Municipal Election పురపోరు.. కూటమి జోరు
ABN , Publish Date - Nov 04 , 2026 | 01:15 AM
Municipal Election Battle… Alliance on the Front Foot! పురపోరులో కూటమి అభ్యర్థులు సత్తాచాటారు. అన్నిచోట్లా సమీప ప్రత్యర్థులపై ఘన విజయం సాధించారు. జిల్లాలోని పార్వతీపురం, సాలూరు పురపాలక సంఘాలతో పాటు పాలకొండ నగర పంచాయతీలో మంగళవారం ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఈ సందర్భంగా మొదటి రౌండ్ నుంచే కూటమి పార్టీల అభ్యర్థుల హవా కొనసాగింది.
కౌంటింగ్ మొదటి రౌండ్ నుంచే ఆధిక్యం చూపిన వైనం
పార్వతీపురంలో గెలిచిన టీడీపీ చైర్‌పర్సన్ అభ్యర్థి కరుణ
పాలకొండలో జనసేన అభ్యర్థి విజయనిర్మల విజయం
అర్ధరాత్రి 12 గంటలైనా సాలూరులో తేలని ఫలితం
పార్వతీపురం, నవంబరు 3(ఆంధ్రజ్యోతి): పురపోరులో కూటమి అభ్యర్థులు సత్తాచాటారు. అన్నిచోట్లా సమీప ప్రత్యర్థులపై ఘన విజయం సాధించారు. జిల్లాలోని పార్వతీపురం, సాలూరు పురపాలక సంఘాలతో పాటు పాలకొండ నగర పంచాయతీలో మంగళవారం ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఈ సందర్భంగా మొదటి రౌండ్ నుంచే కూటమి పార్టీల అభ్యర్థుల హవా కొనసాగింది. పార్వతీపురం, సాలూరులో ఆలస్యంగా కౌంటింగ్ ప్రారంభమైంది. పాలకొండ నగర పంచాయతీ లో మాత్రం ఓట్లు లెక్కింపు సకాలంలోనే ప్రారంభమైంది. పార్వతీపురం, పాలకొండ, సాలూరులో కూటమి చైర్‌పర్సన్, కౌన్సిలర్, అభ్యర్థులు జోరు చూపించారు.
- పాలకొండ: నగర పంచాయతీలో కూటమి అభ్యర్థులు విజయదుందుభి మోగించారు. స్థానిక ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం నుంచి ముందు వరుసలో నిలిచారు. కూటమి అభ్యర్థులు 23 వార్డుల్లో విజయం సాధించారు. నాలుగు వార్డులకే వైసీపీ పరిమితమైంది. చైర్‌పర్సన్‌గా జనసేన అభ్యర్థి పల్లా విజయనిర్మల 6,629 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఆమెకు మొత్తం 10,859 ఓట్లు పడ్డాయి. వైసీపీ నుంచి బరిలో నిలిచిన పాలవలస ఇందుమతికి 4,230 ఓట్లు , స్వతంత్య్ర అభ్యర్థి భాసూరు శ్రీదేవికి 459 ఓట్లు వచ్చాయి. నోటాకు 119 ఓట్లు పడగా, 675 ఇన్‌వాలిడ్ ఓట్లును గుర్తించారు. ఇక 28 వార్డుల్లో జనసేన 12, టీడీపీ 10, వైసీపీ 4, బీజేపీ ఒకటి, స్వతంత్ర అభ్యర్థి ఒక వార్డుల్లో విజయం సాధించారు. కాగా పాలకొండలో 23,466 మంది ఓటర్లు ఉండగా.. 16,344 మంది ఓట్లు వేశారు.
- పార్వతీపురం/పార్వతీపురం టౌన్/ బెలగాం: పార్వతీపురం పురపాలక సంఘంలో కూటమి కౌన్సిలర్ అభ్యర్థుల హవా కొనసాగింది. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశా లలో ఓట్ల లెక్కింపు చేపట్టారు. 36 వార్డులకు సంబంధించి కౌంటింగ్ కోసం 9 టేబుల్స్, 6 రౌండ్‌లను ఏర్పాటు చేశారు. టీడీపీ 23, వైసీపీ 6, జనసేన 2, బీజేపీ 1, ఇండిపెండెంట్లు 3 వార్డుల్లో కౌన్సిలర్ అభ్యర్థులు గెలుపొందారు. కాగా పార్వతీపురంలో 40,765 ఓట్లు ఉండగా.. 28,064 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే వార్డుల్లో టీడీపీకి 11,888 ఓట్లు, వైసీపీకి 8,417, బీజేపీకి 396, జనసేన 1,319, ఇతరులకు 1,372 ఓట్లు వచ్చాయి. రాత్రి 12 గంటల సమయానికి ఇంకో వార్డుకు సంబంధించి ఓట్ల లెక్కింపు కొనసాగింది. ఆరు రౌండ్లలో 4,988 ఓట్ల ఆధిక్యంతో టీడీపీ చైర్‌పర్సన్ అభ్యర్థి బెలగాం కరుణ గెలుపొందారు.
- సాలూరు: సాలూరు మున్సిపాలిటీలో 32 వార్డుల్లో.. 11 టీడీపీ, 4 జనసేన, బీజేపీ-1, వైసీపీ 13, స్వతంత్ర కౌన్సిలర్ అభ్యర్థులు మూడు వార్డుల్లో గెలుపొందారు. చైర్‌పర్సన్ అభ్యర్థులకు సంబంధించి అర్ధరాత్రి 12 గంటలు దాటినా ఫలితం తేలలేదు. మొదటి రౌండ్‌లో వైసీపీ అభ్యర్థి వైసీపీ నుంచి రిబ్కారాణి ఆధిక్యంలో ఉన్నారు. మిగతా నాలుగు రౌండ్లకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగింది. దీంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కాగా పట్టణంలో 41,934 మంది ఓటర్లు ఉండగా.. 27,526 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.
పార్వతీపురంలో స్ర్టాంగ్ రూమ్ తాళాలు మాయం
పార్వతీపురం/టౌన్, నవంబరు 3(ఆంధ్రజ్యోతి): పార్వతీ పురంలో బ్యాలెట్ బాక్సులను భద్రపరిచిన స్ర్టాంగ్‌రూమ్ తాళాలు మాయమయ్యాయి. దీంతో మంగళవారం ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభించాల్సిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఆలస్యమైంది. పది గంటల వరకు తాళాలు ఎక్కడ ఉన్నాయో తెలియరాలేదు. దీంతో ఒక్కసారిగా గందరగోళం ఏర్పడింది. పార్వతీపురం సబ్ కలెక్టర్ సచిన్ రహర్, ఏఎస్పీ వెంకటేశ్వరరావు అక్కడకు చేరు కున్నారు. చివరకు అభ్యర్థుల అంగీకారంతో తాళాలను ఒక ప్రైవేట్ వ్యక్తి ద్వారా పగలగొట్టించారు. అనంతరం ఓట్లు లెక్కింపు ప్రక్రియ ప్రారంభించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రం వద్దకు జిల్లా ఎన్నికల పరిశీలకుడు చినరాముడు వచ్చి పరిస్థితిపై సమీక్షించారు. ఈ ఘటనకు బాధ్యులైన ఇద్దరిని సస్పెండ్ చేసినట్లు ప్రకటించారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన స్వర్ణ వార్డు, స్వర్ణ గ్రామం మేనేజర్ ఈశ్వరరావు, పట్టణ ప్లానింగ్ సూపర్‌వైజర్ సీహెచ్‌వీ నారాయణరావు సస్పెండ్ చేసినట్లు తెలిపారు.
పార్వతీపురం మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ ఓటమి
పార్వతీపురం, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): గత వైసీపీ సర్కారు హయాంలో పార్వతీపురం పురపాలక సంఘం చైర్‌పర్సన్‌గా ఉన్న బోను గౌరీశ్వరి తాజా ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. 23వ వార్డు టీడీపీ కౌన్సిలర్ అభ్యర్థి జి.గిరి పట్నాయక్ చేతిలో ఓడిపోయారు. గిరి పట్నాయక్‌కు 655 ఓట్లు రాగా, వైసీపీ అభ్యర్థి, మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ గౌరీశ్వరికి 154 ఓట్లు మాత్రమే వచ్చాయి.
వైసీపీకి ఘోర పరాజయం
పార్వతీపురం, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): పురపోరులో వైసీపీ ఘోర పరాజయం పాలైంది. పార్వతీపురం పురపాలక సంఘం, పాలకొండ నగర పంచాయతీలో ఆ పార్టీ అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. పాలకొండలో నాలుగు వార్డులు.. పార్వతీపురంలో సుమారు ఆరు వార్డుల్లో ఆ పార్టీ అభ్యర్థులు కౌన్సిలర్లుగా గెలుపొందారు. సాలూరులో మాత్రం భిన్న పరిస్థితి నెలకొంది. ఇక్కడ 13 వార్డుల్లో ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు.
పారదర్శకంగా కౌంటింగ్: కలెక్టర్
సాలూరు, నవంబరు 3(ఆంధ్రజ్యోతి): ఎన్నికల సంఘం సూచించిన మార్గదర్శకాలను కచ్చితంగా పాటిస్తూ.. ఓట్ల లెక్కింపు ప్రక్రియను పారదర్శకంగా చేపడుతున్నామని కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. మంగళవారం సాలూరు మున్సిపాలిటీలో ఓట్ల లెక్కింపు ప్రక్రియను పరిశీలించారు. కౌంటింగ్ కేంద్రంలో చేపట్టిన భద్రతా ఏర్పాట్లు, కౌంటింగ్ టేబుళ్లు, సిబ్బంది విధులు, రౌండ్ల వారీగా ఫలితాల నమోదు ప్రక్రియను తనిఖీ చేశారు. అనంతరం మీడియాతో కలెక్టర్ మాట్లాడుతూ.. అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్ల సమక్షంలోనే బ్యాలెట్ బాక్స్‌లను తెరిచి కౌంటింగ్ చేపడుతున్నామని, ప్రతీ రౌండ్ ఫలితాన్ని క్షుణ్నంగా పరిశీలించిన తర్వాతే అధికారికంగా ప్రకటిస్తున్నామని వివరించారు.
పటిష్ఠ బందోబస్తు: ఎస్పీ
బెలగాం: ఓట్లు లెక్కింపు నేపఽథ్యంలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్టు ఎస్పీ మాధవరెడ్డి తెలిపారు. పార్వతీపురం ప్రభు త్వ జూనియర్ కళాశాలలోని కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. పారదర్శకంగా లెక్కింపు జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట ఏఎస్పీ వెంకటేశ్వరరావు తదితరులున్నారు.
65 మందికి షోకాజ్ నోటీసులు
పార్వతీపురం, నవంబరు 3 (ఆంధ్ర జ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల విధులకు గైర్హాజరైన 65 మంది ఉద్యోగులకు కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి మంగళవారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. సచివాలయ శాఖలో 30 మంది, విద్యాశాఖలో 27 మంది, ఐసీడీఎస్‌కు చెందిన ఎనిమిది మందికి నోటీసులు ఇచ్చారు. విధులకు గైర్హాజరవడానికి గల కారణాలను మూడు రోజుల్లోగా లిఖితపూర్వకంగా తెలియజేయాలని ఆదేశించారు.