరెస్టు చేశారు. ఇన్‌చార్జి సీఐ ఎస్.శ్రీనివాస్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
బొబ్బిలి పట్టణం సమీపంలో ఉన్న జగన్నాఽథపురం గ్రామానికి చెందిన కన్నాం రమణమూర్తి(70) ఇంటి వెనుక మనవడు వరసైన కన్నాం వంశీ ఉంటున్నాడు. తాత ఇంటి నుంచి తన ఇంటికి వెళ్లడానికి నడవా (సందు) ఉందని వంశీ చెబుతున్నాడు. ఈ దారి విషయమై కొద్దిరోజులుగా వారి మధ్య గొడవలు జరుగుతున్నాయి. రమణమూర్తిని చంపేస్తేనే ఈ సమస్య పరిష్కారం అవుతుందని భావించిన మనవడు వంశీ ఈ నెల 1న అర్ధరాత్రి ఒంటిగంటన్నర సమయంలో రమణమూర్తి ఇంటికి వచ్చి కత్తితో కడుపులో పొడిచాడు. దీంతో ఆ వృద్ధుడు భయంతో గట్టిగా కేకలు వేశాడు. ఇరుగుపొరుగు వారు వచ్చి వెంటనే గాయపడ్డ రమణమూర్తిని బొబ్బిలి సీహెచ్‌సీకి తరలించారు. వైద్యుల సూచన మేరకు విజయనగరం మహారాజా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినప్పటికీ రమణమూర్తి పరిస్థితి విషమించి బుధవారం సాయంత్రం కన్నుమూశాడు. నిందితుడు వంశీ గతంలో ముగ్గురితో కలిసి గంజాయి కేసులో పట్టుబడ్డాడు. అప్పట్లో జువైనల్ శిక్ష అనుభవించి తిరిగి వచ్చాడు. వృద్ధునిపై దాడికి వినియోగించిన కత్తిని ఆన్‌లైన్‌లో బుక్ చేసి తెప్పించాడు. నిందితుడిని బుధవారం సాయంత్రం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ శ్రీనివాస్ తెలిపారు.
ఫ రమణమూరి భార్య లక్ష్మి 2013 లో రోడ్డు ప్రమాదంలో మరణించింది. వీరికి నలుగురు వివాహితులైన కుమార్తెలు, ఒక కుమారుడు (సివిల్ ఇంజనీరు) ఉన్నారు. రమణమూర్తి రంగస్థల కళాకారుడిగా పలు ప్రదర్శనలిచ్చారు.