ప్రజారంజకంగా మున్సిపల్ పాలన
ABN , Publish Date - Mar 15 , 2026 | 12:16 AM
బొబ్బిలి మున్సిపాలిటీలో పదినెలల టీడీపీ పాలకవర్గ పాలన ప్రజారంజకంగా సాగిందని ఎమ్మెల్యే బేబీనాయన అన్నారు.
బొబ్బిలి, మార్చి 14 (ఆంధ్రజ్యోతి): బొబ్బిలి మున్సిపాలిటీలో పదినెలల టీడీపీ పాలకవర్గ పాలన ప్రజారంజకంగా సాగిందని ఎమ్మెల్యే బేబీనాయన అన్నారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 17తో ప్రస్తుత మున్సిపల్ పాలకవర్గం పదవీకాలం ముగియనుందన్నారు. టీడీపీ పాలకవర్గం హయాంలో మున్సిపాలిటీ గణనీయమైన ప్రగతిని సాధించిందన్నారు. 31 వార్డుల్లో రూ. 10 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. సువర్ణముఖి నది నుంచి పట్టణానికి తాగునీటి సరఫరా చేసేందుకు రూ.123 కోటతో చేపట్టబోయే పనుల పునరుద్ధరణ ప్రక్రియకు సంబంధించిన టెండర్లు మరో వారంలో ఖరారవుతుందన్నారు. రిజర్వాయర్లు, పైపులైన్ పనులు జరుగుతాయన్నారు. గత ప్రభుత్వ నిర్వాకం ఫలితంగా ఈ తాగునీటి పథకానికి అదనంగా రూ. 33 కోట్ల భారం పడిందన్నారు. పెద్దగెడ్డ ప్రభావంగా వేగావతి నదిలో నీటి నిల్వలకు సంబంధించి సమస్య ఏర్పడుతున్నందున వాటర్ రీచార్జి కోసం చెక్ డ్యామ్స్, డైస్‌లను నిర్మిస్తామన్నారు. బుడా చైర్మన్ తెంటు లక్ష్మునాయుడు మాట్లాడుతూ రాచరికపు బిడ్డగా ఎటువంటి భేషజం లేకుండా నియోజకవర్గం, పట్టణం అభివృద్ధి కోసం ఎమ్మెల్యే తిరుగు తున్నారన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో రోజూ సభకు హాజరై ప్రజాసమస్యలు ప్రస్తావిం చారన్నారు. మున్సిపల్ చైర్మన్ రాంబార్కి శరత్‌బాబు మాట్లాడుతూ ఎక్కడా రాజీ పడకుండా పట్టణంలోని అన్ని వార్డుల్లో సమతుల్యంగా అభివృద్ధి పనులు చేసి చూపించామన్నారు. అందరికీ కృతజ్ఞుడిగా ఉంటానని చైర్మన్ శరత్‌బాబు అన్నారు.