రేపే పురాధీశుల ప్రమాణస్వీకారం
ABN , Publish Date - Nov 21 , 2026 | 11:56 PM
Municipal Chairpersons to Take Oath Tomorrow జిల్లాలో పుర పాలకవర్గాల ప్రమాణ స్వీకారాలకు రంగం సిద్ధమైంది. ఈనెల 23న ఈ కార్యక్రమం నిర్వహించేందుకు యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. పార్వతీపురం, సాలూరు పురపాలక సంఘాలతో పాటు పాలకొండ నగర పంచాయతీలో ప్రిసైడింగ్ అధికారుల పర్యవేక్షణలో చైర్‌పర్సన్లు, కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
పార్వతీపురం, సాలూరు, పాలకొండలో చైర్‌పర్సన్లు, కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం
ప్రిసైడింగ్ అధికారుల ఆధ్వర్యంలో నిర్వహణ
హాజరుకానున్న మంత్రులు, ఎమ్మెల్యేలు
పార్వతీపురం, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో పుర పాలకవర్గాల ప్రమాణ స్వీకారాలకు రంగం సిద్ధమైంది. ఈనెల 23న ఈ కార్యక్రమం నిర్వహించేందుకు యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. పార్వతీపురం, సాలూరు పురపాలక సంఘాలతో పాటు పాలకొండ నగర పంచాయతీలో ప్రిసైడింగ్ అధికారుల పర్యవేక్షణలో చైర్‌పర్సన్లు, కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. పార్వతీపురంలో జరిగే కార్యక్రమానికి మంత్రులు కె.అచ్చెన్నాయుడు, గుమ్మిడి సంధ్యారాణి, ప్రభుత్వ విప్ జగదీశ్వరి, ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర, పాలకొండలో ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ హాజరుకానున్నారు.
పార్వతీపురం చైర్‌పర్సన్‌గా టీడీపీ అభ్యర్థి బెలగాం కరుణ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇక్కడ మొత్తం 36 వార్డులు ఉండగా.. 27 వార్డుల్లో కౌన్సిలర్లుగా కూటమి పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. ఇటీవల ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు టీడీపీలో చేరారు. దీంతో పాలకవర్గంలో కూటమి కౌన్సిలర్ల సంఖ్య 30కి చేరింది. వైసీపీ అభ్యర్థులు కేవలం ఆరు వార్డులకే పరిమితమయ్యారు. సాలూరు పురపాలక సంఘంలో 32 వార్డులు ఉండగా.. 16 వార్డుల్లో కూటమి అభ్యర్థులు కౌన్సిలర్లుగా విజయం సాధించారు. జనసేన అభ్యర్థి జి.విజయకుమారి చైర్‌పర్సన్‌గా గెలుపొందారు. స్వతంత్రులు మూడు వార్డుల్లో విజేతలుగా నిలిచారు. 13 వార్డుల్లో వైసీపీ అభ్యర్థులు గెలుపొందారు. పాలకొండ నగర పంచాయతీలో జనసేన అభ్యర్థి పి.విజయనిర్మల చైర్‌పర్సన్‌గా విజయం సాధించారు. 28 వార్డులకు గాను 23 వార్డుల్లో కూటమి అభ్యర్థులు కౌన్సిలర్లుగా గెలుపొందారు. నాలుగు వార్డులకే వైసీపీ అభ్యర్థులు పరిమితం కాగా.. ఒక వార్డులో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. వీరందరూ సోమవారం ఆయా పురపాలక సంఘాల్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
కొత్త పాలకవర్గాలపై కోటి ఆశలు...
పురాల్లో కొత్త పాలకవర్గాలపై ప్రజలు కోటి ఆశలు పెట్టుకున్నారు. జిల్లాలో దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కార మార్గం చూపుతారని భావిస్తున్నారు. పురపాలక సంఘాలను అభివృద్ధి పథంలో నడిపిస్తారని ఆశిస్తున్నారు. గత వైసీపీ పాలకవర్గాల హయాంలో మన్యంలో చెప్పుకోదగ్గ అభివృద్ధి పనులేవీ జరగలేదు. ప్రధానంగా జిల్లా కేంద్రం పార్వతీపురంలో ప్రజలకు పూర్తిస్థాయిలో తాగునీరు అందించలేకపోయారు. పారిశుఽఽధ్యం, ముంపు సమస్యను పరిష్కరించలేకపోయారు. ఇక సాలూరు మున్సిపాల్టీలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. తాగునీరు, పారిశుధ్యం, ట్రాఫిక్ సమస్యలు పుర ప్రజలను వేధిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేసినా.. గత వైసీపీ పాలకులు సక్రమంగా వినియోగించుకోలేకపోయారు. పాలకొండ నగర పంచాయతీలో రహదారుల విస్తీర్ణానికి మోక్షం కలగడం లేదు. ఇక్కడ కూడా పారిశుధ్యం, తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. వాటిపై మున్సిపల్ నూతన పాలకవర్గాలు దృష్టి సారించాల్సి ఉంది.