Share News

Municipal Governance పుర‘పాలన’ అస్తవ్యస్తం

ABN , Publish Date - Jun 13 , 2026 | 11:57 PM

Municipal Governance in Disarray జిల్లాలోని పార్వతీపురం, సాలూరు పురపాలక సంఘాల్లో పాలన పూర్తిగా గాడి తప్పింది. అధికారులు, సిబ్బంది కొరతతో పరిస్థితి దయనీయంగా మారింది. పలు విభాగాలకు ఇన్‌చార్జి అధికారులే ఉండడంతో ప్రజలకు పూర్తిస్థాయిలో సేవలు అందడం లేదు. వారి సమస్యలేవీ పరిష్కారం కావడం లేదు. మరోవైపు అభివృద్ధి కార్యక్రమాలు కూడా జోరందుకోవడం లేదు.

Municipal Governance పుర‘పాలన’ అస్తవ్యస్తం
పార్వతీపురం మున్సిపల్‌ కార్యాలయం

  • వేధిస్తున్న అధికారుల కొరత.. కీలక విభాగాల్లో కుర్చీలు ఖాళీ

  • కొన్నేళ్లుగా ఇన్‌చార్జిలతోనే నెట్టుకొస్తున్న వైనం

  • ప్రజలకు పూర్తిస్థాయిలో అందని సేవలు

  • వార్డుల్లో సమస్యల తిష్ఠ

  • పట్టణాల్లో పెరిగిపోతున్న ఆక్రమణలు.. కొరవడిన పర్యవేక్షణ

  • పడకేసిన పారిశుఽధ్యం.. తీరని తాగునీటి కష్టాలు

  • ప్రత్యేకాధికారులు దృష్టి సారించాలని పురవాసుల విన్నపం

పార్వతీపురం టౌన్‌/సాలూరు, జూన్‌13(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని పార్వతీపురం, సాలూరు పురపాలక సంఘాల్లో పాలన పూర్తిగా గాడి తప్పింది. అధికారులు, సిబ్బంది కొరతతో పరిస్థితి దయనీయంగా మారింది. పలు విభాగాలకు ఇన్‌చార్జి అధికారులే ఉండడంతో ప్రజలకు పూర్తిస్థాయిలో సేవలు అందడం లేదు. వారి సమస్యలేవీ పరిష్కారం కావడం లేదు. మరోవైపు అభివృద్ధి కార్యక్రమాలు కూడా జోరందుకోవడం లేదు. వార్డుల్లో పారిశుధ్యం లోపించింది. తాగునీరు, వీధి దీపాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. ఈ ఏడాది మార్చి నెలాఖరులో జిల్లా కేంద్రం పార్వతీపురం మున్సిపాల్టీలో పాలకవర్గం పాలన కాలం ముగిసింది. దీంతో ప్రత్యేకాధికారిగా కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఇకపోతే సాలూరు ప్రత్యేకాధికారిగా డీఆర్వో హేమలతను నియమించారు. పురపాలక సంఘాలు అనేక సమస్యలతో సతమతమవుతున్న నేపథ్యంలో ప్రత్యేకాధికారులు వాటిపై దృష్టి సారించాల్సి ఉంది. వారి మార్క్‌ పాలనతో తిరిగి మున్సిపాల్టీలను గాడిలో పెట్టాలని ఆయా ప్రాంతవాసులు కోరుతున్నారు.

పార్వతీపురంలో పరిస్థితి ఇదీ..

- పార్వతీపురం మున్సిపాల్టీలో రెవెన్యూ విభాగానికి సంబంధించిన అధికారి రూబేను ఉద్యోగ విరమణ చేసి సుమారు 15 రోజులు కావస్తుంది. ప్రస్తుతం రెవెన్యూ విభాగం ఇన్‌స్పెక్టర్‌ ఈశ్వరరావు పట్నాయక్‌, ఇన్‌చార్జి ఆర్‌వోతో పాటు మేనేజర్‌ బాధ్యతలు కూడా చేపడుతున్నారు. పట్టణంలోని 15 సచివాలయాల పర్యవేక్షణాఽధికారిగా కూడా ఆయనే ఉన్నారు.

- కొన్నేళ్లుగా పట్టణ ప్రణాళిక విభాగానికి టౌన్‌ ప్లానింగ్‌ అధికారే లేరు. వాస్తవంగా ఒక టీపీవోతో పాటు ఇద్దరు టీపీఎస్‌లు ఉండాలి. కానీ విశాఖ నుంచి డిప్యూటేషన్‌పై వచ్చిన వెంకట నారాయణ అనే టీపీఎస్‌తోనే పట్టణ ప్రణాళిక విభాగం నడుస్తుంది. 15 సచివాలయాలకు సంబంధించి నలుగురు ప్లానింగ్‌ కార్యదర్శులు సెలవుల్లో ఉన్నారు. దీంతో ఇతర సచివాలయాల ప్లానింగ్‌ కార్యదర్శులపై పనిఒత్తిడి పెరుగుతోంది. సిబ్బంది కొరత, పర్యవేక్షణ లేక పట్టణంలో అనధికార లేఅవుట్లు, అక్రమ నిర్మాణాలకు అడ్డూఅదుపు లేకుండాపోతోంది.

- మున్సిపల్‌ ఇంజనీరింగ్‌ విభాగం డీఈగా విశాఖ జీవీఎంసీ నుంచి వచ్చిన శ్రీనివాసరాజు ఇన్‌చార్జి, ఎఫ్‌ఏసీ కమిషనర్‌గా ఉన్నారు. ఇంజనీరింగ్‌ విభాగంలో ముగ్గురు ఏఈలకు గాను ఇద్దరే ఉన్నారు. వచ్చేనెలాఖరున ఏఈ సన్యాసిరావు ఉద్యోగ విరమణ చేయనున్నారు. దీంతో డీఈ శ్రీనివాసరాజు, ఏఈ అప్పారావులే తాగునీరు, వీధిదీపాల నిర్వహణను చూసుకోవాల్సి ఉంది. ఇంజనీరింగ్‌ విభాగంలో అధికారులు ఖాళీ అయిపోతే ఈ వేసవిలో తాగునీటి సరఫరా పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది.

- పట్టణంలో జనాభా పెరుగుతున్నా.. ఆ స్థాయిలో పారిశుధ్య కార్మికులను నియమించడం లేదు. ప్రస్తుతం పార్వతీపురం మున్సిపాల్టీలో శాశ్వత ప్రాతిపదికన 30 మంది, కాంట్రాక్టు పద్ధతిపై 75 మంది పనిచేస్తున్నారు. అనాధికారికంగా 80 వేల మంది జనాభా ఉన్న పట్టణానికి 105 మంది పారిశుధ్య కార్మికులే ఉన్నారు. ఇకపోతే పారిశుధ్య నిర్వహణపై ఆ శాఖ అధికారుల పర్యవేక్షణ కూడా కొరవడింది. దీంతో పట్టణంలోని 30 వార్డుల్లో పారిశుధ్యం పడకేసింది.

- కార్యాలయంలోని ఆయా విభాగాల అధికారుల విధి నిర్వహణ, సిబ్బంది పని తీరును సూపరవైజింగ్‌ చేయాల్సిన మేనేజర్‌ గత నెలలో ఉద్యోగ విరమణ చేశారు.

- ప్రస్తుతం జూనియర్‌ అకౌంట్స్‌ అధికారి ఒక్కరే బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అకౌంట్స్‌ విభాగానికి సంబంధించి ఇంకా ఇద్దరు సీనియర్‌ అకౌంట్స్‌, ఇద్దరు జూనియర్‌ అకౌంట్స్‌ అధికారులు కావాల్సి ఉంది. అకౌంట్స్‌ విభాగంలో ఉండే ఇద్దరు జేఏవోలు గత ఏడాది రిటైర్డ్‌ అయ్యారు.

సాలూరు పురపాలక సంఘంలో..

సాలూరు మున్సిపాల్టీలోని పరిపాలన, ఇంజనీరింగ్‌, పారిశుధ్య, ప్రణాళిక విభాగంలో 140 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సుధీర్ఘకాలంగా ఇదే పరిస్థితి ఉండడంతో ఎలాంటి పనులు ముందుకు సాగడం లేదు. పేరుకే ఈ-ఆఫీసు అయినా కంప్యూటర్లు సక్రమంగా పనిచేయడం లేదు. పదేళ్ల కిందట కొనుగోలు చేసిన మానిటర్లు, సీపీయూలు పూర్తిగా పాడైపోయాయని.. ఇలా అయితే ఎలా పనిచేయగలమని సిబ్బంది వాపోతున్నారు. జెరాక్స్‌ కాపీల కోసం కూడా బయటకు వెళ్లాల్సిన వస్తోందిన వారు వాపోతున్నారు. కాగా కార్యాలయంలో అధికారులు, సిబ్బందికి ఏర్పాటు చేసిన క్యాబిన్లు సైతం పాడయ్యాయి. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా విద్యుత్‌ సరఫరాలో తరచూ అంతరాయం ఏర్పడుతోంది. గత వైసీపీ పాలనలో చైర్‌పర్సన్‌ గది నిర్మాణం, పాలకవర్గం గదికి ఏసీలు, రంగులు, ఇతర హంగులకు రూ.20 లక్షలపైగా ఖర్చు చేశారు. కార్యాలయాన్ని మాత్రం అస్సలు పట్టించుకోలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఖాళీలు ఇలా..

ఇంజనీరింగ్‌ విభాగంలో ఏఈ, వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌-2, పట్టణ ప్రణాళికా విభాగంలో పీపీఎస్‌-2, టీపీవో-2, సర్వేయర్‌, పరిపాలన విభాగంలో సీనియర్‌ సహాయకులు, సీనియర్‌ అకౌంటెంట్‌, జూనియర్‌ అకౌంటెంట్‌-2, రికార్డు అసిస్టెంట్‌, టైపిస్టు, బిల్లు కలెక్టర్లు-2ను నియమించాల్సి ఉంది. పారిశుధ్య అధికారితో పాటు 14 సచివాలయాల్లో పలువురు సిబ్బందిని కలుపుకుని మొత్తంగా 140 వరకు పోస్టులు ఖాళీలు ఉన్నాయి. ఇక్కడికి వచ్చిన సీనియర్‌ అసిస్టెంట్‌ డిప్యూటేషన్‌లో ఇతర పట్టణాల్లో పనిచేస్తున్నారు. విజయనగరంలో పనిచేసే అధికారి డిప్యూటేషన్‌పై ఇక్కడ శానిటరీ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహించేవారు. అయితే ప్రస్తుతం డిప్యూటేషన్‌ రద్దుకావడంతో మళ్లీ విజయనగరం వెళ్లిపోయారు. సచివాలయ ఉద్యోగికి ఇన్‌చార్జి శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ బాధ్యతలు అప్పగించారు. సాలూరు మున్సిపాలిటీ పారిశుధ్య విభాగానికి పూర్తిస్థాయిలో అధికారి లేరు.

ఆదాయానికి మించి ఖర్చులు

మున్సిపాలిటీలో పన్నులు, పలు సేవల ద్వారా ఏడాదికి రూ.3.95 కోట్ల వరకు ఆదాయం వస్తుంది. అయితే పారిశుధ్యం, నీటి సరఫరా, విద్యుత్‌ విభాగాల్లో పనిచేసే కార్మికుల జీతాలకే ఏడాదికి రూ.3.60 కోట్లు ఖర్చవుతుంది. ఇవి కాకుండా పారిశుధ్య వాహనాలకు డీజిల్‌, బ్లీచింగ్‌, చీపుర్లు, కార్యాలయ నిర్వహణకు నిధులు సరిపోవడం లేదు. కొన్నిసార్లు రూ.10వేలు కూడా మున్సిపల్‌ అకౌంట్‌లో ఉండడం లేదు. దీంతో కల్వర్టులు, రోడ్లు, కాలువలు, నీటి పథకాలు, సామాజిక మరుగుదొడ్లు మరమ్మతులకు గురైనా అధికారులు పట్టించుకోవడం లేదు. గత మూడేళ్లుగా సర్‌ చార్జీల (స్టాంప్స్‌, రిజిస్ర్టేషన్‌) బకాయిలు పేరుకుపోయాయి. సుమారు రూ.3 కోట్లకుపైగా వసూలు కావాల్సి ఉంది. దీనిపై కమిషనర్‌ రత్నకుమార్‌ను వివరణ కోరగా మున్సిపాల్టీ పరిస్థితిని ఉన్నతాధికారులకు వివరించామన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామని తెలిపారు.

ప్రత్యేకాధికారికి నివేదించాం..

పార్వతీపురం మున్సిపాల్టీలోని పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని మున్సిపల్‌ ప్రత్యేకాధికారికి నివేదించాం. అంతే కాకుండా ఆయా విభాగాల్లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇన్‌చార్జి అధికారులకు బాధ్యతలు అప్పగించాం. పట్టణంలో తాగునీరు, పారిశుధ్యం, వీధి లైట్ల నిర్వహణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నాం.

-డి.పావని, మున్సిపల్‌ కమిషనర్‌, పార్వతీపురం

Updated Date - Jun 13 , 2026 | 11:57 PM